గ్లోబల్ ముప్పు : 100 దేశాలపై వైరస్ ఎటాక్

hackingకంప్యూటర్‌ హ్యాకర్లు పంజా విసిరారు. అమెరికా వాడే హ్యాకింగ్‌ టూల్స్‌నే టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను.. 100 దేశాల్లోని 57వేల కంప్యూటర్లలోకి చొరబడ్డారు. ‘వాన్న క్రై’ అనే పేరుతో కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతున్న ఈ వైరస్‌.. క్షణాల్లో కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. వైరస్‌ ఎటాక్ చేసిన క్షణాల్లోనే.. ఫైల్స్ ఓపెన్ కావాలంటే డ‌బ్బు చెల్లించాలన్న సమాచారం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 గంటల్లోనే ఏకంగా 45 వేలకు పైగా సైబర్‌ దాడులు జరిగినట్లు గుర్తించారు నిపుణులు. ఇప్పటికే 57వేల కంప్యూటర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. అమెరికా భద్రతా విభాగం జాతీయ సెక్యూరిటీ సంస్థ ఉపయోగించే హ్యాకింగ్‌ టూల్స్‌తో ఈ సైబర్‌దాడులు జరిగాయి. ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. బ్రిట‌న్‌, ర‌ష్యా, ఉక్రెయిన్‌, తైవాన్ దేశాల్లో ఈ దాడులు ఎక్కువ‌గా జ‌రిగిన‌ట్లు సైబ‌ర్ నిపుణులు వెల్లడించారు.

బ్రిటన్ లో ఏకంగా హాస్ప‌ట‌ళ్లు, క్లినిక్‌లు మూసివేశారు. కంప్యూట‌ర్లు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో వైద్య స‌హాయాన్ని నిలిపివేశారు. ఒక‌వేళ రాన్సమ్‌వేర్‌ వైర‌స్‌ నుంచి  బ‌య‌ట‌ప‌డాలంటే డ‌బ్బులు చెల్లించాలి. శుక్ర‌వారం (మే 12) జ‌రిగిన దాడి నుంచి త‌ప్పించుకునేందుకు చాలా మంది బిట్‌కాయిన్ ద్వారా డ‌బ్బులు కూడా చెల్లించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆన్‌లైన్‌లో 300 డాల‌ర్లు చెల్లిస్తే కంప్యూట‌ర్ వైర‌స్ తొలగిపోయే అవ‌కాశం ఉంటుంది. ద షాడో బ్రోక‌ర్స్ అనే హ్యాకింగ్ బృందం వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించిన‌ట్లు అనుమానాలు వ‌స్తున్నాయి. వాళ్లే ఆ వైర‌స్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. మార్చి నెల‌లో ఇలాంటి వైర‌స్‌ల‌ను ఎదుర్కొనేందుకు మైక్రోసాఫ్ట్ ఓ ప్యాచ్‌ను రిలీజ్ చేసింది. చాలా మంది దీన్ని అప్ డేట్ చేయలేదు.

రాన్సమ్ వేర్ దాడితో బ్రిట‌న్‌లో 16 హాస్ప‌ట‌ళ్లు పేషెంట్ల అపాయింట్‌మెంట్లు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. కంప్యూట‌ర్ల‌కు వైర‌స్ రావటంతో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు నిలిపివేశారు. స్పెయిన్‌కు చెందిన జాతీయ టెలిఫోన్ సంస్థ కూడా వైర‌స్ బారిన పడింది. ఎట‌ర్న‌ల్‌ బ్లూ పేరుతో రాన్సమ్ వేర్ వైర‌స్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని స్పెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఇది అతిపెద్ద సైబ‌ర్ దాడి అని బ్రిట‌న్ సెక్యూర్టీ నిపుణులు కెవిన్ బీమోంట్ ప్రకటించారు.

ర‌ష్యా ప్ర‌భుత్వం కూడా సైబ‌ర్ దాడిపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఒక శాతం వ‌ర‌కు కంప్యూట‌ర్లు రాన్‌స‌మ్ వైర‌స్ ప్ర‌భావానికి లోనైన‌ట్లు తెలిపింది. యాంటీవైర‌స్ బృందాలు రాన్సమ్ వేర్ ను ధ్వంసం చేసేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు ర‌ష్యా వెల్ల‌డించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy