జీవితాన్ని జ‌యించింది: ప్రేమంటే ఇదేరా!

marraigeప‌క్క‌న ఫోటోలో క‌నిపిస్తున్న ఈమె పేరు క‌వితా బరూని. ల‌క్నోకు చెందిన ఈ యువ‌తి ఉన్న‌త చ‌దువులు చ‌దివింది. మంచి ఉద్యోగం చేయాల‌న్న క‌ల‌లు క‌నింది. క‌ల‌ను సాకారం చేసుకునే భాగంగా  మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్క‌డే స‌హోద్యోగితో ప‌రిచ‌యం ఏర్ప‌డి అదికాస్త ప్రేమ‌గా మారింది. ఇంత‌లోనే ఊహించ‌ని ఘ‌ట‌న క‌విత జీవితంలో చోటుచేసుకుంది. స‌హోద్యోగితో చ‌నువుగా ఉండ‌టం స‌హించ‌లేక‌పోయాడు ఆమె బంధువు సైఫ్‌.  క‌సితో ర‌గిలిపోయాడు. క్ష‌ణికావేశంలో ఆమెపై 2011లో యాసిడ్‌తో దాడి చేశాడు. అంతే ఈ దాడిలో ఆమె త‌ల భాగం, ముఖం దాదాపు పూర్తిగా కాలిపోయింది. క‌విత‌ను ఆ ప‌రిస్థితుల్లో చూసిన ప్రేమికుడు నితేష్ వ‌ర్మ వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించాడు. అంత‌టితో త‌న ప‌ని అయిపోయింద‌ని భావించ‌క చివ‌రి వ‌ర‌కు క‌విత‌తోనే ఉన్నాడు.

త‌న‌పై యాసిడ్ దాడికి దిగిన సైఫ్ నుక‌ఠినంగా శిక్షించాలంటూ న్యాయ‌పోరాటానికి దిగింది. అయితే ఇంటి ప‌రువు బ‌జారున ప‌డేస్తున్నావంటూ క‌న్న‌వాళ్లే ఆమెను ఇంటినుంచి వెళ్ల‌గొట్టారు. అయినా స‌రే క‌విత నిరుత్సాహానికి గురికాలేదు. ఎలాగైనా స‌రే మ‌రో అమ్మాయికి ఇలా జ‌ర‌గ‌కూడ‌దంటే త‌న‌పై యాసిడ్ దాడికి పాల్ప‌డిన సైఫ్‌కు క‌ఠిన శిక్ష ప‌డాల‌ని త‌లంచి న్యాయ‌పోరాటానికి దిగింది. నితీష్‌తో క‌లిసి పోరాటం సాగించింది. 2012లో సైఫ్ అరెస్ట్ అయ్యాడు. శిక్ష ప‌డింది.

త‌న రూపాన్ని చూసుకుని చాలా బాధ‌ప‌డేదాన్న‌ని ఆ స‌మ‌యంలో ఎన్నో చీక‌టి రోజులు గ‌డిపిన‌ట్లు క‌విత తెలిపింది. ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌న్న ఆలోచ‌న కూడా వ‌చ్చింద‌ని తెలిపింది. సొంత‌వారే ఆశ్ర‌యం క‌ల్పించ‌క‌పోవ‌డంతో ప్రేమించిన‌వాడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడ‌ని తెలిపింది. నితీష్ లాంటి మంచి వ్య‌క్తికి త‌నలా వికారంగా ఉండే అమ్మాయి భార్య‌గా కాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని అత‌నికి దూరంగా ఉండ‌టం మొద‌లు పెట్టిన‌ట్లు చెప్పుకొచ్చింది. కానీ విష‌యం తెలిసిన నితీష్ తన‌ను త‌ప్ప మ‌రొక‌రిని త‌న భార్య‌గా ఊహించ‌లేన‌ని చెప్ప‌డంతో క‌ళ్ల‌ల్లో నీళ్లు ఆగ‌లేద‌ని వెల్ల‌డించింది క‌విత‌.

ఏప్రిల్ 17 త‌న జీవితంలో మ‌ర‌చిపోలేని రోజుగా చెప్పుకొచ్చింది క‌విత‌. ఎందుకంటే త‌న‌ను ఎంత‌గానో ప్రేమించిన వ్య‌క్తి నితీష్‌తో ఏడ‌డుగులు వేసిన‌ట్లు సంతోషంతో చెప్పింది. త‌మ పెళ్లి చాలా కొద్ది మంది స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగిందని వెల్ల‌డించింది. ప్రేమించిన వాడే త‌న‌కు భ‌ర్త‌గా రావ‌డం నిజంగా త‌న పూర్వ జ‌న్మ సుకృతం అని చెప్పింది క‌విత‌. అయితే క‌విత క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచి, ఆమెకు ఆద‌రువుగా ఉండి.. క‌విత ప‌రిస్థితి తెలిసి కూడా ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు వ‌చ్చిన నితీష్‌పై ప్ర‌తిఒక్క‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy