టర్కీ కుట్ర వెనుక కుట్ర

turkeyటర్కీ… ఇస్తాంబుల్, అంకారా.. మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలతో టూరిస్ట్ హెవెన్ లా ప్రపంచాన్ని ఆకర్షించిన దేశం. ముస్లింలు ఎక్కువగా ఉన్నా.. వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అయ్యే విలక్షణ ప్రజాస్వామ్య దేశంగా… యూరప్ కు-ఆసియాకు మధ్య వారధిగా టర్కీకి గుర్తింపు. అలాంటి దేశం బాంబు దాడులు, తిరుగుబాట్లతో దద్దరిల్లుతోంది. నెల క్రితం ఉగ్రవాద దాడి. ఇపుడు సైనిక తిరుగుబాటు. రెండు వరుస ఘటనలతో ఉలిక్కిపడిందీ టర్కీ. అయితే దీని వెనుక ఉన్నది ఎవరు.
సైనిక తిరుగుబాటనేది టర్కీకి కొత్త కాదు. ఇంతకుముందు చాలాసార్లు.. ఇలాంటి పరిణామాలు ఫేస్ చేసింది. రిపబ్లిక్ టర్కీలో తొలిసారి 1960లో సైనిక తిరుగుబాటు వచ్చింది. ఆ ఏడాది మే 27న నాటి దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రితో పాటు పలువురు కేబినెట్ మంత్రులను అరెస్ట్ చేశారు. దేశద్రోహం కింద వాళ్లను విచారించారు. తర్వాత 1971 మార్చి 12న… 1980 సెప్టెంబర్ 12న… 1997 ఫిబ్రవరి 28న మొత్తం మూడు దశాబ్దాల్లో నాలుగుసార్లు సైనిక తిరుగుబాటు జరిగింది.

టర్కీలో మిలటరీ కూప్ లకు కాలం చెల్లిందనుకుంటున్న టైంలో… రెండు దశాబ్దాల తర్వాత… మళ్లీ ఇప్పుడు సైనిక తిరగుబాటు జరిగింది. ఈసారి తిరుగుబాటు సక్సెస్ కాకపోయినా… దీనికి చాలా కారణాలే కన్పిస్తున్నాయి. ముఖ్యంగా…. టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ చేపట్టిన చర్యలు కొన్ని సైన్యంలో అసంతృప్తిని రగిల్చాయి. టర్కీ జాతిపిత అటాటర్క్ తెచ్చిన సిద్దాంతలను పక్కన పెట్టేయడం… అనవసర విధానాలను తలకెత్తుకోవడం… ఐసిస్ కు మద్ధతిస్తున్నారన్న ఆరోపణలు… సైన్యంలో ఓ వర్గంలో కసి రగిల్చాయి. అన్నింటికన్నా ముఖ్యంగా టర్కీ ఇమామ్ గా గుర్తింపు పొందిన ఫెతుల్లా గులెన్ పై ఎర్డోగన్ వ్యతిరేక ప్రచారం.. ఆర్మీలోని ఆ వర్గాన్ని… తిరుగుబాటుకు ఉసిగొల్పింది.
తిరుగుబాటు ముగిసినా టర్కీ ఇంకా రగులుతూనే ఉంది. దాదాపు 50 వేల మందికి పైగా సైనికులు, జడ్జీలు, ప్రాసిక్యూటర్లు, రీజినల్ గవర్నర్లు, సివిల్ సర్వెంట్స్ ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. వాళ్లలో తిరుగుబాటు కుట్ర చేసిన 290 మందిని ఉరితీయాలని నిర్ణయించింది. అయితే యూరప్… ఇతర దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో డెత్ పెనాల్టీపై వెనకడుగు వేసింది ఎర్డోగన్ సర్కారు.
ఇక ఎర్డోగన్ సాగిస్తున్న నిరంకుశ పాలన, అనాలోచిత విధానాలు, నాటో కూటమి పావులు కదుపుతున్న తీరుతో టర్కీని మరో కుంపటిలా మార్చే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోనార్క్ లా మారాలనుకున్న ఎర్డోగన్ విధానాలతో… టర్కీ మరో సిరియాలా మారినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.
ముస్తఫా కెమాల్ అటాటర్క్. ఆధునిక టర్కీ వ్యవస్థాపకుడు. ఫస్ట్ వాల్డ్ వార్ లో సైనికాధికారిగా పనిచేసిన ముస్తఫా … ఆ పోరులో ఒట్టోమాన్ ఎంపైర్ పటాపంచలవడంతో  టర్కీ స్వాతంత్ర్యం ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే టైమ్ లో అంకారాలో తాత్కాలిక ప్రభుత్వానికి కూడా ఏర్పాటు చేశారు. దాన్ని అణచేయడానికి సంకీర్ణ దళాలు పంపిన సైన్యాన్ని తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యారు ముస్తఫా. అలా 1923 లో రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అవతరించింది. స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చి దిద్దారు ముస్తఫా. రిపబ్లిక్ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ఏక పార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టి … తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1935 లో టర్కీలో ఇంటిపేర్లను ప్రవేశపెట్టినప్పుడు … ముస్తఫాకు అటాటర్క్ అనే పేరినిచ్చింది టర్కీ. అటాటర్క్ అంటే …. టర్క్ లకు పిత అని అర్థం.
అటాటర్క్ పాలనలో ఎన్నో మార్పులు తెచ్చారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు తెచ్చారాయన. దేశాన్ని ఆధునిక, లౌకిక దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేల స్కూళ్లు నిర్మించారు. అందరికీ ఉచిత విద్య ప్రాథమిక హక్కు అనే రూల్ తెచ్చారు. ఇస్లామిక్ సంస్థలను నిషేధించారు. డ్రెస్సింగ్ లో మోడ్రన్ లుక్ తీసుకొచ్చారు.              అరబిక్ లిపి స్థానంలో లాటిన్ లాంగ్వేజ్ ని అమల్లోకి తెచ్చారు. తటస్థ విదేశి విధానాన్ని తెచ్చి … ఇరుగుపొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు. అటాటర్క్ తెచ్చిన సంస్కరణలే ఆధునిక టర్కీకి పునాదులయ్యాయి. ఆయన సిద్ధాంతాలే కెమలిజంగా మారిపోయాయి. అలా 1923 నుంచి 1938 నవంబర్ 10 న ఆయన చనిపోయే వరకు … అధ్యక్షుడిగా చాలా సంస్కరణలు తెచ్చి ప్రపంచం మెప్పు పొందారు అటాటర్క్. అటాటర్క్ చనిపోయాక కూడా…. దశాబ్దాల కాలం పాటు ఆయన సిద్ధాంతాల ఆధారంగానే టర్కీ పాలన కొనసాగింది. కానీ .. 1980 ల్లో ముస్లిం దేశాల్లో ఇస్లాం భావజాలం పెరిగింది. దీంతో బేసిగ్గానే ముస్లింల ఆధిపత్యమున్న టర్కీలోనూ ఆ ప్రభావం కనిపించింది. అదికాస్త … 1990 నాటికి మరింతగా బలపడిపోయింది. అలా ఇస్లాం మూలాలు బలంగా ఉన్న జస్టిస్ అండ్ డెవలప్ మెంట్ పార్టీ …. అంటే ఇప్పుడధికారంలో ఉన్న ఏకేపీ 2002 నవంబర్ లో అధికారంలోకొచ్చింది.
టర్కీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్డోగన్….. 2003 నుంచి 2014 వరకు టర్కీ ప్రధానమంత్రిగా పనిచేశారు. టర్కీ ప్రధాని పోస్టులో ఉండి పాలనలోని మెలకువలు నేర్చిన ఎర్డోగన్…. 2014 లో దేశాధ్యక్షుడయ్యారు. అధక్ష్య పీఠం ఎక్కినప్పటి నుంచీ…. ఆయన టర్కీకి అప్రకటిత సుల్తాన్ గా చలామణి అవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… అరబ్ దేశాల్లోని నియంతల్లా తయారయ్యారు. అందుకే ఈ తిరుగుబాటు.

టర్కీ జాతిపిత అటాటర్క్ సిద్ధాంతాలను పక్కనెట్టడంతో పాటు పలు వివాదాస్పద అంశాల్లో తలదూర్చారు ఎర్డోగన్. దాంతో ప్రెసిడెంట్ కి ఆర్మీకి గ్యాప్ వచ్చింది. నిజానికి ఆర్మీపై తిరుగులేని పట్టుంది ఆయనకి. కానీ ఆయన లేని టైంలో ఓ వర్గం తిరుగుబాటు చేయడం.. దాన్ని జనం స్వచ్ఛందంగా తిప్పికొట్టడం అన్ని కొన్ని గంటల్లో జరిగిపోయాయి. బేసిగ్గానే టర్కీ రాజకీయాలపై సైన్యం ప్రభావమెక్కువ. సైన్యానికి ప్రజల్లో ఆదరణతో పాటు…. స్వయంప్రతిపత్తీ ఉంటుంది. పైగా… జాతిపితి అటాటర్క్ తెచ్చిన కెమలిజానికి సైనికులే సంరక్షులు. ఆ బాధ్యత సైన్యానిదే. కానీ… ఎర్డోగన్ అధికారంలోకి వచ్చాక సైన్యానికి సిద్ధాంతల పరంగా… సంస్థాగతంగా చాలా సవాళ్లు ఎదరయ్యాయి. సిద్ధాంతాల పరంగా చూస్తే …. ఎర్డోగన్ కు సంబంధించిన ఏకేపీ ఇస్లామిక్ రాజకీయాలు… కెమలిస్టు లౌకికవాదానికి విరుద్ధంగా ఉండడం సైన్యానికి అస్సలు నచ్చలేదు.
సంస్థాగతంగా చూస్తే… సైనిక కోర్టుల పరిధిని కుదించడం, సీనియర్ సైనికాధికారుల నియామకాన్ని పౌర ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం లాంటివి చేశారు ఎర్డోగన్. సైనిక ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. వీటన్నింటికి తోడు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ అనేక మంది సైనిక ఉన్నతాధికారులను అరెస్ట్ చేయించారు. ప్రజల్లో వ్యతిరేకత, సైన్యం హెచ్చరికలను లెక్కచేయకపోవడం… 2007 లో అబ్దుల్లా గుల్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి ఎర్డోగన్ సర్కారు హెల్ప్ చేయడం. లోలోపల ఒక ఇస్లామిక్ పార్టీతో సంబంధాలు పెట్టుకోవడంతో అప్పట్లో గుల్ ను వ్యతిరేకించింది టర్కీ సైన్యం. ఇలా సైనికులు కాదన్నది చేసి చూపించాడు ఎర్డోగన్. ఇదీ తిరుగుబాటుకు ఓ కారణం.
అంతేకాదు టర్కీ విదేశీ విధానాల్లో ఎర్డోగన్ తెచ్చిన మార్పులతో … దేశంలో అభద్రతభావం పెరిగిపోయింది. ఏకేపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేక మొదలైంది. పైగా 2011లో సిరియా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఆదేశ అధ్యక్షుడు అల్ అసద్ రాజీనామాకు డిమాండ్ చేసిన నేతల్లో ఎర్డోగన్ కూడా ఒకరు. సిరియాలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులకు గట్టి మద్దతిచ్చాడు. పైగా టర్కీని ఐసిస్ కు ఓపెన్ డోర్ లా మార్చేశాడు. దాంతో టర్కీలోనూ టెర్రరిజం పెరిగిపోయింది. రీసెంట్ గా మూడంచెల భద్రతను దాటుకుని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో కాల్పులకు తెగబడటం.. ఎర్డోగన్ ప్రభుత్వం ఇచ్చిన అలుసే.
వీటికితోడు సిరియా అంతర్యుద్ధం టర్కీ మెడకు చుట్టుకుంది. సిరియా నుంచి పెద్దసంఖ్యలో శరణార్థులు టర్కీకి వలస వచ్చారు. వాళ్లలో శరణార్థులెవరో … ఉగ్రవాదులెవరో గుర్తించడం కష్టంగా మారిపోయింది. టర్కీల భయానికి ఇదీ ఓ కారణమైంది. అన్నీ కలిపి ప్రెసిడెంట్ ఎర్డోగన్ పై సైనిక తిరుగుబాటుకు ఉసిగొల్పాయి. ఇక ఎర్డోగన్ హయాంలో టర్కీ విదేశీ విధానం పూర్తిగా మారిపోయింది. ఆసియా-యూరప్ కు వారధిగా ఉన్న టర్కీపై సహజంగానే అమెరికా-రష్యా పెత్తనం కోసం ప్రయత్నాలు చేశాయి. రెండింటితో సత్సంబంధాల కోసం ఎర్డోగన్ ప్రయత్నించడం.. కొన్నిసార్లు రెండు దేశాలకు భిన్న విషయాల్లో తగాదాలు రావడంతో టర్కీ పావులా మారిపోయింది. సిరియా విషయంలో టర్కీపై…. రష్యా గుర్రుగా ఉండడంతో… రెండు దేశాల మధ్య గ్యాప్ పెంచింది. అక్కడితో ఆగకుండా…. ఆగ్నేయ టర్కీలో కుర్దిష్ తిరుగుబాటుదారులపై దాడులు చేయించారు ఎర్డోగన్. రాజయకీయంగా కుర్దులు ఎదగడం ఎర్డోగన్ కు రుచించలేదు. ఇవన్నీ… సైన్యంలో వ్యతిరేకను పెంచాయి. ఇలా ఎన్ని చేసినా టర్కీ కుదుటపడలేదు. దాంతో మళ్లీ సైన్యంతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారు ఎర్డోగన్. పైగా నియంతృత్వ పోకడలు అమలు చేసేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా సైన్యంలోని ఇస్లామిక్ మతగురువు ఫెతుల్లా గులెన్ అనుచులు… గులెనిస్టులపై విమర్శలు పెంచాడు. కెమలిస్టులను అక్కున చేర్చుకున్నారు. విదేశీ విధానాన్ని మళ్లీ మార్చుకున్నారు. రష్యా, ఇజ్రాయెల్ తో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారు. సైనికులను ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. చేయాల్సిందంతా చేశాక…. దిద్దుబాటు చర్యలు ఎన్ని చేసినా సైన్యంలో అసంతృప్తి చల్లారలేదు.
అన్నింటికి మించి టర్కీ ముస్లిం మతగురు ఫెతుల్లా గులెన్ ను టార్గెట్ చేయడం ఆర్మీలోని ఓ గ్రూప్ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. నిజానికి గులెన్.. ఇమామ్ గా పాపులర్. ఆయన ఇస్లాం మతప్రచారం చేసినా… ఆధునిక విధానాలతో ఇస్లాం రంగరించారు. ప్రజాస్వామ్యం, ఎడ్యుకేషన్, సైన్స్.. ఇతర మతాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. అమెరికాతో సహా వందకు పైగా దేశాల్లో వెయ్యికి పైగా స్కూల్స్, హాస్పిటల్స్, యూనిర్సిటీలు, బ్యాంకులు, మీడియా, టీవీస్టేషన్ల గులెన్ అనుచరులు నిర్వహిస్తున్నారు.
ఎర్డోగన్ విధానాలతో విసిగిపోయిన గులెన్… టర్కీని వదిలి అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉంటున్నారు. ఆయనపై ఎలాంటి వివాదాలు లేకపోయినా.. ఆయన భావజాలంతోనే సైనిక తిరుగుబాటు జరిగిందని ప్రచారం చేసి.. వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నించారు ఎర్డోగన్. అదీ తిరుగుబాటుకు ఓ కారణమైందని విశ్లేషిస్తున్నారు.
సైనిక కుట్ర తర్వాత ప్రెసిడెంట్ ఎర్డోగన్ నిర్ణయాలు టర్కీని మరింత ప్రమాదంలో పడేసేలా ఉన్నాయి. మరో సిరియాలా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy