టీఆర్ఎస్ కి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజీనామాకు గల కారణాలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోయినందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు విశ్వేశ్వర్ రెడ్డి. మొత్తం మూడు పేజీలతో లేఖ రాశారు కొండా. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా..2013లో తనను కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని తెలిపారు. కేటీఆర్ చాలా సార్లు తమ ఇంటికి వచ్చారని.. చేవెళ్ల నుంచి తనను లోక్ సభకు పోటీ చేయమన్నారని చెప్పారు.

చేవెళ్లలో అర్బన్ పాపులేషన్ ఎక్కువని.. ఓడిపోయే సీటుగా తనను భావించారని..అయితే రాత్రిపగలు శ్రమించి అనూహ్యంగా ఎంపీగా గెలిచానన్నారు. కేసీఆర్ విజన్ తో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావించానని..తన సామర్థ్యం మేరకు అభివృద్ధికి కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి వెళ్లానని..నాలుగున్నరేళ్లలో 90సార్లు లోక్ సభలో మాట్లాడానన్నారు. రెండేళ్లుగా పార్టీ ప్రజలకు దూరమైందన్న ఆయన..ప్రభుత్వం ప్రజల వద్దకు చేరుకోలేకపోయిందన్నారు. వ్యక్తిగతంగా అనేకసార్లు నిరాశకు గురయ్యానని..కార్యకర్తలకు అన్యాయం జరిగిందని తెలిపారు.

పార్టీలో తనకు అధికారం లేకుండా పోయిందని.. ఏది బహిరంగంగా మాట్లాడలేకపోయానని చెప్పారు ఎంపీ కొండా. ఏ అంశంపై చర్యలు చేపట్టలేకపోయానని తెలిపిన కొండా.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా మాత్రమే సరైన మార్గం అనిపించిందన్నారు. అందుకే పార్టీకి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు కొండా విశ్వేశ్వరరెడ్డి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy