ఆ చీకటి రోజులు చూసి 40 ఏళ్లు..!

254ప్రజాస్వామ్య భారతంలో చీకటి కాలం. 21 నెలల పాటు జనానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వ విధానాలు, అన్యాయాలపై నోరెత్తితే జైలే. పత్రికలకు స్వేచ్ఛ లేదు. పోలీసులు ఏం చెబితే అదే రాయాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కేసిన కాలమది. అదే ఎమర్జెన్సీ. ఉక్కు మహిళగా పేరున్న ఇందిరాగాంధీ ప్రతిష్టను దెబ్బతీసిన ఘటనకు ఇవాళ్టితో 40 ఏళ్లు నిండుతున్నాయి. ఎమర్జెన్సీ… ఈ జెనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ. 60ఏళ్లు పైబడిన ఏ ఒక్కరి దగ్గర ఈ మాట అన్నా ఉలిక్కిపడతారు. ఆనాటి రోజులు మళ్లీ రావొద్దని కోరుకుంటారు. కోర్టుల్లో ఎదురుదెబ్బలతో ఎమర్జెన్సీ విధించాలని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని చీకట్లోకి నెట్టింది.

జయప్రకాశ్ నారాయణ, జార్జ్ ఫెర్నాండేజ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్ పేయీ, ఎల్ కే అద్వానీ లాంటి ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. మీడియా గొంతు నొక్కేశారు. ఎదిరించిన వారిని జైళ్లలో పెట్టారు. ఎమర్జెన్సీ విధించి ఇవాళ్టికి 40 ఏళ్లు. 1971లో జరిగిన ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు ఇందిర. ఆ ఎన్నికల్లో ఆమె పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టులో కేసు దాఖలైంది. ఇందిరపై ఆరోపణలు నిజమేనని కోర్టు తేల్చింది. ఆమె ఎన్నిక చెల్లదని… ఆరేళ్ల పాటు… ఎన్నికల్లో పాల్గొనకుండా… నిషేదం విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఇందిర రాజీనామా కోసం కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు దేశవ్యాప్త ఉద్యమం మొదలుపెట్టాయి. ఆ తీర్పును ఇందిరాగాంధీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. కేసును విచారించిన జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్… షరతులతో స్టే ఇచ్చారు.  దాని ప్రకారం ఇందిర ప్రధాని పదవిలో కొనసాగొచ్చు కానీ… పార్లమెంట్ లో జరిగే చర్చల్లో, ఓటింగ్ లో పాల్గొనకుండా నిషేదించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు అయ్యర్.

మరోవైపు1975 జూన్ 25న జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో… రామ్ లీలా మైదాన్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అదే రోజు బెంగాల్ సీఎం సిద్దార్థ శంకర్ రే…  రాజ్యాంగంలోని ఆర్టికల్ 352కింద దేశంలో ఎమర్జెన్సీ అనౌన్స్ చేయాలని సూచించారు. దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడిందని కారణం చెప్పుకున్నారు. వెంటనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ను కలసిన ఇందిర తన అభిప్రాయం చెప్పారు. ఆమె నిర్ణయాన్ని ఫక్రద్దీన్ ఆమోదించారు. తర్వాత 1975 జూన్ 26న ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఇందిర అధికారికంగా ప్రకటించారు. 1977 మార్చి 21 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. దేశంలో ఏమర్జెన్సీ విధించి 40 ఏళ్లయిన సందర్భంగా సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ కు బీహార్ లోని ఆయన జన్మస్థలంలో జాతీయ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించింది. స్మారకంలో ఎగ్జిబిషన్ తో పాటు ప్రజాస్వామ్యంపై  అధ్యయనం, పరిశోధనకు ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎమర్జెన్సీ నాటి దారుణాలు కళ్లారా చూసినవారు… ఇప్పటికీ ఆ ఘటనలను మరిచిపోలేకపోతున్నారు. మళ్లీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడవచ్చని… అద్వానీ లాంటి ప్రత్యక్ష సాక్షులు ఆందోళనగా చెబుతున్నారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy