చారిత్రక అద్భుతం.. కరుణామయుని మందిరం

mdk churchప్రేమ, శాంతి, సామరస్యాలకు… అది పుణ్య స్థలం. విశ్వాసం, నమ్మకం, మహిమలకు నెలవు.. ఆ కోవెల. అదే మెదక్ క్యాథడ్రిల్ చర్చ్. ఆసియాలోనే ఇది అతిపెద్ద చర్చ్. ప్రపంచంలో ఇది వాటికన్ క్యాథలిక్ చర్చ్ తర్వాత రెండవ స్థానాన్ని పొందిన చర్చ్. కరుణామయుడైన ఏసుక్రీస్తు ఈ చర్చ్ లో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం లోకి అడుగుపెట్టగానే.. అణువణువునా.. భక్తి భావం ఉంపొంగుతుంది. తెలియని మహిమేదో తాకి….పాపాలను పోగొడుతుంది. కష్టాలను తీరుస్తుంది. అందుకే కులమాతాలతీంగా, ప్రాంతీయభేదాలు లేకుండా… కరుణామయుడుని భక్తులు దర్శించుకుంటారు. ఇక క్రిస్మస్ సమయాల్లో అయితే.. లక్షలాదిమంది క్రైస్తవ భక్తులు మెదక్ చర్చ్ కు తరలి వస్తారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చ్ లో జరుగుతున్న ఏసుక్రీస్తు పుట్టిన రోజు సంబరాలు, మెదక్ చర్చ్ విశేషాలు మీ కోసం….

కష్టాలతో వచ్చినవారికీ కష్టాలు తీరిపోతాయి. ప్రశాంతత లేనివారికి ప్రశాంతత దొరుకుతుంది. నమ్మకంతో  ఇక్కడకు వచ్చిన వారికి ఆ నమ్మకం… మరింత రెట్టింపు అవుతుంది. అంత మహిమల గల చర్చ్…. మెదక్ క్యాథడ్రిల్ చర్చ్. కరవు కాటకాలతో అల్లాడుతున్న మెదక్ ప్రజలను గట్టెక్కించాలనే ఉద్దేశంతో కట్టిన… చర్చ్ ఇది. తినడానికి తిండిలేక అల్లాడుతున్న ప్రజలకోసం… నిర్మించిన దేవాలయం ఇది. క్రిస్మస్ సమయంలో చేసే ప్రత్యేక ప్రార్థనల కోసం.. సౌత్ ఇండియా నుంచే కాదు దేశవిదేశాల నుంచి కూడా… ఎంతో మంది భక్తులు… ఈ చర్చ్ ను సందర్శిస్తుంటారు. ఈ సారి జరుగుతున్న వేడుకల్లో మరిన్ని ప్రత్యేకతలు ఉండడంతో… క్రైస్తవుల రద్దీ పెరిగింది.

ప్రపంచ ప్రఖ్యాత మెదక్ క్యాథడ్రిల్ చర్చ్ లో క్రిస్ మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది క్రైస్తవ భక్తులు.. తరలివస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చ్ ను రంగురంగుల దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ చర్చ్.. అద్భుతమైన కళా ఖండం. సుందరమైన నిలయం. ఈ చర్చ్.. ప్రత్యేకతలకు మారు పేరు. పైకప్పు, గోడలు, రంగు రంగుల గాజు పటాలు, పైప్ ఆర్గాన్…హాల్… ఇలా చెప్పుకుంటూ పోతే…మెదక్ దేవాలయానికి ఉన్న ప్రత్యేకతలు..ప్రపంచంలో మరే చర్చ్ లోనూ కనిపించవు. అదేవిధంగా ఈ చర్చ్ శంఖుస్థాపన, నిర్మాణం, ప్రస్థానాల వెనుక… ఏసుక్రీస్తు జీవిత కథ ముడిపడి ఉంటుంది. బైబిల్ ప్రకారమే ఈ చర్చ్ ను నిర్మించడం.. విశేషం. దీనికోసం బ్రిటన్ లోని పాపులర్ చిత్రకారులు, ఇంజనీర్లు ఇక్కడకొచ్చి… ఈ చర్చ్ నిర్మాణంలో స్వయంగా పాల్గొన్నారు. అందుకే మెదర్ చర్చ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచింది.

బైబిల్ ఆధారంగా చర్చ్ నిర్మాణం

church medak1924, డిసెంబర్ 25వ తేదీన.. ఈ చర్చ్.. ప్రారంభమైంది. ప్రపంచంలో ఈ దేవాలయం…ప్రసిద్ధిగాంచడానికి అనేకమైన ప్రత్యేకతలున్నాయి. ఇందులో మొదటిది బైబిల్ లో చెప్పిన ప్రముఖమైన సంఖ్యలను తీసుకుని… ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. 3 అనే సంఖ్య…తండ్రి కుమార పరిశుద్దాత్మ అనే విశ్వాసాన్ని, 10 అనే సంఖ్య.. పది ఆజ్ఞలను, ఏడు అనే సంఖ్య ఏసుప్రభువు శిలువుమీద పలికినటువంటి మాటలు కావడంతో.. ఈ సంఖ్యలతో శంకుస్థాపన, నిర్మాణం, చర్చ్ ప్రారంభం..అన్నీ చేశారు. అదేవిధంగా… 24 సంఖ్య.. పరలోక రాజ్యంలో ఉన్న 24 మంది పెద్దలు, 12 సంఖ్య.. ఏసుప్రభువుకు 12 మంది శిష్యులు. అలాగే.. ఏసుప్రభువు… ఆకలిగా ఉన్న 5 వేల మందికి ఒకేసారి భోజనం పెట్టిన గుర్తుగా… ఈ చర్చ్ లో 5000 మంది ఒకేసారి కూర్చుని ప్రార్థన చేసుకునే విధంగా చర్చ్ ను నిర్మించడం విశేషం.

చర్చ్ లోపల గాజు అద్దాలతో ఏసు క్రీస్తు జీవితాన్ని తీర్చిదిద్దారు. తూర్పు, పడమర, ఉత్తర భాగములలో ఈ రంగుల అద్దాలు ఉన్నాయి. ఏసుప్రభువు జీవితంలో జరిగినట్టువంటి ముఖ్యమైన ఘట్టములు, శుభవర్తమానములు… అని దేనయితే తెలియజేస్తామో…దానికి సంబంధించిన చిత్రపఠాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. మొదటి చిత్ర పఠం..ఆయన జన్మదినానికి సంబంధించింది. ఆకాశంలో…ఎక్కడో సింహాసనంలో కూర్చుని ఉండాల్సిన ఏసుక్రీస్తు… పశువుల పాకలో మానవుడి రూపంలో పుట్టాడు. మనుషులకోసం.. పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చారు…ఏసు క్రీస్తు. ఈ చర్చ్ లోని తూర్పున ఉన్న గాజు అద్దాలను చూస్తే…ఏసుక్రీస్తు పుట్టుక అందరికీ గుర్తుకొస్తుంది.

అబ్బురపరిచే పెయింటింగ్స్

అదేవిధంగా పడమరలో శిలువ చిత్రపటం..కనిపిస్తుంది. రక్తం చిదించకుండా పాపానికి విమోచన లేదు. మానవుడికి మోక్షము ఉండదు. శిలువ వేయబడిన ఏసుక్రీస్తును చూస్తే..ఇదే తెలుస్తుంది. అలాగే…ఉత్తరం దిశలో ఉన్న గాజు చిత్రపటం….సమాధి నుంచి తిరిగిలేచిన ఏసుక్రీస్తుది. గుడ్ ఫ్రైడే తర్వాత మూడవ రోజు ఏసుక్రీస్తు..తిరిగిలేస్తాడు. చెడు జరిగాక మంచి జరుగుతుంది. అలాగే మంచే ఎప్పుడూ విజయం సాధిస్తుందని ఏసుక్రీస్తు తిరిగి లేచి నిరూపిస్తారు..అని బైబిల్ చెబుతుంది. ఇలాంటి మహత్తర విషయాలతో ఈ గాజు చిత్రాలు ఇంగ్లాండ్ కు చెందిన ఫ్రాంకో ఓ సాలిస్ బరి అనే వ్యక్తి.. చిన్న చిన్న రంగుల గాజు ముక్కలతో తీర్చిదిద్దారు.

ఈ గాజు చిత్రపటాల్లో మరో విశేషం ఉంది. తూర్పు, పడమర గాజు ముక్కల చిత్ర పటాలపైనే సూర్యరశ్మి పడుతుంది. ఉత్తరంవైపు ఉన్న చిత్రపటంపై పడదు. కానీ తూర్పు,పడమరల చిత్రపటాలు… సూర్యరశ్మిని స్వీకరించి..దాన్ని ఉత్తరం వైపున ఉన్న చిత్రంపటంపైకి రిఫ్లెక్ట్ చేస్తాయి. పగలంతా…ఇలా సోలార్ టెక్నాలజీతో మూడో చిత్ర పటం కనిపిస్తుంది. రాత్రి అయితే…ఈ మూడు చిత్రపటాలూ అంతగా కనిపించవు. ఫిజిక్స్ సబ్జెక్ట్ లో వచ్చే రైట్ రిఫ్లెక్షన్ ఫార్ములతో వీటిని డిజైన్ చేశారని…పాస్టర్లు చెబుతున్నారు.

1914, ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజులు. కనీసం ట్రాన్స్ పోర్ట్ కూడా సరిగ్గాలేని రోజులు. అదేసమయంలో…బ్రిటన్ నుంచి ఇండియాలోని మెదక్ అనే గ్రామానికి…కొన్ని వేల వస్తువులను తీసుకురావడమంటే.. మాటలు కాదు. అది చాలా కష్టంతో కూడికున్న పని. అయినా..మెదక్ చర్చ్ నిర్మాణం మొదలవ్వగానే…ప్రపంచంలోని ఎక్కడాలేని ప్రత్యేకతలు కల్గిన వస్తువులను బ్రిటన్ నుంచి ఇండియాకు ఇంపోర్ట్ చేశారు. ఈ చర్చ్ నిర్మాణంలో ఉపయోగించిన తలుపులు, కిటికీలు, టైల్స్…అన్నీ..బ్రిటన్ దేశం నుంచి ఇక్కడకు వచ్చినవే. అందుకే ఈ చర్చ్ నిర్మాణం..ఓ అద్భుతం.

అంతెత్తు గోపురం.. ఆశ్చర్యపరిచే నిర్మాణ కౌశలం

ఈ చర్చ్ గోపురం ఎత్తు 175 అడుగులు. పొడవు 200 అడుగులు. వెడల్పు 100 అడుగులు. గోడలు, కిటికీలు, తలుపులు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ చర్చ్ లోపల ఉపయోగించిన టైల్స్..ఆరు రకాలు. వీటికి.. పాతబడే గుణం తక్కువగా ఉంటుంది. అన్నికాలాల్లో… ఇవి చల్లగానే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నీచర్.. ఇంగ్లండ్ నుంచి తీసుకొచ్చిందే. అలాగే పాటలు పాడే సమయంలో ఉపయోగించే పైప్ ఆర్గాన్ కూడా చాలా పాపులర్.  ఈ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్ ను కూడా ఇంగ్లాండ్ దేశం నుంచి తీసుకొచ్చారు. మన దేశంలో ఇలాంటివి 10 మాత్రమే ఉన్నాయి. అందులో మెదక్ చర్చ్ లో ఉన్నట్టువంటికి చాలా అరుదైనది కావడం విశేషం.

5 వేల మంది కూర్చొనే అవకాశం

ఈ చర్చ్ లోపల గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో సుమారు 5000 మంది పైగా కూర్చునే అవకాశం ఉంది. క్రిస్మస్ సమయంలో ఈ చర్చ్ ఫుల్ గా నిండిపోతుంది. ప్రతి భక్తుడికీ ఇబ్బందికలగకుండా మోకాలుపై కూర్చుని ప్రార్ధన చేసుకునే వీలు ఉంటుంది. అదేవిధంగా ఎంతమంది ప్రార్ధనలు చేసినా…ఇక్కడ రీ సౌండ్ రాదు. దానికి కారణం…ఇక్కడ నిర్మించిన రూఫే. రీ సౌండ్ రాకుండా ఉండటం కోసం చర్చ్ రూఫ్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు…ఇంజినీర్లు.

ఈ చర్చ్ నిర్మాణం.. 1914 నుండి 1924 వరకూ జరిగింది. సుమారు ఈ నిర్మాణంలో 12 వేల మంది కూలీలు పనిచేశారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్లు, ఇంజనీర్లు ఇక్కడే..ఉండి..చర్చ్ నిర్మాణ పనులు స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. ఈ చర్చ్ వాస్తు చేసినవారు..బ్రాడ్ శా, గ్యాస్ హోప్ అనే ఇంగ్లీషు చిత్రకారులు.

కరువు బాధల నుంచి విముక్తి కోసం చర్చ్ నిర్మాణం

మెదక్ చర్చ్ కు ఘనమైన చరిత్ర ఉంది. ఓ మంచి ఉద్దేశంతో నిర్మించిన దేవాలయం ఈ చర్చ్. కరవుతో జీవిస్తున్న ప్రజలకు.. కరుణామయుని ఆలయం అన్నంపెట్టి ఆదుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్నివేల మందికి.. పనికి ఉపాధి పథకం కింద.. తిండి దొరికింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బ్రిటన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి… మెదక్ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. దేవుని పేరుతో చర్చ్ నిర్మాణం మొదలుపెట్టి… వారికి అండగా నిలిచాడు. కూలిపని కల్పించి.. కడుపు నిండా తినేలా చేశాడు.

1897… మెదక్ ప్రాంతంలో కరవు తాండవం చేస్తున్న.. రోజులు. ప్రజలు వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న…రోజులు. ఎక్కడ చూసినా.. ఒక్క రొట్టె కోసం రోజంతా చాకిరి చేసే ప్రజలే. మరోపక్క చేయడానికి పనుల్లేక….తినడానికి తిండిలేక..అల్లాడిపోయే ప్రజలు. అదే సమయంలో..మెదక్ జిల్లాకు వచ్చాడు…ఇంగ్లండ్ కు చెందిన చార్లెస్ వాకర్ పోస్ నెట్. ప్రజల దుస్థితిని ప్రత్యక్షంగా చూశాడు. కరవును తరిమికొట్టాలని నిర్ణయించాడు. పనికి ఆహారపథకం కింద చర్చ్ కు పునాది వేశాడు. ఒక పక్క చర్చ్ నిర్మాణంతో..ప్రజలకు పనులు కల్పించాడు. మరోపక్క వారి ఆకలి తీర్చాడు. పాస్ నెట్ ఇలా.. మెదక్ జిల్లా వాసుల ఆకలి తీర్చడమే…కాదు వారిని ఆధ్యాత్మిక చింతనవైపుకూ తీసుకెళ్లాడు. చర్చ్ ను నిర్మించి… మెదక్ జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రతేకమైన గుర్తింపు తీసుకొచ్చాడు పాస్ నేట్.

90 ఏళ్ల నాటి కట్టడం

క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25 వ తేదీన ఈ చర్చ్ ప్రారంభమయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మతాలు, ప్రాంతీలకతీతంగా భక్తులు మెదక్ చర్చ్ ను సందర్శిస్తున్నారు. క్రైస్తవ భక్తులకు అత్యంత ఇష్టమైన చర్చ్ ఇదే. ఈ దేవాలయాన్ని దర్శిస్తే…ప్రశాంతత మాత్రమే కాదు… ఏదో తెలియని మహిమ తాకుదుందని..భక్తులు నమ్ముతుంటారు. క్రిస్మస్ సమయంలో అయితే..ఇసుకేస్తే రాలనంతగా క్రైస్తవ భక్తులు వేడుకల్లో పాల్గొంటున్నారు.

మహిమలకు నెలవైన మెదక్ చర్చ్..ఇపుడు పర్యాటక ప్రాంతంగా కూడా మారింది. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వంటి పర్వదినాల్లో…ఈ చర్చ్ కు సందర్శకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సారి క్రిస్మస్ సంబరాలు మూడు రోజుల పాటు జరుగుతుండడంతో…వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా…దేశ విదేశాల నుంచీ క్రైస్తవ భక్తులు…క్యాథడ్రిల్ చర్చ్ ను సందర్శిస్తున్నారు. ప్రత్యేకప్రార్ధనలు..కీర్తనలతో…ఈ దేవాలయం…క్రీస్తుమయమయింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy