జమ్మి చెట్టు – పాలపిట్టల దర్శనం శుభాల సంకేతం

Vanni_maram_branchతెలుగు ప్రజల పండుగల్లో అతి పెద్ద పండుగ దసరా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు దీన్ని మహాసంబరంగా జరుపుకుంటారు. బతుకమ్మలతో పుష్పోత్సవాలు నిర్వహిస్తారు. మహాలయ అమవాస్యతో మొదలయ్యే పండుగ సంబరం…  నవరాత్రుల్లో దేవీ పూజలతో పాటు.. తర్వాతి రోజు దసరా వరకు చేసుకుంటారు. దసరా రోజు ఆయుధ పూజ, పొలిమేర దాటడం, జమ్మిచెట్టు పూజ, పాలపిట్ట దర్శనం ప్రధాన ఆచారాలు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడని….. ఆ యుద్ధంలో శత్రువులను జయించి విజయం పొందుతాడని చెబుతారు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టును అప్పటి నుంచి పవిత్రంగా భావిస్తారు.  దశమిరోజున ప్రారంభించిన ఏ కార్యంలోనైనా విజయం సాధిస్తామని నమ్మకం. అందుకు గుర్తుగానే ఆయుధపూజ, శమీ పూజ చేస్తారు.

జమ్మి చెట్టునే శమీ వృక్షం అంటారు. దసరా రోజున…

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || 

అనే శ్లోకంతో జమ్మిచెట్టును ప్రార్థిస్తారు. ఈ శ్లోకాన్ని కాగితాలపై రాసి అందులోనే తమ కోర్కెలను, ఆశలను… రాస్తారు. తరువాత కాగితాలను జమ్మిచెట్టుకు కట్టి శనగపప్పు, బెల్లంతో తయారు చేసి పూర్ణాన్ని ప్రసాదంగా సమర్పించి, కొబ్బరికాయలను కొట్టి వాటిని ప్రసాదంగా పంచిపెడతారు.  జమ్మి ఆకులను బంగారంగా స్వీకరించి పెద్దలకు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.

4210485729_662614f3e9పండుగ రోజు నిర్వహించే ఆయుధ పూజ చాలా విశిష్టమైనది. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి ఆయుధపూజ నిర్వహిస్తారు. వాహనపూజలు చేస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మిచెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అంతే. తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడిందని….. అప్పటి నుంచి వారికి విజయాలు కలిగాయని నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున తప్పనిసరిగా పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తోంది.  పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పాలపిట్టను చూడటం ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy