టీఆర్ఎస్ ప్లీనరీ : గులాబీ పండుగకి సర్వం సిద్ధం

trs-plenary-2018రాష్ట్ర సాధన ఉద్యమానికి సారథ్యం వహించిన టీఆర్ఎస్సే కొత్త రాష్ట్రానికి మొదటి అధికార పార్టీ అయ్యింది. బంగారు తెలంగాణ నినాదంతో ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టింది. తెలంగాణ వచ్చాక జరిగిన తొలి ప్లీనరిలో తన విజన్ ను ప్రకటించింది. కొత్త రాష్ట్రంలో సరికొత్త స్కీంలతో దేశం దృష్టిని ఆకర్షించింది. కొన్ని మార్పులు… చేర్పులు.. సవాళ్లతో ఎన్నికలకు ఏడాది ముందు ప్లీనరీ జరుపుకుంటోంది.

దశాబ్ధన్నర పాటు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నీళ్లు, నిధులు, నియామాకాలపై దృష్టి పెట్టింది. ఇందులో కొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని పనులు కొనసాగుతున్నాయి. సాగు, తాగునీరు, సంక్షేమ పథకాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది కేసీఆర్ సర్కారు. రాష్ట్రం వచ్చిన మొదట్లోనే సకల జనుల సర్వే నిర్వహించారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్కీం మిషన్ కాకతీయ. తెలంగాణకు జీవనాధారమైన చెరువుల మరమ్మతులు చేపట్టింది. ఇది జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇంటింటికీ తాగునీటి కోసం మిషన్ భగీరథ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో పాటు ఎన్నికల నాటికి ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగబోమన్నారు కేసీఆర్. ఇక సాగునీటి ప్రాజెక్టుల పనులు, అందులోనూ కాళేశ్వరం పనులు ప్రాజెక్టు నిర్మాణంలోనే రికార్డు వేగంతో కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. అలాగే పెన్షన్లు వెయ్యిరూపాయలకు పెంచి అందిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భారీ లక్ష్యం పెట్టుకున్నారు. రెండు లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం వేర్వేరు దశల్లో ఉన్నాయి.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో నిరుపేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్ల కోసం సాయం అందిస్తున్నారు. 50వేల సాయంతో మొదలుపెట్టి ఇప్పుడు లక్ష వరకు సాయం పెంచారు. కులాల వారీగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తెచ్చింది. వృత్తి కులాల వారికి చేపలు, గొర్రెల పెంపకం, మత్స్యకారులు, నాయిబ్రాహ్మణులు ఇలా పలు వర్గాల ప్రజలు పలు స్కీంలు ప్రవేశ పెట్టింది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కేసీఆర్ కిట్లు పథకంతో ప్రసవం తర్వాత పిల్లలకు అవసరమైన అన్ని వస్తువులు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ కోసం తల్లికి 12వేల వరకు డబ్బులిస్తున్నారు. ఇది ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాలను పెంచడంతో పాటు ఆడబిడ్డల సంరక్షణకు ఉపయోగపడుతోందని ప్రశంసలు అందుకుంది.

నాలుగేళ్ల కాలంలో సాగునీటి రంగంలో ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేసింది. తొలి మూడేళ్లలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రకటించింది. రైతులకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు పెట్టుబడి సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి రైతు బంధు అని పేరుపెట్టారు. అంతకంటే ముందే భూముల సర్వే ద్వారా సేకరించిన సమాచారాంతో రైతులకు పక్కాగా పట్టాదారు పాసుబుక్ లు అందించనున్నారు. దీంతో భూ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. భూలావాదేవీలు కూడా సులభం అవుతాయని చెబుతోంది.

పరిశ్రమలకు అనుమతులను సులభం చేస్తూ టీఎస్ఐపాస్ విధానం తేవడంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. తెలంగాణ రాగానే ప్రధానంగా హైదరాబాద్ లో శాంతిభద్రతల మీద ప్రభుత్వం దృష్టిపెట్టడం నగరం బ్రాండ్ ను నిలబెట్టింది. పోలీసు శాఖకు భారీ నిధులిచ్చి సౌకర్యాలు కల్పించారు. శాంతిభద్రతలు బాగుండడంతో నగరానికి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. సీసీకెమెరాలతో పాటు కొత్త టెక్నాలజీ సాయంతో నేరాల దర్యాప్తులో భారీ మార్పులు వచ్చాయి. దీంతో పాటే అంతర్జాతీయ నగరంగా మారుస్తామని ప్రకటించారు. దీనికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పచ్చదనం పెంచడానికి హరితహారం కార్యక్రమాన్ని ఏటా భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఎవరి పాలనకైనా నాలుగేళ్ల కాలం తక్కువే. అయినా కొన్ని స్కీంలు శక్తికి మించి అమలు చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ లాంటి అంశాల్లో అనుకున్నస్థాయిలో జరగడం లేదన్న విమర్శలున్నాయి. మొత్తం మీద తెలంగాణ తొలి ప్రభుత్వంగా కొత్త ఆలోచనలు, నిర్ణయాలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy