టైర్ డీజిల్ రాబోతోంది!

పెట్రోల్ కాదు….డీజిల్ కాదు….గ్యాస్ కూడా కాదు.  ‘టైర్ డీజిల్’ తో నడుస్తోంది ఓ కారు. ఈ టైర్ డీజిల్ మార్కెట్ లోకి రావడానికి టైమ్ పడుతుంది కానీ, రావడమైతే గ్యారంటీ.  ఈ టైర్ డీజిల్ తయారుచేయడానికి కొత్త టైర్లేమీ అవసరంలేదు. పాతటైర్లు చాలు.

టైర్ డీజిల్ తయారీ పాపులర్ అయితే, పాత టైర్లకు కొత్త యోగం పట్టినట్టే. వాడి పారేసిన టైర్లను ఇంధనంగా ఉపయోగించుకునే టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది.  ప్రయోగాల దశ నుంచి ఈ టెక్నాలజీ బయటపడితే….పెట్రోల్ కు, డీజిల్ కు బైబై చెప్పేయొచ్చు. ప్రపంచంలో పాత టైర్లకు కొరతేముంది! కోట్ల కోట్ల పాత టైర్లు ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి.  ఒక లెక్క ప్రకారం….ప్రపంచం మొత్తంలో ఏడాదికి 26 కోట్ల టైర్లు అరిగిపోయి, పనికిరాకుండా పోతున్నాయి.  వీటినన్నింటినీ డీజిల్ లాంటి ఇంధనంగా మార్చేయొచ్చునని  లేటెస్ట్ రీసెర్చిలో రుజువైంది. ఈ టైర్ డీజిల్ ను ప్రస్తుతం టెస్టు చేస్తున్నారు.

టైరును కాలిస్తే గంటలతరబడీ మంట వస్తుందనేది అందరికీ తెలుసు. మంట ఓకే కానీ….కాలినప్పుడు వచ్చే వాసన భరించలేం. అయితే, టైర్లతో డీజిల్ ను తయారుచేసేటప్పుడు అంత వాసన రాదు, పైగా….బొగ్గు కన్నా తక్కువ కాలుష్యమే వదులుతుంది. కానీ, టైర్లను అదేవిధంగా ఉపయోగిస్తే డీజిల్ తయారవ్వదు. దానికో పెద్ద ప్రాసెస్ ఉంది. టైర్ డీజిల్ తయారీకి ఓ పెద్ద ఫాక్టరీనే కావల్సి ఉంటుంది.

భారీ మెషీన్లలో ముందుగా టైర్లను వేసి, చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు. ఎంత చిన్నగా అవుతాయంటే, అవి టైర్ ముక్కలని….జాగ్రత్తగా చూస్తే తప్ప తెలియదు.

ఆ తరువాత….టైరుముక్కల్నిమరో మెషీన్లో వేస్తే….కాసేపట్లోనే ఇలా టైర్ డీజిల్ తయారై బయటకువస్తుంది. ఒక లారీ టైరుతో మూడు లీటర్ల డీజిల్ తయారవుతుంది.  ఏడాదికి 26 కోట్ల పాత టైర్లు అందుబాటులో ఉంటాయి కనుక, కోట్ల లీటర్ల టైర్ డీజిల్ తయారు చేయొచ్చునన్నమాట.  ఏళ్ళ కొద్దీ తయారుచేసినా ముడిసరుకు ప్రోబ్లమ్ ఉండనే ఉండదు.

పాత టైర్లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అలా పడేస్తే….అవి నేలలోకి దిగబడుతూ, కాలుష్యాన్ని గిప్ట్ గా ఇస్తాయి. వాటివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నీళ్ళు పాడైపోతాయి. పొరపాటున అంటుకుందో….అది తగలబడినప్పుడు వచ్చే వాసన భరించలేం. టైర్లను ఇంధనంగా మారిస్తే, ఈ ప్రోబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది.

కేవలం ఇంధనమే కాదు, టైర్ డీజిల్ తయారయ్యేటప్పుడు వచ్చే బై ప్రోడక్టులు కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రాసెస్ లో వచ్చే కార్బన్ బ్లాక్, బూడిద, డిస్టిల్డ్ వాటర్ కూడా మార్కెట్లో అమ్ముకోవచ్చు.

టెస్టింగ్ పూర్తయ్యి, కమర్షియల్ గా కూడా పనికొస్తుందని రుజువైతే, గల్ఫ్ దేశాలమీద ఆధారపడకుండా ప్రతి దేశమూ కూడా సొంతంగా టైర్ డీజిల్ ను తయారుచేసుకోవచ్చు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy