జీతాలంటే ముందుంటరు.. రైతుల సమస్యలంటే ఉరుకుతరు

HY19TEL2FARMER_2010042fమరో రెండు వారాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం

రైతులతో సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్న వ్యవసాయ అధికారులు

ఏటా 16 లక్షల టన్నుల ఎరువులు అవసరం

మార్కెట్ లోకి వచ్చిన నకిలీ విత్తనాలు

నకిలీ విత్తనాలతో మోసపోతున్న రైతులు

జూన్  మొదటివారంలోపే తొలకరి వర్షాలు పడనున్నాయి. ఈ సమయంలోనే రైతులకు కావల్సిన ఎరువులు, విత్తనాలు, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలి, ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి, నీరెంత అవసరం, అందుకు కావాల్సిన భూసార పరీక్షలు, సలహాలు, సూచనలను వ్యవసాయశాఖ రైతులకు అందించాలి. దీన్ని అన్ని ప్రాంతాల్లో రైతులకు అందించడానికి సమగ్రమైన ప్రణాళికను తయారుచేసుకోవాలి. కానీ మన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అసలు రైతులతో మాకేం సంబంధం అన్నట్టు తయారయ్యారు. ఇప్పటికే నకిలీ విత్తనాలు మార్కెట్లో చెలామణీ అవుతున్నాయి. విత్తన కంపెనీలు గ్రామాల్లో జోరుగా ప్రచారం  చేస్తున్నారు. ప్రభుత్వ విత్తనాలు అందక ముందే రైతులకు విత్తనాలు అమ్మడానికి కంపెనీలు పూర్తిగా రెడీ అయిపోయాయి.

గత ఖరీఫ్ లో సకాలంలో వ్యవసాయ ప్రణాళిక అందించకపోవడంతో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయారు. మొలకెత్తని విత్తనాలు కొనుగోలు చేసి నిండా మునిగిపోయారు. అప్పట్లో విభజన ప్రక్రియ వల్ల కూడా వ్యవసాయ శాఖ స్పందించడానికి ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇప్పుడంత సమస్య లేకపోయినా… వ్యవసాయ అధికారులు ఆఫీసులో సంతకాలు పెట్టడానికి మాత్రమే వస్తున్నట్టు పనిచేస్తున్నారు. జీతాలు తీసుకోవడానికి ముందుండే ఈ అధికారులు… రైతుల కోసం వ్యవసాయ ప్రణాళిక తయారుచేయడానికి మాత్రం కదలట్లేదు. మే నెలాఖరు వచ్చేసినా… ఇప్పటికే రెడీగా ఉండాల్సిన ప్లాన్ తయారుగా లేదని తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో వర్షాలు వచ్చే సంకేతాలుండడంతో…. ప్రభుత్వం, అధికారులు వేగంగా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. అనుకున్నట్టుగా వర్షాలు పడితే ఏం చేయాలి? పడకపోతే ఏ పంటలు వేసుకోవాలి? అన్న దానిపై రైతులకు అవగాహన కలిగించేలా వ్యవసాయ ప్రణాళికను విడుదల చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

2014-15 ఏడాది వ్యవసాయ ప్రణాళికలో 51 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పంటలు వేసింది మాత్రం 42 లక్షల ఎకరాల్లోనే. 25 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా… 20 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అందులోనూ నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో బావుల కింద వేసిన 10 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. చివరికి పశువులకు మేతగా కూడా పనికిరాకుండా పోయింది. దీంతో దేవుణ్ని తిట్టుకోవాలా? అధికారులను తప్పుబట్టాలా? అర్థంకాక కడుపు మండిన అన్నదాతలు ఎండిన పంటలనే తగలబెట్టుకున్నారు. ఇక 12 లక్షల ఎకరాల్లో వేయాల్సి పప్పుధాన్యాలు 8 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 7 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన నూనెగింజలు లక్ష్యానికి మించి 8లక్షల 70వేల ఎకరాల్లో వేశారు. అలాగే పత్తి కూడా 38 లక్షల ఎకరాల లక్ష్యానికి మించి 40 లక్షల ఎకరాలకుపైగా సాగైంది. అన్ని పంటలూ కలిపి ఖరీఫ్ లో దాదాపు కోటి ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా 96 లక్షల ఎకరాల్లో మాత్రం పంటలు వేశారు.

దిగుబడుల్లో పత్తి, పప్పుధాన్యాలు పూర్తిగా పడిపోయాయి. 46 లక్షల పన్నుల పత్తి దిగుబడి అంచనా ఉంటే సగం కూడా రాలేదు. వరి ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 64 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ 25 లక్షల టన్నులకే పరిమితమైంది. వర్షాలు లేకపోవడం పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. రబీలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. 19 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేస్తే 7 లక్షల ఎకరాలకు పడిపోయింది. వర్షాలు లేకపోవడంతో పాటు రబీకి కరెంటు కొరత తప్పదని ప్రభుత్వం ముందే స్పష్టంగా చెప్పడంతో చాలామంది రైతులు స్వచ్ఛందంగా వరికి దూరంగా ఉండిపోయారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక ఉంటే పంటల సాగు, దిగుబడి విషయంలో ఇంత ఇబ్బంది ఉండేది కాదంటున్నాయి రైతు సంఘాలు. రుణమాఫీ ఆలస్యం కావడం, దీంతో కొత్త రుణాలు కూడా లేటయ్యాయి. వ్యవసాయ శాఖ నుంచి ప్రణాళిక లేకపోతే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. దీంతో రైతులు మార్కెట్లో అందుబాటులో ఉండే నకిలీ విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. గతేడాది మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

సర్కార్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 16 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. అందులో 10 లక్షల టన్నుల యూరియా, నాలుగున్నర లక్షల టన్నుల ఫాస్ఫేట్ , లక్షన్నర టన్నుల పొటాషియం అవసరం. కానీ రైతులు సమతుల్యం లేకుండా యూరియాను ఎక్కువగా వాడడంతో పంటల దిగుబడి పడిపోతోంది. దీనిపైనా రైతులకు అవగాహన కలిగించాల్సి ఉంది. మరోవైపు ఎరువులు వాడకుండానే సేంద్రియ, ప్రకృతి విధానంలో సాగు చేసే రైతులకు భారీగా ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. సేంద్రీయ సాగు వల్ల పెట్టుబడి భారం తగ్గి, మంచి లాభాలు అందుకునే అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కాలం కలిసి రాక రైతులు ఇప్పటికే చాలా నష్టపోతున్నారు. దీనికి తోడు వ్యవసాయ శాఖ అధికారుల నిర్వాకం వారిని మరింత కుంగదీస్తోంది. ప్రణాళిక ద్వారా రైతులను గైడ్ చేయడం వ్యవసాయ అధికారుల బాధ్యత మాత్రమే కాదు రాష్ట్రం అవసరం కూడా. ఓవైపు ఇజ్రాయెల్ సాగు స్ఫూర్తితో మన రైతులు లాభాలు పొందేలా ప్రోత్సాహిస్తామని వ్యవసాయ మంత్రి చెబుతుంటే ఆ శాఖ అధికారులు మాత్రం కనీసం ప్రణాళిక రూపొందించాలన్న బాధ్యత కూడా లేకుండా ఉండడం సరికాదంటున్నాయి రైతు సంఘాలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy