
ఆధార్ లింకింగ్ పై ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అన్ని సేవలకు ఆధార్ లింక్ గడువును మార్చి 31, 2018 వరకు పెంచుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ పై నెలకొన్న గందరగోళాన్ని తొలగిస్తూ… సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. మొబైల్, బ్యాంక్, ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికి మార్చి 31ని డెడ్ లైన్ గా ప్రకటించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు కాస్త రిలీఫ్ కలగనుంది.
అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా ప్రస్తుతానికి ఆధార్ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్ నంబర్ లేకుండానే బ్యాంకు ఖాతాను తెరవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆధార్ అప్లికేషన్ ఫామ్ కచ్చితంగా జత చేయాలని తెలిపింది. దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్న మొబైల్ ఆధార్లింకింగ్ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది.