చైనా మాటల యుద్ధం : భారత్ ను ఓడించటం చాలా ఈజీ

chinaయుద్ధమే వస్తే భారత్‌ ను సులభంగా ఓడిస్తామంటుంది చైనా అధికార మీడియా. సిక్కిం సరిహద్దు వివాదంపై చైనా పత్రికల్లో భారతదేశంపై మాటలు హద్దుమీరుతున్నాయి. డోక్లాం నుంచి భారత్ బలగాలను ఉపసంహరించుకోకపోతే చైనా యుద్ధం చేయాల్సి వస్తుందని డైరెక్ట్ గా రెచ్చగొడుతోంది. యుద్ధమే వస్తే భారత్‌ సులభంగా ఓడిపోతుంది.. తన ప్రాంతాలనూ కోల్పోతుంది.. భారత ఆర్మీని చైనా ఆర్మీతో పోల్చడం హాస్యాస్పదం.  చైనా సైన్యంతో పోలిస్తే భారత సైన్యం వెనకబడి ఉంది. చైనా సైనిక వ్యయం భారత్‌ సైనిక వ్యయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ.. 10 రోజుల్లోనే ఓడించేస్తాం అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక ప్రకటించింది.

సరిహద్దులోని టిబెట్‌లో ఇటీవల చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) బలగాలు చేసిన కాల్పులు, ఇతర సైనిక విన్యాసాలు,  ఆ ప్రాంతానికి తరలించిన సైనిక సామగ్రి కేవలం ప్రదర్శన కోసం చేసినవి కావని హెచ్చరించింది. ఆ బలగాలు తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి రావని, చైనా ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోదని, ఇది చైనా ప్రజల పవిత్ర ఆశయమని చెప్పుకొచ్చింది చైనా కమ్యూనిస్టు పార్టీ. పీఎల్‌ఏ వాస్తవాధీన రేఖను దాటి అవతలికి వెళ్లే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

తాము చైనా భూభాగాన్ని ఆక్రమించుకోలేదని, సిక్కిం వివాదంపై అన్ని దేశాలు తమకు మద్దతిస్తున్నాయంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని గ్లోబల్‌ టైమ్స్‌ విమర్శించింది. ‘భారత్‌ చైనా భూభాగంలోకి చొరబడిన మాట వాస్తవం. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయింది. ఏ దేశమూ భారత దురాక్రమణకు మద్దతివ్వదు’ అని పేర్కొంది. చర్చల కోసం ఇరుపక్షాలు వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి పిలవాలని భారత్‌ చెబుతుండటం ఆ దేశం అపరాధ భావనతో ఉందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. చర్చల కోసం ముందస్తు షరతుగా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించే ప్రసక్తే లేదని పేర్కొంది. భారత్‌పై చైనా సైనిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుందని, భారత్‌ చివరకు అవమాన భారంతో మిగిలిపోతుందని ప్రేలాపనలు చేసింది చైనా అధికార మీడియా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy