గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం: సీఎం కేసీఆర్


తెలంగాణా ఏర్పడితే చీకట్లే అని విభజన సమయం లో అనేకమంది అనుమానాలు వ్యక్తం చేశారన్నారు సీఎం కేసీఆర్. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, విద్యుత్ రంగంలో ప్రభుత్వం అనూహ్యమైన ప్రగతిని  సాధించిందన్నారు. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేసి, విద్యుత్ రంగాన్ని అద్భుతంగా అభివృద్ది చేసినందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు సీఎం.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నమై పోయిందన్నారు. కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే బీసీ కులాల జీవితాలు కుప్ప కూలి పోయాయన్నారు. ఈ వృత్తులకు ఆర్థిక చేయూత, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని బీసీల స్థితిగతులను మార్చాలని తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలని ప్రభుత్వం భావించింది. తెలంగాణా ప్రభుత్వం  భారతదేశంలో మరే రాష్ట్రంలో కూడా అమలు చేయని  గొప్ప కార్యక్రమాలను బిసిల కోసం రూపొందించి అమలు చేస్తున్నది. దీనికోసం మూడంచెల వ్యూహాన్ని ఎంచుకున్నది.  అందులో మొదటి వ్యూహం  నేటికీ మనుగడలో ఉన్న కులవృత్తులకు తగిన ఆర్థిక మద్దతు ఇవ్వడం కాగా , ఇంకా పాత సాంప్రదాయక పద్దతులనే అనుసరిస్తున్న కులవృత్తుల వారికి ఆధునిక పరిజ్ఞానాన్ని, పరికరాలను, అందించి నిలబెట్టటం అనేది రెండవ వ్యూహం.  ఇక మూడవది పరిణామ క్రమంలో పూర్తిగా  అంతరించి పోయిన వృత్తుల మీద ఇంకా ఆధారపడిన  వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించటం. ఈ మూడు వ్యూహాలకు తగిన విధంగా వివిధ పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

గొల్ల, కురుమలు, మత్స్యకారులు, నేత కార్మికులు, విశ్వకర్మలు, చాకలి, మంగలి తదితర కులాల సోదరులు మన తెలంగాణకున్న గొప్ప మానవ సంపద. సమాజానికి వీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి.  గొల్ల కుర్మలకు పెద్దఎత్తున గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారభించాం. ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశాం. వాటి ద్వారా మరో 30 లక్షల గొర్రె పిల్లల ఉత్పత్తి జరిగింది. పెరిగిన జీవ సంపదతో ఇప్పటికే 1,200 కోట్ల రూపాయల కు పైగా ప్రయోజనం గొల్ల కుర్మలకు  చేకూరింది. గొర్రెలకు కావలసిన దాణా కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీచేస్తుండటంతో గొల్లకుర్మలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ దేశంలో గొర్రెలతో పాటు ఇతర పశువులకు సత్వర వైద్య సేవలు అందించడం కోసం 100 సంచార పశువైద్యశాలలు నడుపుతున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.

రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సీడీ పై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీ  ప్రారంభించింది. ఒక్కో యూనిట్ కు 80 వేల రూపాయలు కేటాయించింది. రవాణా ఖర్చుల కోసం  మరో ఐదు వేల రూపాయలు అదనంగా అందిస్తున్నది. పాల సొసైటీల నుంచి కొనుగోలు చేసే పాలకు లీటరుకు నాలుగు రూపాయల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తున్నది.

రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించడం కోసం కావాల్సిన చేప పిల్లలను, రొయ్య పిల్లలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. అన్ని జలాశయాల్లో కోట్లాది చేప పిల్లలను వదులుతున్నది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. భవిష్యత్తులో మత్స్య పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

చేనేత కళకు తెలంగాణా పెట్టింది పేరు. గద్వాల, నారాయణ పేట, పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల నేత ఉత్పత్తులు నేటికీ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కాలమాన పరిస్థితుల వలన కొంత,  సమైక్య పాలనలో ప్రదర్శించిన నిరాదరణతో కొంత  చేనేత రంగం భయంకర  సంక్షోభంలో కూరుకుపోయింది.  చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలయ్యారు. చేనేత, పవర్ లూం కార్మికుల స్థితి గతులు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేక శ్రద్ధ వహించి వివిధ  కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. నేత కార్మికులు నేసె వస్త్రాలను  ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల  సందర్భంగా పంచే చీరల కోసం  చేనేత ఉత్పత్తులను అదేవిధంగా   పవర్లూం  ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. చేనేత వారికి  మరియు మరమగ్గాలవారికి నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీని కల్పిస్తున్నది. మార్కెట్ సదుపాయాలను మెరుగుపరిచి,  కార్మికులకు కనీస ప్రతిఫలం దక్కే విధంగా  చర్యలు తీసుకున్నది. చేనేత ఉత్పత్తులకు మంచి ప్రచారం కల్పిస్తున్నది. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్ టైల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy