జాతి నిర్మాత.. స్ఫూర్తి ప్రదాత

vivekanandస్వామి వివేకానంద… భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులలో ఒకరు. యోగి, వేదాంతి, తత్వవేత్త. భారతదేశ పేరు, ప్రఖ్యాతులను ఖండాంతరాలకు తీసుకెళ్లిన మహా వ్యక్తి.  ఆయన జన్మించి ఇవాళ్టికి 155ఏళ్లు పూర్తవుతున్నాయి. ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం….

1863 జనవరి 12న కలకత్తాలో లాయర్ విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరీదేవి దంపతులకు వివేకానందుడు జన్మించారు. తండ్రిపెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏర్పాటు చేసిన స్కూల్లో నరేన్ ఒకటో తరగతిలో చేరారు. వేణీగుప్తా, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. హార్మోనియం, ఫిడేల్ పై పట్టుసాధించారు. చిన్నతనం నుంచే లా,  సైన్సు పుస్తకాల్ని.. ఉపనిషత్తులు, పురాణాలనూ చదివేవారు.

వివేకానందుడు మల్టీ టాలెంటెడ్. ప్రతీ రంగంలోనూ ఆయనికి పట్టుంది. దొరికిన ప్రతీ పుస్తకాన్ని తిరగేసేవారు. అన్ని మత గ్రంథాలను చదివారు. ఆతర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి సాధువుగా మారారు. దేశంలోని యువత, ప్రజలు పూర్తిగా తప్పుదారి పట్టారని భావించిన వివేకానంద.. వారికి మార్గనిర్దేశం చేసేందుకు… ఎలా బతకాలో తెలిపేందుకు దేశమంతా పర్యటించారు.

1893 సెప్టెంబర్ 11న అమెరికాలో ఆయన చేసిన ప్రసంగం మరువలేనిది. “సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా” అంటూ.. ఆయన చేసిన ఆ ఒక్క ప్రసంగంతోనే వివేకానందునికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఏడేళ్ల పాటు వివేనందుడు అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపించారు. రామకృష్ణ పరమహంస తదనంతరం ఆయన పేరుమీద సంస్థను ప్రారంభించారు. ఆర్కే మఠ్ ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు.

దేవుడు మనలోనే ఉన్నాడన్న వివేకానందుడి 155వ జయంతి ఇవాళ. ఆయన బతికిన 39ఏళ్లు అవిశ్రాంతంగా గడిపారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఆయనను మహావ్యక్తిని చేసింది. ఆయన అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. 1902 జులై 4న 39ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భూమ్మీద గడిపినన్ని రోజులూ సాధువులా ఆనందంగా జీవించిన వివేకానందుడి మరణం.. శిష్యులకు శోకాన్నే మిగిల్చింది. ఆయన నెలకొల్పిన రామకృష్ణ మిషన్ మాత్రం ఖండాంతరాలకు వ్యాపించింది.

యువతకు స్ఫూర్తిమంత్రమైన ఆయనను… జాతి యువశక్తికి ప్రతీకగా చెబుతుంటారు. అందుకే ఆయన జయంతి అయిన జనవరి 12ని… జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ… అందరిలో చైతన్యం నింపేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy