టీమిండియా బిజీ: 4 నెలల్లో 23 మ్యాచ్ లు

శ్రీలంక టూర్ ముగిసి వెంటనే టీమిండియా  సొంత గడ్డకు తిరిగి రానుంది. అయితే ఏమాత్రం రిలాక్ కాకుండానే మళ్లీ ఇండియాలోనే మూడు దేశాలతో నాలుగు నెలలు వరుసగా మ్యాచ్ లతో హోరెత్తించనుంది. నాలుగు నెలల కాలంలో భారత్‌లో ఏకంగా 23 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో జరగనున్నాయి. ముందుగా ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనేందుకు మన దగ్గరకు వస్తున్నాయి. ఆ తర్వాత వన్డేలు, టి20లతో పాటు టెస్టులు ఆడేందుకు శ్రీలంక… భారత్ కు రానుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం (ఆగస్టు1) BCCI టూర్స్‌ అండ్‌ ఫిక్చర్స్‌ కమిటీ ప్రకటించింది.

ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఒక టి20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ నగరం వేదిక కానుండగా… భారత్, శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది. కొత్తగా నిర్మించిన బర్సపర (గౌహతి), తిరువనంతపురం స్టేడియాలకు కూడా ఒక్కో మ్యాచ్‌ను కేటాయించారు. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో మ్యాచ్‌లు ఉన్నాయని… స్థానిక పండుగలు, సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని తర్వాత తేదీలు ఖరారు చేస్తామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు.

భారత దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి BCCI కొన్ని కీలక మార్పులు చేసింది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది నిర్వహించిన తటస్థ వేదికల పద్ధతిపై తీవ్ర విమర్శలు రావడంతో దానికి స్వస్తి చెప్పారు. గతంలోలాగే కొన్ని హోం మ్యాచ్‌లు, కొన్ని బయటి మ్యాచ్‌ల పద్ధతితో టోర్నీని నిర్వహిస్తారు. అయితే నాకౌట్‌ మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికల్లోనే జరుగుతాయి. అక్టోబర్‌ 6న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 28 జట్లతో మూడు గ్రూప్‌లలో మ్యాచ్‌లు నిర్వహించారు.

ఈసారి దీనిని మారుస్తూ మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లు ఎ, బి, సి, డి లుగా విభజిస్తున్నారు. ఒక్కో గ్రూప్‌లో 7 జట్లు ఉండగా, ప్రతీ జట్టు లీగ్‌ దశలో ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో టాప్‌–2 టీమ్‌లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ఫార్మాట్‌ తో రంజీ ట్రోఫీ మొత్తం మ్యాచ్‌ల సంఖ్య తగ్గనుంది. మరోవైపు ఈ సారి కూడా దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ను గులాబీ బంతితోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

ఇంటర్నేషనల్ మ్యాచ్ ల షెడ్యూల్:

ఆస్ట్రేలియాతో ( సెప్టెంబర్ 11- అక్టోబర్ 11): చెన్నై,బెంగళూరు, నాగపూర్, ఇండోర్, కోల్ కతా(5 వన్డేలు), హైదరాబాద్, రాంచీ, బర్సరప(3 టీ20లు)

న్యూజిలాండ్ తో ( అక్టోబర్ 22-నవంబర్ 7): పుణె, ముంబై, కాన్పూర్(3 వన్డేలు), న్యూ ఢిల్లీ, కటక్, రాజ్ కోట్(3 టీ-20 లు)

శ్రీలంక తో ( నవంబర్ 15- డిసెంబర్24):  కోల్ కతా, నాగపూర్,న్యూఢిల్లీ(3 టెస్టులు),ధర్మశాల,మొహాలి, వైజాగ్(3 వన్డేలు), తిరువనంతపురం, ఇండోర్, ముంబై(3 టీ-20 లు).

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy