జయరామ్ హత్యతో శిఖాకు సంబంధం లేదు : ఎస్పీ

 నందిగామ : ఇండస్ట్రియలిస్ట్, కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరామ్‌ ను రాకేష్ రెడ్డి హత్య చేసినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ చెప్పారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని ఛేదించామన్నారు. ఈ కేసులో శిఖా చౌదరికి ఎలాంటి పాత్ర లేదని ఎస్పీ స్పష్టం చేశారు.  ఆర్థిక లావాదేవీల కారణంగానే జయరామ్ హత్య జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ హత్య విషయంలో రాకేశ్ రెడ్డితోపాటు.. వాచ్ మన్ శ్రీనివాస్ ఇద్దరిని అరెస్ట్ చేశామనీ.. నిందితులపై 302, 202 , 419, 338, 346, 385, 201 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేశామని వివరించారు.

నందిగామ పోలీస్ స్టేషన్‌ లో పెట్టిన ప్రెస్ మీట్ లో కేసు వివరాలను ఎస్పీ త్రిపాఠీ  వివరించారు. ఐతవరం సమీపంలో గత నెల 31వ తేదీ రాత్రి  హైవే పెట్రోల్ పోలీసులు జయరామ్ మృతదేహన్ని గుర్తించారు. ఈ కారులో వెనుక సీటు కింద జయరామ్ మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి1వ తేదీన జయరామ్ మామ గుత్తా పిచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేయడంతో.. దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం తర్వాత  జయరామ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు.

నందిగామ డీఎస్పీ ఆధ్వర్యంలో పలు పోలీసుల టీమ్‌ లు ఏర్పాటు చేసి ఈ కేసును  ఛేదించారు. సీసీటీవీ పుటేజీ, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఈ కేసును తేల్చినట్టు ఎస్పీ త్రిపాఠి చెప్పారు.

రాకేశ్ రెడ్డికి శిఖాను పరిచయం చేసిన జయరాం

పోలీసులు వివరించిన కథనం ప్రకారం… టెక్రాన్ సంస్థలో సమస్యలు ఉన్న టైమ్ లో రాకేష్ రెడ్డితో జయరామ్ అప్పు తీసుకొన్నారు. ఈ డబ్బును ఇవ్వకపోతే ఇంటిని స్వాధీనం చేసుకొంటామని రాకేష్ రెడ్డి చెప్పారు. కానీ జయరామ్ ఇంటిపై లోన్ ఉన్నట్టు  రాకేష్ రెడ్డి తెలుసుకున్నారు. టెక్రాన్ సంస్థలో కార్మికుల సమస్య వచ్చినప్పుడు తలెత్తిన సమయంలో జయరామ్.. రాకేష్ రెడ్డికి  ఫోన్ చేసి.. ‘శిఖా చౌదరి ఫోన్ చేస్తారు… సహకరించాలని’ కోరారు. ఆ తర్వాత రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి మధ్య సంబంధాలు కొనసాగాయి.  ఆ తర్వాత వీరిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి.

తన డబ్బులు చెల్లించకపోవడంతో రాకేష్ రెడ్డి ప్లాన్ చేశారని పోలీసులు  చెప్పారు. జయరామ్ కోసం శిఖా ఇంటి వద్ద రాకేష్ రెడ్డి నిఘాను ఏర్పాటు చేశారని చెప్పారు. గత నెల 29వ తేదీన జయరామ్ శిఖా చౌదరి ఇంటికి వెళ్లాడని చెప్పారు. ఈ విషయాన్ని వాచ్‌మెన్.. రాకేష్ రెడ్డికి సమాచారం ఇచ్చారని చెప్పారు.

అమ్మాయిపేరుతో జయరామ్ తో చాటింగ్

ఓ అమ్మాయి పేరుతో జయరామ్‌ తో  రాకేష్ రెడ్డి చాటింగ్ చేశారని ఎస్పీ చెప్పారు. ఈ చాటింగ్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి జయరామ్ వెళ్లినట్టు ఎస్పీ తెలిపారు. గత నెల 30 వ తేదీన రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన  తర్వాత డబ్బుల కోసం కొట్టినట్టు చెప్పారు. డబ్బుల కోసం జయరామ్‌ను సోఫాపై ముఖం వేసి నొక్కడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు.

ఇద్దరు పోలీసులతో రాకేశ్ రెడ్డికి సంబంధాలు

ఆ తర్వాత ఇద్దరు పోలీసు అధికారులతో రాకేష్ రెడ్డి మాట్లాడినట్టుగా ఆధారాలు లభించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈ హత్యలో శిఖా చౌదరికి పాత్ర ఉందనేందుకు తమకు ఆధారాలు లేవని చెప్పారు.

దర్యాప్తులో నిందితుడు చెప్పిన అంశాలను మాత్రమే ఎస్పీ వివరించారు.తమ విచారణలో తేలిన విషయాలను మాత్రం పోలీసులు ఏం తేల్చలేదు. శిఖా చౌదరిని ఈ కేసు నుండి తప్పించాల్సిన అవసరం తమకు లేదని ఎస్పీ చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy