తెలంగాణ బాపూజీ మన కొండా లక్ష్మన్న

తెలంగాణ ఉద్యమానికి  ఆది గురువు. తెలంగాణ  బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణపక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ కోసం పాటు పడ్డారు. ఆయన శతజయంతి ఉత్సవాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బాపూజీపై ఓ కథనం….

ఇంటి పేరు కొండా కావడం వల్లనో ఏమో, ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం. తన ఆస్తి పాస్తులను, జీవితాన్ని మొదట్లో స్వతంత్ర ఉద్యమం కోసం, తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల కోసం వదులుకున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన చేసిన త్యాగాలను తల్చుకోవడం, ఆయన త్యాగఫలాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం ఈ తరం కర్తవ్యం కాదా మరి!

నిజాం పాలనపై నిప్పుల యుద్దం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి   అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. బాపూజీ పోరాటాల చాప్టర్లు ఐదు   రకాలుగా విడదీసుకోవాలి. నిజాంమీద పోరాటం మొదటిది. భారత స్వతంత్ర ఉద్యమం రెండోది. ముల్కీ ఉద్యమం మూడోది. 1969 తెలంగాణ పోరాటం నాలుగోది. ఇటీవలి తెలంగాణ ఉద్యమం ఐదోది.

భారత స్వతంత్ర  ఉద్యమంలో పాల్గొంటూనే  తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి  చలించిపోయారు. బాధలనుండి విముక్తి దొరకాలంటే, ప్రత్యేక రాష్ర్టం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతీ సారి ఆయన  తన నిరసన స్వరాన్ని వినిపించారు.

పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా కూడ అనుక్షణం ప్రజలవైపే నిలబడ్డారు బాపూజీ. తన ప్రాణాలమీదకు వచ్చినా సరే, నమ్ముకున్న బాటను వీడలేదాయన. అందుకే, బాపూజీ మూడుతరాలవారికి  వారధిలా నిలబడ్డారు.

అలనాటి నిజాం సంస్థానంలోని వాంకిడిలో 1915లో సెప్టెంబర్ 27న  పుట్టాడీ వీరుడు. తొంభై ఏడో ఏట సెప్టెంబర్ లోనే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఈ లోకంలో ఉన్న 97 ఏళ్ళూ కూడా అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. 1952 ప్రాంతాల్లో ముల్కీ ఉద్యమంలో మొదలైంది తెలంగాణ కోసం పోరాటం. 1969లో….అంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు ఉద్యమం పదును పెంచడానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా కొండా లక్ష్మణ్ బాపూజీదే.

ఇటీవలి తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 ఏళ్ల వయస్సులో  ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిముషం వరకూ  చిత్త శుద్దితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే తెలంగాణ బాపూజీ అయ్యారు.

1952లో అసిఫాబాద్ నుంచి గెలిచి చట్ట సభలో అడుగు పెట్టారు బాపూజీ. చట్టసభలను ప్రజా సమస్యలకు వేదికలను చేశారు. డిప్యూటీ స్పీకరయ్యారు. మినిస్టరయ్యారు. అన్నింట్లోనూ ఆయన ముద్ర క్లియర్ గా ఉండేది. చేయాలనుకున్నది ధీమాగా, హుందాగా చేసేసేవారు. సీఎం పదవి రెండుసార్లు ఆయనను వరించబోయింది. కానీ, చివరిక్షణాల్లో వేరేవాళ్ళు ఎగరేసుకుపోయారు. బీసీ కావడంవల్లనే ముఖ్యమంత్రి కాలేకపోయారని బాపూజీ శిష్యులంటారు.

తన ఆస్తులను, జీవితాన్ని జనం కోసం ధారపోసిన ఈ నాయకుణ్ణి మన ప్రభుత్వాలు నిలువునా మోసం చేశాయి. బాపూజీ తన సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కానీ కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది. ఆయన ఆస్తుల్లో జలద్రుశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన  నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రం అయింది. తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ పుట్టింది అక్కడే.

బాపూజీని ముందు తరాలవాళ్ళు గుర్తు పెట్టుకోడానికి జలదృశ్యాన్ని రీసెర్చ్ సెంటర్ చేస్తామని కెసిఆర్ గతంలో చెప్పారు. కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు మీద పోస్టల్ స్టాంప్  తేవాలని, ఆయన పేరుతో ఒక భవనం, లేదంటే ఒక విద్యాలయం నిర్మించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. బాపూజీ సేవలను గుర్తించి సవినయంగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ఇదే బాపూజీ శతజయంతి సందర్భంగా మనం ఇచ్చే ఘన నివాళి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy