చాయ్ అమ్మి 23 దేశాలు తిరిగారు!

‘‘ఊటీ పోదామనుకుంటే చేతిలో పైసల్లేవ్‌.. పారిస్ వెళ్దామంటే టైం కుదరట్లేదాయే.. ఏం చెయ్యాలి?’’.. టూర్లకు వెళ్లాలని మనసులో ఉన్నా చాలా మందిది ఇలాంటి పరిస్థితే. మనసుండాలే గానీ ప్రతి దానికీ మార్గముంటుంది అని నిరూపిస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా తమ ఆకాంక్షను, కలను సాకారం చేసుకుంటున్నారు. అలాగని వాళ్లేదో బాగా డబ్బున్నోళ్లేం కాదు.. ఇద్దరూ కష్టపడితేగానీ పూట గడవని పరిస్థితి. అయినా కూడా 45 ఏళ్లలో 23 దేశాలను చుట్టొచ్చారు. మహీంద్రా ఓనర్‌‌‌‌ ఆనంద్‌ మహీంద్రా మనసును దోచేశారు. కృష్ణా, రామ అనుకుంటూ గడపాల్సిన వయసులో.. హద్దుల్లేని పక్షుల్లా రెక్కలు కట్టుకువిదేశాలకు ఎగిరిపోతున్న ఆ ముసలి మనసులకు అదెలా సాధ్యమయ్యిందో చూద్దాం…

విజయన్‌ , మోహన.. ఇద్దరూ ఏడు పదుల వయసులోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లయి 45 ఏళ్లవుతోంది. బతుకు బండిని లాగేందుకు 56 ఏళ్ల క్రితం 1963లో కొచ్చి నడిబొడ్డున శ్రీ బాలాజీ కాఫీ హౌస్‌ అనే చిన్న టీ కొట్టును తెరిచారు. రోజంతా ఇద్దరూ కష్టపడితే మిగిలేది రూ.300 (ఇప్పటి లెక్క). అంత చిన్న బతుకే అయినా.. ప్రపంచాన్ని చుట్టి రావాలి అని వాళ్ల మనసు ఉరుకులు పెట్టించేది. మరి, అంత చిన్న సంపాదనతో అది సాధ్యమేనా? కాదు కదా.. వచ్చిన దాంట్లోనే బతుకీడుస్తూ కొంత దాచుకుంటూ.. మరికొంత మొత్తాన్ని బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకుంటూ విదేశాలకు వెళ్లేవారు. దేశాన్ని బట్టి టూర్‌‌‌‌ వెళ్లొచ్చాక మూడేళ్లకు ఆ లోన్‌ మొత్తాన్ని తీర్చేసేవారు. ఇలా వాళ్లు వెళ్లిన ప్రతి ట్రిప్‌ కు లోన్లే వాళ్ల కలను తీర్చాయి. ఎక్కు వగా తిరిగిన దేశాల్లో సింగపూర్‌‌‌‌, స్వి ట్జర్లాం డ్‌, అమెరికా అంటే చాలా ఇష్టమని ఈ దంపతులు చెబుతారు. ఇప్పుడు స్వీడన్‌ , డెన్మార్క్‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌, గ్రీన్లాం డ్‌, నార్వేలను చుట్టి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్లు చుట్టొచ్చిన ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, అక్కడ అయిన ఖర్చుల బిల్లులను టీ షాప్‌ గోడలపై పెట్టారు. అంతేకాదు, వాళ్లపై ఇన్విజిబుల్‌ వింగ్స్‌‌‌‌ అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. హరి ఎం మోహనన్‌ అనే డైరెక్టర్‌‌‌‌ తీసిన ఆ నిజ  జీవితపు డాక్యుమెంటరీ.. 2018 ఫిల్మ్‌‌‌‌ ఫేర్‌‌‌‌ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. వాళ్ల కథ ఆనంద్‌ మహీంద్రాను బాగా కట్టిపడేసింది. రెక్కలు కట్టుకు ఎగిరిపోతున్న ఆ వృద్ధ దంపతులకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సి న అవసరముందని ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఫోర్బ్స్‌ డబ్బున్నోళ్ల జాబితాలో వాళ్లు లేకపోవచ్చు. కానీ, నా దృష్టిలో మాత్రం మన దేశంలో వాళ్లే అత్యంత సంపన్నులు. వాళ్లకున్న సంపద జీవితంపై వాళ్లకున్న యాటిట్యూడే. వాళ్ల పట్టణానికి వెళ్లినప్పుడు కచ్చితంగా వాళ్ల షాపులో టీ తాగుతా. వాళ్ల పెళ్లి రోజు కానుకగా తర్వాతి ట్రిప్పుకు నిధులిస్తే ఎలా ఉంటుంది.. ఏమంటారు’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy