డేంజర్ లెవల్స్ : జమ్మూకాశ్మీర్ ను ముంచెత్తిన వరదలు

rains-jammuజమ్మూకాశ్మీర్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. నిన్నటి వరకు కాల్పుల మోతతో దద్ధరిల్లిన ఈ ప్రాంతం.. ఇప్పుడు భారీ వర్షాలతో వణికిపోతుంది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోన్న నదులతో బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. జమ్మూ, కశ్మీర్ రీజియన్లలో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. ప్రధాన నదులైన జీలం, తావి పొంగి పొర్లుతున్నాయి. సంగం దగ్గర జీలం నది 23 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. ఉపనదులైన.. వీషా, రాంబీ ఆరా, లిద్దర్ నదుల నుంచి భారీగా వరద నీరు జీలం నదిలోకి చేరుతోంది. శ్రీనగర్ సిటీలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జమ్మూ ప్రాంతంలోని అనంతనాగ్ జిల్లాలో తావి నదికి వరద నీరు పొటెత్తింది. జమ్మూకశ్మీర్ రీజియన్లలో రికార్డ్ స్థాయిలో వర్షం కురుస్తోంది. అనంత్ నాగ్ జిల్లాలోని కొకెర్నాగ్ లో 63.4 మిల్లీమీటర్ల వాన పడింది. ఖాజీగుండ్ లో 58.6మిల్లీమీటర్లు, శ్రీనగర్ లో 12.6మిల్లీమీటర్లు, పహల్గామ్ లో 27.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజౌరీ జిల్లాలో దర్హలి నది ఉప్పొంగుతోంది.

భారీ వర్షాలతో జమ్మూకాశ్మీర్ అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సైన్యం కూడా సహాయ చర్యల్లో పాల్గొంటుంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో కొండ ప్రాంతాల్లోని ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.

అమర్‌నాథ్‌ యాత్రకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. యాత్రకు బయలుదేరిన సుమారు మూడు వేల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందులో 544 మంది మహిళలు కూడా ఉన్నారు. హైవే 260 కిలోమీటర్ల పొడవుంటుంది. భగవతీ నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య  యాత్రికులు బయల్దేరాక వర్షం ఉద్ధృతి పెరిగింది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది బండరాళ్లను, చెట్లను తొలగించినా యాత్రకు ఆటంకాలు ఎదురవుతూనే ఉండడంతో చాలా చోట్ల వారిని రోడ్ల పైనే నిలిపేయాల్సి వచ్చింది. అటు పహల్గాం బేస్‌ క్యాంప్‌ నుంచి బయల్దేరిన వారందరినీ ఉధంపూర్‌ దగ్గర నిలిపేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy