గ్రేటర్ ఎన్నికలపై కోర్టు ఏం చెప్పింది..?

GHMC Highcourtగ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ను 15 రోజులకు తగ్గిస్తూ.. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై హై కోర్టు స్టే ఇచ్చింది. రేపటిలోగా వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని.. వెంటనే ఎన్నికల ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పాత విధానంలోనే… ఫిబ్రవరి 9 లోపు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలపై క్లారిటీ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై దాఖలైన పిటిషన్లను విచారించిన హై కోర్టు.. ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. షెడ్యూల్ కుదిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై.. స్టే విధించింది. ఎన్నికల నిర్వహణకు ఎంత సమయం కావాలన్న ప్రశ్నకు… రిజర్వేషన్ల ఖరారు తర్వాత 31 రోజుల్లో పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం బదులిచ్చింది. రేపటిలోగా.. వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ… ఫిబ్రవరి 9 లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

విభజన తర్వాత వర్తింపజేసుకున్న జీహెచ్ఎంసీ చట్టానికి.. అసెంబ్లీతోనే సవరణ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. కార్యనిర్వాహక అధికారాల పేరుతో.. ఎన్నికల షెడ్యూల్ ను 15 రోజులకు కుదించడాన్ని తప్పుబట్టారు. గతంలో కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇప్పటివరకూ వార్డుల రిజర్వేషన్లు కూడా ప్రకటించలేదని.. వాదించారు. జనవరి 31 వరకు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించి.. మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు.

ఇక.. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం.. జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ వాదించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే.. జనవరి 31లోపు ఎన్నికలు పూర్తి చేయాలన్నది.. ప్రభుత్వ ఆలోచనగా తెలిపారు. 2 వైపుల వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు.. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలిపేసింది. సెక్షన్ 101 ప్రకారం ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ చట్ట సవరణకు అధికారం ఉందా లేదా అన్న విషయంపై.. మరింత చర్చ జరగాలని కోర్టు స్పష్టం చేసింది.

హై కోర్టు తీర్పును గౌరవిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు కలిగే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకునే.. ఎన్నికల ప్రక్రియకు టైమ్ తగ్గించామన్నారు. కానీ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. మరోవైపు.. గ్రేటర్ ఎన్నికల్లో నోటాను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించడంతో.. అదే ప్రకారంగా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy