జూలై 15 – గ్రీన్ డే.. సక్సెస్ చేద్దాం రండి

plantపిల్లలు.. మొక్కలు.. భవిష్యత్ తరాలకు పునాదులు. ఆకాశమంతా ఎదిగే అవకాశాలు. అదే.. పిల్లల చేతుల్లో మొక్కలుంటే..అవి బంగారు తెలంగాణకు బాటలు. సరిగ్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కలలుగన్న హరిత తెలంగాణకు గ్రీన్ డే రోజున విద్యార్థులు చేయనున్నప్రతిజ్ఞ ఇది. ఒక్క రోజే 28 లక్షల మొక్కలు నాటి తెలంగాణ విద్యార్థులు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. హరిత పాఠశాలల నుంచే హరిత తెలంగాణ అంటూ నినదించనున్నారు.  జూలై 15న హరిత తెలంగాణలో ప్రత్యేక రోజుగా లిఖించనున్నారు.

మూడో దశ హరితహారంలో భాగంగా విద్యాశాఖ మొక్కలు నాటే పండగను ఒక యజ్ణంగా నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. జూలై 15వ తేదీని గ్రీన్ డేగా పాటిస్తూ తెలంగాణ పాఠశాలలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యక్రమం రూపొందించింది. ఉదయం 8.30 గంటల నుంచి గ్రీన్ డే ప్రారంభం కానుంది.  ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రతి పాఠశాల వద్ద హరిత పాఠశాల- హరిత తెలంగాణ పేరుతో నినాదాలిస్తూ మొక్కల ఆవశ్యకతను గ్రామంలో, పట్టణంలో తెలియజేసేం విధంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మొక్కలు పాఠశాలల ఆవరణలో నాటనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హరితహారం కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో  వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్, నాటికలు, క్విజ్ మొదలైన పోటీలు ఉపాధ్యాయులు విద్యార్థులకు నిర్వహించనున్నారు.  ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలకు స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15వ తేదీన బహుమతులు అందించనున్నారు.

హరితహారంలో కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా వాటిని సంరంక్షించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో గ్రీన్ బ్రిగేడ్ లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటిన మొక్కలను దత్తత తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవడమే ఈ గ్రీన్ బ్రిగేడ్ల లక్ష్యం.

కొన్ని పాఠశాలల్లో విశాలమైన ఖాళీ స్థలాలున్నాయి. విశాలమైన స్థలాలున్నచోట బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని విద్యాశాఖ సంచాలకులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. బ్లాక్ ప్లాంటేషన్ కు అవకాశాలు లేనిచోట ప్రహరిగోడ దగ్గర నాలుగైదు వరుసలుగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రహరిగోడలు లేనిపాఠశాలల్లో మొక్కలకు కచ్చితంగా ట్రీగార్డ్ లను ఏర్పాటు చేయాలన్నారు.

గ్రీన్ డే విజయవంతం కావాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ మొక్కల పండగలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. కేవలం పాఠశాలల్లో కాకుండా ప్రతి ఇంటిలో మొక్కను నాటేవిధంగా అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు.

మొక్కలు నాటడానికి కావల్సిన ఏర్పాట్లు ఏంఈవోలు, ఎంపిడీవోలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం ఆదేశించారు. మొక్కలు సరఫరా చేయడం, గుంతలు తవ్వడం, ఎరువులు ఇవ్వడం వంటి అన్ని రకాల ఏర్పాట్లను విద్యార్థులు మొక్కలు నాటేందుకు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పనులను మునిసిపల్ అధికారులు  నిర్వహించాలన్నారు.  గ్రీన్ డేను విజయవంతం చేయాలని ప్రతి మొక్కను చాలా జాగ్రత్తగా నాటాలని, దానిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని, హరిత పాఠశాలల నుంచి హరిత తెలంగాణ ఏర్పాడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చేతుల్లో మొక్కలు భావి హరిత తెలంగాణకు పునాదులవుతాయన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy