ఘనంగా పూరీ జగన్నాథుని రథయాత్ర

rath-yatraపవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథుని రథయాత్ర ఆదివారం (జూన్ 25)న ఘనంగా ప్రారంభమైంది.  ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒడిషా రాష్ట్రంలో ఉన్న పూరీ దివ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలిసి కొలువుతీరాడు. జగన్నాథుడి రథయాత్ర 12 రోజుల పాటు జరగనుంది.

పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. సాధారణంగా అన్ని దేవాలయాలలో మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో, ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో తయారుచేసినవి ఉంటాయి. కాని ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో చేస్తారు. ఆ విగ్రహాలనే ఉత్సవ మూర్తులుగా ఊరేగిస్తారు. ప్రసాదంగా పెట్టే అన్నం, పప్పు మొదలైనవి కుండలలో వండుతారు. ఇతర దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కాకుండా సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయం సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.

రథయాత్రకు ఉపయోగించే రథాలను ప్రతి ఏడాది కొత్తగా తయారుచేస్తారు. జగన్నాథుడు ఊరేగే రథాన్ని ‘నందిఘోష్‌’ లేదా ‘గరుడధ్వజ’ అంటారు. 45 అడుగుల ఎత్తుతో, 832 దుంగలతో చేయబడి, 16 చక్రాలు కలిగి ఉంటుంది. నందిఘోష్‌ చతుర్వేదాలకు ప్రతీకగా 4 గుర్రాలు పూన్చబడి ఉంటాయి. బలభద్రుని రథం ‘తాళధ్వజ్‌’ 44 అడుగుల ఎత్తుతో, 14 చక్రాలతో చతుర్యుగాలకు ప్రతీకగా నాలుగు గుర్రాలు లాగుతూ ఉంటాయి. సుభద్ర రథం ‘దర్పదళన్‌’ 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో ఉంటుంది. అక్షయ తృతీయ రోజున రథాల తయారీ మొదలుపెడతారు. ఈ రథాలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. 1072 కొయ్య దుంగలతో 120 మంది పనివారు రథాల తయారీలో పాలుపంచుకుంటారు.

జగన్నాథయాత్ర సుమారు 3 కి.మీ. మేర సాగుతుంది. ముందు బలభద్రుని రథం వెళ్తుండగా… తరువాత సుభద్ర రథం దాన్ని అనుసరిస్తూ జగన్నాథ రథం సాగుతుంది. సోదరికి రక్షణగా ఆమె వెనుక జగన్నాథుడు పయనిస్తాడు.

జన్నాథుని దైవ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy