చదువుతో..ఉద్యోగాలకు ముడిపెట్టవద్దు: ఈటల

eetelaచదువంటే ఉద్యోగం కాదని.. ఉద్యోగాలకు ముడిపెట్టవద్దన్నారు మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై స్వల్పకాలకి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈటల. ప్రతిపక్షాలు అన్ని సమస్యలను రాజకీయ కోణంలో చూడటం విచారకరమన్నారు.

రాష్ట్రంలో 4 లక్షల 41 వేల 995 ఉద్యోగాలు ఉంటే.. లక్షా 08 వేల 132 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో భాగంగా 63వేల 152 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నాన్నారు. అన్ని ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. నిరుద్యోగ సమస్య అని మంత్రి తెలిపారు. రెండు శాతం కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలుండవన్నారు. అందరూ చెప్పినట్లుగానే.. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్ పెట్టుకొని తెలంగాణ సాధించామని తెలిపారు. అందుకనుగుణంగానే ఒక్కొక్కటి నెరవేర్చుతున్నామన్నారు.

ఏ ప్రభుత్వమూ 2 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు మంత్రి ఈటల. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రూ. 1500 కోట్లు కేటాయించామని చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఇప్పటికి వంద శాతం ఉద్యోగ విభజన పూర్తి చేయలేదన్నారు. ఇంకా 1400 మంది ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందన్నారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు వస్తున్న క్రమంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయన్నారు. నిరుద్యోగం క్రమక్రమంగా తగ్గుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా.. విద్యార్థులు, నిరుద్యోగులు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఈటల.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రయత్నించినప్పటికీ కోర్టు 1996కు ముందున్న వారిని మాత్రమే క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు మంత్రి. ఆ ప్రక్రియ కంటే ముందే సీఎం కేసీఆర్ సమాన పనికి సమాన వేతనం విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

TSPSC దేశంలోనే గొప్పగా పని చేస్తుందన్నారు మంత్రి ఈటల. ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు TSPSC ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. TSPSC పారదర్శకంగా పని చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 73 నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్న వార్తలు, లంచాలు, అక్రమాలు జరిగినట్లు ఇప్పటి వరకు TSPSC  చరిత్రలో లేదన్నారు…దానిపై పై అపారమైన నమ్మకం విశ్వాసం ఉందన్నారు. రాబోయే కాలంలో TSPSC గొప్ప సంస్థగా నిలుస్తుందన్నారు మంత్రి ఈటల. ఏదేమైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.

ఉద్యోగాల భర్తీపై భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ… ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం వాకౌట్‌ చేశాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy