జీఎస్ టి బిల్లు: లాభమా ? నష్టమా?

gst
రాష్ట్రాల అభ్యంతరాలు, ప్రతిపక్ష సభ్యుల విమర్శలు కేంద్ర ప్రభుత్వ వివరణల మధ్య రెండున్నరేళ్లుగా లోక్ సభలో నలిగిన వస్తు సేవల పన్ను అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ -(జి.ఎస్.టి) బిల్లుకు మోక్షం లభిస్తోంది. దేశ వాణిజ్య పన్నుల విభాగంలో కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న సరుకులు, సేవల పన్ను బిల్లు ఎట్టకేలకు మే నెలలోనే లోక్ సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు వల్ల నష్టాలే ఎక్కువని ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు వాదిస్తుంటే, బిల్లును తిరిగి స్థాయీ సంఘానికి పంపి పున: పరిశీలించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. దీంతో కొన్నాళ్లుగా ఈ బిల్లుపై ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని తీర్చేందుకు కేంద్రం కాంగ్రెస్ ను, లెఫ్ట్ ను ఒప్పించాల్సి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై వివరణ ఇవ్వడం తో కొంత సానుకూలత ఏర్పడింది. తాము ప్రతిపాదించిన సవరణలకు ఒప్పుకోవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది.

ఇంతకీ జి.ఎస్.టి బిల్లు ఏం చెప్తోంది..? దీనివల్ల రాష్ట్రాలకు లాభమా… నష్టమా…? కేంద్రం ఇస్తున్న వివరణేంటి..? రాష్ట్రాలకున్న అభ్యంతరాలేంటి ? కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసా ఏంటి ?

ఇప్పటి వరకూ ఒక ఉత్పత్తికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను వసూలు చేస్తున్నారు. కానీ జి.ఎస్.టి బిల్లు ద్వారా ఇప్పటినుంచి దేశ వ్యాప్తంగా ఒకే రకంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.. దీని వల్ల వినియోగ దారునికి వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు స్థూల జాతీయోత్పత్తి కూడా 0.9 నుండి 1.7 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి సరుకుల అమ్మకం విషయంలో, రాష్ట్రాలకు సేవల విషయంలో పన్ను విధించే అధికారం లేదు. అయితే జి.ఎస్.టి బిల్లు ద్వారా అన్ని పన్నులు ఒకే గొడుగు కిందకు రానుండడంతో బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అందుకే ఈ ప్రక్రియను ముగించుకుని లోక్ సభలో జి.ఎస్.టి బిల్లు 122 వ రాజ్యాంగ సవరణగా కార్యరూపం దాల్చింది.

అయితే ఈ ఏకీకృత పన్నుల విధానం వల్ల ఉత్పాదక రంగంలో కీలకంగా ఉన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రాంతీయ పార్టీల నేతలు వాదిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మొదటి అయిదు సంవత్సరాలు రాష్ట్రాల ఆదాయానికి గండి పడకుండా కేంద్రం సహకరిస్తూందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి స్పష్టం చేశారు. రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయం లో మొదటి మూడు సంవత్సరాలు 100 శాతం, నాలుగో సంవత్సరం 75 శాతం, ఐదో ఏడాది 50 శాతం భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు.

ఈ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. జీఎస్టీ పరిధిలోకి ఎక్సైజ్, సేవా పన్నులు, రాష్ర్టాల వ్యాట్, ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్, రాష్ర్టాలు విధించే ఇతర సుంకాలన్నింటినీ చేర్చారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ ఈ పరోక్ష పన్నుల ప్రతిపాదన పన్నెండేండ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. జీఎస్టీ అమలులోకి వస్తే భారత్‌లో పరోక్ష పన్ను ప్రక్రియ మొత్తం మారిపోతుందని చెప్పారు.

జీఎస్టీ ద్వారా ద్రవ్యోల్బణం తగ్గుతుందని, ఫలితంగా అభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. జీఎస్టీ వల్ల రాష్ర్టాలు లబ్ధి పొందుతాయని జైట్లీ చెప్పారు. ప్రభుత్వం సహకార సమాఖ్యతత్వానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాఖ్యతత్వం అంటే బలమైన రాష్ర్టాలు, బలహీన కేంద్రం అని కాదని చెప్పారు. జీఎస్టీ అమలులోకి వస్తే సరుకులు, సేవలపై ఒకేసారి పన్ను విధించే అధికారం కేంద్ర, రాష్ర్టాలకు లభిస్తుందని అన్నారు. రాష్ర్టాలకు ఇంకా సందేహాలుంటే రెండేండ్లపాటు అంతర్రాష్ట్ర వాణిజ్యంపై ఒక శాతం పన్ను విధించుకునేందుకు అనుమతినిస్తామని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ ఓ తేదీని సిఫారసు చేసే వరకు పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావని జైట్లీ చెప్పారు. ప్రతిపాదిత జీఎస్టీ కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా ఉంటారు.

రాష్టాలపై ప్రభావమెంత?

ఇంతకీ జిఎస్‌టి అంటే ఏంటి? దీనిపై రాష్ట్రాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్ టీ తో కేంద్రానికి ఒరిగే లాభమేంటి ? జీఎస్ టీతో రాష్ట్రాలు నిజంగానే కేంద్రం దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడాలా ? రాష్ట్రాలను బుజ్జగించేందుకు ఆర్థిక మంత్రి ఇస్తున్న తాయిలాలేంటి ?

2005లో తీసుకొచ్చిన ‘విలువ జోడించిన పన్ను’ వ్యా ట్ తో పోలిస్తే జిఎస్‌టీ దేశ పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చేస్తుందని నిపుణులు సైతం చెపుతున్నారు. జిఎస్‌టీ అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గడంతో పాటు, ఖర్చులూ తగ్గుతాయని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు సైతం కొండంత ఆశతో ఉన్నాయి. వాస్తవానికి దేశ పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చేసే జిఎస్‌టీ కోసం వాజ్‌పేయి జమానాలోనే ప్రయత్నాలు జరిగాయి. అందుకోసం అప్పటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అసిందాస్‌ గుప్తా నాయకత్వంలో ఒక సాధికార కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోవడంతో ఆ కమిటీ కూడా అర్థాంతరంగా ముగిసింది. తర్వాత 2009లో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సైతం జిఎస్‌టీ బిల్లు కోసం ప్రయత్నించింది. అందుకోసం లోక్‌సభలో బిల్లు కూడా ప్రవేశ పెట్టింది. అయితే జిఎస్‌టీతో మా రాబడి పోతుందని అనేక రాష్ట్రాలు గగ్గోలు పెట్టడంతో ఆ ప్రతిపాదనను మన్మోహన్‌ సర్కార్‌ వెనక్కు తీసుకుంది.

ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వస్తు సేవలపై ఎడాపెడా పన్నులు విధిస్తున్నాయి. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ ట్యాక్స్‌, రాష్ట్రాల వ్యాట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్ వంటి పన్నుల బాదుడుతో అటు పరిశ్రమలపైనా, వాటిని కొని వినియోగించే వినియోగదారుడిపైనా పెద్ద భారం పడుతోంది. ఉత్పత్తి దశ నుంచి అమ్మకం, వినియోగం వరకు ఈ భారం పడుతోంది. దీంతో అనేక వస్తువుల ధర ‘అసలు కంటే కొసరెక్కువ’ అన్నట్టు తయారైంది. ఫలితంగా వినియోగదారుడు ఉత్పత్తి ధర కంటే అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. కార్లు, బైకులు, స్కూటర్లే ఇందుకు ఉదాహరణ. వీటి ఆన్‌ రోడ్‌ ధరలో దాదాపు 40 శాతం పన్నులే. జిఎస్‌టి అమల్లోకి వస్తే వస్తు, సేవలపై వినియోగ దారుడికి చేరే సమయంలో ఒకే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంతేగాక జిఎస్‌టీ దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది.

ప్రపంచంలో దాదాపు 148 దేశాలు ఇప్పటికే జిఎస్‌టీ అమలు చేస్తున్నాయి. ఆ దేశాల్లో సగటు పన్నుల భారం 15 నుంచి 18 శాతం మాత్రమే. మన దేశంలో మాత్రం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వల్ల వస్తు, సేవలపై ఈ భారం 30 శాతం వరకు ఉంటోంది. జిఎస్‌టి అమల్లోకి వస్తే ఈ భారం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

విలువ ఆధారిత పన్ను వ్యా ట్ ప్రవేశ పెట్టేటపుడూ దేశంలో అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. వ్యాట్‌తో ఆదాయానికి గండిపడుతుందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పన్నుల రాబడి తగ్గితే ఆ లోటు భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో చివరికి సరే అన్నాయి. వ్యాట్‌ అమలుతో దాదాపు అన్ని రాష్ట్రాల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఆంధ్రప్రదేశే ఇందుకు ఉదాహరణ. వ్యాట్‌ అమల్లోకి రాకముందు రూ.25,000 కోట్లున్న ఏపీ ఆదాయం, రాష్ట్ర విభజన నాటికి దాదాపు రూ.70,000 కోట్లకు చేరింది. ఇపుడు ప్రవేశ పెట్టే జిఎస్‌టీ సైతం రాష్ట్రాలకు అలానే మేలు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెపుతున్నారు.

కేంద్రంతో పాటు మీరు సొంతంగా జిఎస్‌టీ వసూలు చేసుకునే వెసులు బాటు కల్పిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రాలకు అధిక పన్ను ఆదాయం తెచ్చిపెట్టే పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, పొగాకు ఉత్పత్తులను జిఎస్‌టీ పరిధి నుంచి తప్పించేందుకు సైతం అంగీకరించారు. ఇంకా మీ పన్ను రాబడి తగ్గితే ఐదేళ్ల పాటు భర్తీ చేసేందుకు రూ.11,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. ఇంకా ఇందుకోసం జిఎస్‌టీపై ఒక శాతం అదనపు సుంకం విధించేందుకు సైతం అంగీకరించింది.

జిఎస్‌టీ దేశ ఆర్థిక వ్యవస్థనూ పరుగులు తీయిస్తుందని పారిశ్రామిక, ఆర్థిక నిపుణుల అంచనా. జిడిపి ఎంత లేదన్నా ఏటా అదనంగా రెండు శాతం చొప్పున పెరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగానే ప్రకటించారు. జిఎస్‌టీ వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి ఎగుమతులు సైతం పెరుగుతాయని వ్యాపార, వాణిజ్య సంఘాలు చెపుతున్నాయి. మేకిన్‌ ఇండియా సక్సెస్‌ కూడా జిఎస్‌టితో ముడిపడి ఉందని మోదీ సర్కార్‌ భావిస్తోంది. అందుకే జిఎస్‌టి బిల్లును ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని పట్టుదలతో ముందుకెళుతోంది. ఆదాయం నష్టపోతామన్న రాష్ట్రాల భయాలు పారదోలేందుకు సైతం ప్రయత్నిస్తోంది. రాజ్యసభలో అన్నాడిఎంకె, బిజూ జనతాదళ్‌ వంటి పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా బిజెపి పెద్దలు సిద్దమయ్యారు.

ఇదిలా ఉంటే దేశ ఆర్థిక, స్థితి గతులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కేటగిరీలకు సంబంధించి వస్తు, సేవలపై విధించే పన్ను ప్రామాణిక రేటు కంటే తక్కువగా ఉండాలని గతంలో సాధికారత కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా రెండు విధాలైన పన్ను రేట్లను కమిటీ సిఫార్సు చేసింది. బంగారు, వెండి, వజ్రాభరణాలు, విలువైన రాళ్లు, లోహాలపై తక్కువ పన్ను ఉండాలి. అలాగే పన్ను పద్ధతి ఆధారంగా పన్ను రేటును నిర్ణయించాలి.దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పారదర్శకత పద్ధతి అవలంబించడం ద్వారా ప్రత్యేకమైన పన్ను రేట్లను నిర్ణయించాలి. ఎగుమతులతో పాటు ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించి ప్రాసెసింగ్ జోన్‌లలోని ఎగుమతులపై కూడా జీరో ట్యాక్స్ విధానం అనుసరించాలి.

దీంతో పాటు సాధికార కమిటీ సూచనల్లో జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను వసూలు, ప్రోత్సాహక పథకాల్ని తిరిగి చెల్లింపు పథకాలుగా మార్చాలి. ఈ ప్రోత్సాహకాల భారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. లక్ష్య సాధన క్రమంలో పన్ను మినహాయింపు కంటే ప్రత్యేక రాయితీలు సమర్థవంతమైనవని కమిటీ పేర్కొంది. పన్ను మినహాయింపులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉమ్మడి జాబితా ఉండాలని కమిటీ సూచించింది. పన్ను మినహాయింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పరిస్థితులకు అనుగుణంగా పరిమితమైన సరళత్వం ఉండాలని కమిటీ తెలిపింది.

ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులు, ప్రవేశపన్ను జీఎస్‌టీ వ్యవస్థలో భాగంగా ఉండటాన్ని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు, స్టాంప్ డ్యూటీలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధికారత కమిటీ అభిప్రాయాలను ఆర్థిక మంత్రి కొత్త ముసాయిదా బిల్లు పరిగణనలోకి తీసుకోకపోవడం కొత్త వివాదాలకు తావిచ్చే ఆస్కారం ఉంది. కొన్ని రాష్ట్రాలు రాబోయే రెవెన్యూ నష్టం పట్ల వ్యక్తపరుస్తున్న ఆందోళన నేపథ్యంలో ఏప్రిల్ 1, 2016 నుంచి తలపెట్టిన జీఎస్‌టీ అమలు ఎంతవరకు సాకారమవుతుందనేది సందేహం.

ఇదిలా ఉంటే కొత్త పన్ను విధానం రాష్ట్రాల పాలిట గుది బండగా మారనుంది. కేంద్రం తీసుకువచ్చిన వస్తువులు.. సేవల పన్ను జీఎస్‌టీ తో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఏటా రూ.7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. ఇక వేరే రాష్ట్రాల మాట చెప్పాల్సిన అవసరమే లేదు.

జీఎస్‌టీపై చర్చిం చేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఎంపవర్డ్ కమిటీ కేరళలోని తిరువనంతపురంలో మరోమారు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరవనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం జీఎస్‌టీతో ప్రస్తుతం రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో తగ్గిపోతోంది. వరి, ఆహార ఉత్పత్తులపై వచ్చే సెస్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు రూ.700 కోట్లు వసూలవుతోంది.

దీంతో పాటు పొగాకు, పొగాకు అనుబంధ ఉత్పత్తులపై అత్యధికంగా 20 శాతం పన్ను అమల్లో ఉంది. దీన్ని జీఎస్‌టీలో కలపటంతో ఏటా దాదాపు రూ.500 కోట్లు ఆదాయం వస్తుంది. ఇప్పుడు అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. క్రమంగా కేంద్ర అమ్మకపు పన్ను ఎత్తివేత కారణంగా ఏటా పన్నుల ద్వారా రూ.4,840 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణ ఆర్థిక శాఖ అంచనా వేసింది. వ్యాట్‌ను సైతం జీఎస్‌టీలో విలీనం చేయటంతో మరో రూ.2,113 కోట్లకు పైగా నష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషించాయి. లగ్జరీ పన్ను, ఎంట్రీ టాక్స్ లను సైతం జీఎస్‌టీలో కలిపితే తెలంగాణకు మరో రూ.399 కోట్లు నష్టం వాటిల్లుతుంది. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.8,552 కోట్ల రెవెన్యూను కోల్పోయే ప్రమాదముంది.

రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిహారంగా నిధులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఎస్‌టీ బిల్లుకు సంబంధించి చేయాల్సిన సవరణలను సూచించింది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడటం ఖాయమని.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఎంత పరిహారం చెల్లిస్తుంది.. ఏయే ఉత్పత్తులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు లభిస్తుంది.. అనేది తేలాలి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy