జానేదేవ్.. మీరే మా విజేతలు

india-wwcఅమ్మాయిలు.. వాళ్లు క్రికెట్ ఆడుతుంటే చూసే వారే కాదు… కామెంట్ చేసేవాళ్లు కూడా కరువే. ఆ ఏముంటుందిలే అనుకునేవారు. ఇప్పుడా క్రికెట్ ను కోట్ల మంది చూసేలా చేశారు. చివరి లీగ్ గెలిచినప్పటి నుంచి సెమీస్ లో ఆసీస్ పై విజయం సాధించే వరకు గొప్ప స్ఫూర్తిని రగిలించారు. శభాష్ అమ్మాయిలు అనేలా చేశారు. భారత క్రీడాప్రపంచంలో వాళ్లే హాట్ టాపిక్. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడినా.. మిథాలీ అండ్ టీమ్ గొప్ప ప్రభావాన్ని చూపింది. అందరి మనసులు గెలిచారు. కప్ పోతే పోనీ… మీరు మా మనసులు గెలిచారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు. ప్రధాని మొదలు కొని రాష్ట్రాల సీఎంలు, క్రీడాప్రముఖుల వరకు అందరిదీ ఇదే మాట.  ఆటల్లో గెలుపోటములు సహజం.. కానీ స్ఫూర్తి అజరామరం అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. మిథాలీ సేనను చూసి గర్విస్తున్నానని అన్నారు పీఎం మోడీ. గొప్ప నైపుణ్యంతో శాయశక్తులా పోరాడారన్నారు.  అందరి మనసుల్లోను ఇదే నెలకొంది. రన్నరప్ గా స్వదేశానికి తిరిగొస్తున్న మిథాలీ సేనకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతోంది.

రైల్వే పదోన్నతులు

మరోవైపు ప్రపంచకప్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన భారత మహిళా క్రికెటర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సహా ప్రస్తుత జట్టులోని 10 మంది అమ్మాయిలు రైల్వే ఉద్యోగులే. వీరందరికీ పదోన్నతులతో పాటు రైల్వే నుంచి నగదు బహుమతులూ దక్కనున్నాయి. మిథాలీ, హర్మన్‌ప్రీత్‌లతోపాటు ప్రస్తుత జట్టులో సభ్యులైన ఏక్తా బిష్ట్‌, పూనమ్‌ రౌత్‌, వేదా కృష్ణమూర్తి, పూనమ్‌ యాదవ్‌, సుష్మా వర్మ, మోనా మేశ్రమ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, నుఝత్‌ పర్వీన్‌ రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.

మిథాలీకి BMW కారు

మహిళల ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియాను రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ ప్రకటించాడు. 2007లో మిథాలీకి షెవర్లె కారును ఇచ్చిన చాముండి.. ఈసారి రూ.40లక్షల విలువైన బీఎండబ్ల్యూను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు.

హర్మన్ కు డీఎస్పీ పోస్ట్

ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ అందర్ని గర్వించేలా చేసిందని.. ఆమెకు పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ చెప్పారు. గతంలో పంజాబ్‌ పోలీసు శాఖలో చేరడానికి హర్మన్‌ ప్రయత్నించి విఫలమైంది. ఇదిలా ఉంటే.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.5 లక్షల నజరానా కూడా ప్రకటించారు. కౌర్‌ తల్లిదండ్రులను తన వద్దకు పిలిపించుకొని ఆయన ఆదివారం అభినందించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy