గ్రేట్ : పావురాన్ని కాపాడేందుకు రైలు ఆపారు

మానవత్వం ఇంకా బతికే ఉంది. అందుకు మరో ఉదాహరణ దొరికింది. ఓ పావురాన్ని బతికించేందుకు ఏకంగా రైలునే ఆపేశారు. ముంబైలో జరిగింది ఈ సంఘటన.

అది గోరేగావ్ స్టేషన్. సమయం పొద్దున పది గంటలు అవుతోంది. ముంబైలో ఆ టైమ్ అంటే పీక్ అవర్ అన్నట్టే. పిల్లలు, విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. లైఫ్ లైన్ లాంటి… లోకల్ ట్రైన్లు సర్రు సర్రుమని దూసుకెళ్తుంటాయి. అలాంటి టైమ్ లో ఓ రైలు ఆగింది. ఐదు నిమిషాలు ఆగింది. ఆగిందని ఎవరూ కోప్పడలేదు. పైగా మెచ్చకున్నారు.

మళ్లీ మొదటికి వద్దాం. లోకల్ ట్రైన్ గోరేగావ్ స్టేషన్ కు వచ్చింది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఎండ్ లో … పైనున్న ఎలక్ట్రిక్ తీగలకు ఓ పావురం వేలాడుతోంది. దారం దాని బాడీకి, కాళ్లకు చుట్టుకుని ఉండటంతో.. అది కదల్లేకపోయింది. దీనంగా అరుస్తూ వేలాడుతున్న ఆ పావురాన్ని ఓ ప్యాసింజర్ చూశాడు. డిప్యూటీ స్టేషన్ మాస్టర్ కు చెప్పాడు. వెంటనే అతడు ఫైర్ బ్రిగేడ్ ను అలర్ట్ చేశాడు.

ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. రైలును కొంత సేపు ఆపాలని నిర్ణయించారు. ఉదయం 10.28 సమయంలో ఐదు నిమిషాల పాటు పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. రైలును అక్కడే ఆపేసి… హైమాస్ట్ ల్యాడర్(పెద్ద నిచ్చెన) సాయంతో…. కరెంట్ తీగలకు… దారంతో వేలాడుతున్న పావురాన్ని కాపాడారు. దానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. పక్షి, జంతు సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి దానిని సురక్షితంగా అప్పజెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాకే… ఆ రైలును ఆ లైన్ వెంబడి పంపించారు. పావురాన్ని కాపాడిన సిబ్బందిని, సమాచారం ఇచ్చిన ప్యాసింజర్ ను అందరూ అభినందించారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy