- జీవితమంటే తెలియని వయసులో పెండ్లి చేశారు
- అర్థం చేసుకోలేని భర్త దొరికాడు
- సూసైడ్ లెటర్ రాసి జీవితం చాలించిన మహిళ

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి పురం కాలనీలో ఈ విషాద సంఘటన జరిగింది. చైతన్యపురి సీఐ సుదర్శన్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండలంఖానాపూర్ కు చెందిన గీతాంజలి(26), శంకర్ కు 2008లో పెండ్లి జరిగింది. పదహారేళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. హైదరాబాద్ చైతన్యపురి గాయత్రి నగర్ కు వచ్చి.. ఉపాధి చూసుకున్నారు గీతాంజలి, శంకర్. పెళ్లి.. పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే డిగ్రీ పూర్తిచేసింది గీతాంజలి. వీరికి సాయి వర్షిత్, సాయి వైశ్విత్ అనే ఇద్దరు కుమారులు. శంకర్ మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు భర్తకు ట్రాన్స్ ఫర్ అయినా… గీతాంజలి పిల్లలను చూసుకుంటూ దిల్ సుక్ నగర్ లో ఎస్సైపరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటోంది.
ఆశయానికి అడ్డుగా బాధ్యతలు
పిల్లలు, ఇంటి బాధ్యతలతో చదువుపై పూర్తిగా దృష్టిపెట్టలేకపోయింది. ఆమె కోరుకున్నట్లు జీవితం కన్పించలేదు. పోలీస్ కావాలన్న ఆశ అడుగంటిపోయింది. బాధ్యతల వలయంలో కూరుకుపోతుంటే… కళ్లముందే ఆశయం ఆవిరవుతుంటే తట్టుకోలేకపోయింది. కుటుంబం నుంచి కోరుకున్న సపోర్ట్ లభించకపోవడంతో మదనపడింది. జీవితంపై విరక్తితో… శనివారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుంది. కూతురుకు పెళ్లిచేసి బరువు దింపుకోవాలనుకున్న తల్లిదండ్రులను ఆలోచనలో పడేస్తూ.. తన మనోవేదనకు అక్షర రూపం ఇస్తూ సూసైడ్ నోట్ రాసింది. ‘అమ్మ నాన్నక్షమించండి. నేను చచ్చిపోతున్న. నాకు జీవితమంటేనే తెలియని వయసులో పెళ్లి చేశారు. సంసారం అనే ఊబిలోకి పంపారు. పిల్లలకు ఎలా పెళ్లి చేయాలి అని ఆలోచించారు తప్ప.. వారిని చదివించి గొప్పవారిగా చేయాలని మీరు అనుకోలేదు. బాగా చదివి ఐపీఎస్ అవుదామని అనుకున్న. పెండ్లి, పిల్లలతో చదువు నాశనమైంది. అర్థం చేసుకునే భర్త దొరకలేదు. నాకు బతకాలని లేదు. అందుకే చనిపోతున్న’ సూసైడ్ నోట్ లో రాసింది.
‘నాపిల్లలు జాగ్రత్త. బిట్టు, సాయి ఇక మిమ్మల్ని కొట్టనురా’ అంటూ ఆమె రాసిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది. గీతాంజలి భర్తకు సమాచారం అందించామని హైదారాబాద్ కు బయలుదేరాడని పోలీసులు తెలిపారు.