చంద్రులు చల్లబడ్డారా?

chandrababu-naidu_650x400_71445180004ఓటుకు నోటు కేసు తరువాత  చాన్నాళ్లకు ఇద్దరు తెలుగు సీఎంలు కలుసుకున్నారు. కొన్నాళ్లుగా రాజకీయంగా చాలా విషయాలు వివాదం రేపాయి. ఒకరినొకరు హెచ్చరించుకునేదాకా పోయింది. ఇక ఇద్దరు ఎదురుపడతారో లేదో అనునేంత పరిస్థితి వచ్చింది. కృష్ణా జలాల పంచాయితీ… ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం తర్వాత… అమరావతి ఆహ్వానంతో ఇద్దరు చంద్రులు కలుసుకోవడం రెండు రాష్ట్రాల్లో ఆసక్తి రేపింది.

తెలుగు రాష్ర్టాల సీఎంల భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేసీఆర్ ఇంటికి వచ్చి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు. దీనిపై వారం పది రోజుల నుంచే మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. చివరికి ఆదివారం సాయంత్రం పాత సహచరుల భేటీ జరిగింది.

యేడాదిన్నర కాలంలో నీళ్లు, నిధులు, ఉద్యోగుల విషయంలో రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటలు పేలుతూనే ఉన్నాయి. అది చాలదన్నట్టు ఓటుకు నోటు వ్యవహారం మరింత హీట్ పెంచింది. పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఏపీ పునరంకిత సభలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. మూడో కన్ను తెరుస్తానన్నారు. కేసీఆర్ ను గల్లంతుచేస్తానన్నారు. ఈ రగడ కొన్ని నెలల పాటు కొనసాగి చల్లారింది.

గవర్నర్ ఇద్దరు సీఎంలను కలిపినప్పుడు, ఆ తరువాత కృష్ణా జలాల వివాదంపైనా ఇద్దరు చంద్రులు అధికారికంగా కలుసుకున్నారు. ఆ తరువాత రాష్ట్రపతి స్వాగతానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో కలుసుకొని షేక్ హ్యాండ్ చేసుకున్నారు. మరోసారి దత్తన్న నిర్వహించిన అలయ్ బలయ్ లో కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో అనధికారికంగా ఎదురుపడ్డారు. ఆ తర్వాత పలుమార్లు కలిసే అవకాశం ఉన్నా వివాదాల కారణంగా, ఇతర కారణాలతో ఒకరినొకరు కలుసుకోవడానికి ఇష్టపడలేదు ఇద్దరు సీఎంలు. కలవాల్సిన సందర్భాలు వచ్చినా రకరకాల కారణాలతో ఎవరో ఒకరు దూరంగా ఉంటూ వచ్చారు. ఇంతకాలం తర్వాత అమరావతి ఆహ్వానం కోసం అధికారికంగా ఇద్దరు చంద్రుల భేటీ జరిగింది.

ఈ మధ్య కాలంలో చంద్రబాబు వాయిస్ బాగా తగ్గించారు. ఇటు కేసీఆర్ కూడా చంద్రబాబు లక్ష్యంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రెండు రాష్ట్రాలకు చెందిన ఇతర నాయకులు మాటల వార్ కొనసాగిస్తున్నా ఇద్దరు అగ్రనేతలు మాత్రం దీనికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తాజా భేటీలో సానుకూలంగా మాట్లాడుకోవడం, రెండు రాష్ట్రాల అభివ్రుద్ధిలో సహకారంపై చర్చలు జరగడం అందరిలో ఆసక్తి రేపింది. దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది పక్కనబెడితే… రాజకీయ వివాదాలు, మాటల యుద్ధాలు మాత్రం కొంత వరకు చల్లబడే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు స్వయంగా వస్తానంటే వద్దనడం మంచి సంప్రదాయం కాదన్న ఉద్దేశంతో కేసీఆర్ భేటీకి ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. భేటీ తర్వాత ఆహ్వానానికి సానుకూలంగా స్పందించడం కూడా గౌరవంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పాత వివాదాలకు తోడు చరిత్ర పుస్తకాల్లో తెలంగాణ పాఠాల తొలగింపుపైనా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జరిగిన భేటీని జనం ఎలా చూస్తున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

అమరావతి శంకుస్థాపన సందర్భాన్ని ఉపయోగించుకొని భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం… కేసీఆర్ పట్టువిడుపులతో సానుకూలంగా స్పందించడం…మంచి వాతావరణానికి అవకాశం కల్పించింది. మరోవైపు చంద్రబాబుపైనా తెలుగు తమ్ముళ్ల నుంచి ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీపై వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఓ మెట్టు దిగాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమచారం.

ఇద్దరు సీఎంల భేటీ వల్ల ఇప్పటికిప్పుడే సమస్యలు కొలిక్కి వచ్చినట్టు కాదు. కానీ ఇప్పటివరకు ఉన్న పరిస్థితితో పోలిస్తే రాజకీయ వివాదాలు కాస్త చల్లబడే అవకాశం ఉంది. రెండువైపులా కిందిస్థాయిలో నాయకుల మధ్య మాటలు ఎలా ఉన్నా… అగ్రనేతలు ఇద్దరూ కలుసుకోవడం మంచి పరిణామం. ఈ భేటీ స్ఫూర్తితో ఉమ్మడి సమస్యలపై సానుకూలంగా చర్చ జరిగేలా మరిన్ని అడుగులు పడాలని జనం కోరుకుంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy