తక్కువ వడ్డీతో లోన్ పొందడమెలా..?

0అర్జెంటుగా డబ్బు అవసరమైందనుకోండి. ఠక్కున గుర్తొచ్చేది అప్పు లేదంటే పర్సనల్ లోన్. కానీ పర్సనల్ లోన్ తీసుకునేముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లోన్ పై వసూలు చేసే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మరీ తక్కువ వడ్డీ రేటుకు లోన్ దొరుకుతుందా అంటే ఎస్ అని చెప్పొచ్చు. మార్కెట్లో తక్కువ వడ్డీకి వచ్చే లోన్లపై ఈవారం వెల్త్ మేనేజ్ మెంట్ తో తెలుసుకుందాం…

నెలనెలా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని కష్టంగా నెట్టుకొస్తున్న రోజులివి. అనుకోకుండా హెల్త్ బాగలేకపోతే.. లేక పండగలు, ఫంక్షన్లు వస్తే అప్పు చేయకతప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది తెలిసిన వారి దగ్గర నుంచి ప్రైవేటు లోన్..  లేదంటే బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకుంటుంటారు.. తిరిగి చెల్లించే కాల వ్యవధి తక్కువే అయిన తీసుకున్న మొత్తంపై అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అవసరం తో పోలిస్తే ఇది తక్కువే అయిన తిరిగి తీసుకున్న మొత్తాన్ని చెల్లించేటప్పుడు దాని వడ్డీ మనల్ని ఊసురుమనిపిస్తుంది. ఇలా ఇబ్బుందులు పడకుండా తక్కువ వడ్డీకి ఆరు రకాలుగా లోన్లు తీసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆర్ధిక అవసరాలను ఆదుకోవడంలో ఇప్పటికీ బంగారానిదే మొదటి ప్లేస్. అందరికీ తెలిసిందే అయినా… వ్యక్తిగత రుణానికి సరైన ప్రత్యామ్నాయం గోల్డ్ లోనే. ఈ రుణాలపై వ్యక్తిగత రుణాలకన్నా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బంగారు నాణేలు, ఆభరణాలపై ముత్తూట్, మణప్పురం వంటి ఫైనాన్స్ కంపెనీలే కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రుణాలిస్తున్నాయి.

బంగారం రుణాలపై వడ్డీ రేట్లు రెండంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది సెక్యూరిటీగా పెట్టే బంగారం విలువ ఎంత అనేది అయితే.. రెండోది ఎంత మొత్తం లోన్ గా కావాలి అనేది.  అంటే బంగారం విలువకు, తీసుకునే రుణానికి మధ్య తేడా పెద్ద ఎక్కువ లేకుంటే వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అదే ఎక్కువ విలువైన బంగారాన్ని పెట్టి తక్కువ రుణం తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. ఈ రుణాలకు చాలా తక్కువ ప్రాసెసింగ్ సమయం పడుతుంది. 24 గంటల్లోపే రుణం మంజూరవుతుంది కూడా. తక్కువ డాక్యుమెంటేషన్, అతి తక్కువ ప్రీప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయి.

అత్యవసర సమయాల్లో ఆదుకునే వాటిలో రెండోది ఫిక్స్‌డ్ డిపాజిట్లు. భవిష్యత్తు అవసరాల కోసం చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్ల ను బ్రేక్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిపైనా రుణం తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు డిపాజిట్ మొత్తంలో 75 శాతం నుంచి 85 శాతం దాకా లోన్ ఇస్తాయి.  ఇలా తీసుకునే రుణాలపై వడ్డీ రేటు ఫిక్స్ డ్ డిపాజట్ చేస్తే బ్యాంకులు మనకిచ్చేన వడ్డీ రేటు కంటే 1 నుంచి 2 శాతం  ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న లోన్లను డిపాజిట్ మెచ్యూరిటీ తేదీలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

బీమా పాలసీలపై లోన్ తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది కూడా మంచి ప్రత్యామ్నాయమే. ఎండోమెంట్ పాలసీలతో పాటు ఇతర బీమా పాలసీలను తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చు.  పాలసీల సరెండర్ విలువలో 90 శాతం వరకూ రుణంగా పొందొచ్చు. ఈ రుణాలపై వడ్డీ రేటు 9 నుంచి 13 శాతంగా ఉంటుంది. అయితే మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించిన పాలసీలపైనే ఇలాంటి రుణాలు తీసుకునే అవకాశముంది. ఇలా తీసుకునే రుణాలు తీసుకునేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది.

లోన్ తీసుకోవడాని మరో ఆప్షన్ ..షేర్లూ, మ్యూచువల్ ఫండ్స్ . వీటిని గ్యారంటీగా పెట్టి లోన్ తీసుకోవచ్చు. అయితే, అన్ని రకాల షేర్లూ, డిబెంచర్లకు ఇది వర్తించదు. అప్పు ఇచ్చే సంస్థ ఏయే ఫండ్లు, షేర్లపై రుణాలు ఇవ్వవచ్చన్నది ఒక లిస్టు పెట్టుకుంటాయి. వాటి మీద మాత్రమే ఇస్తాయి. మరో విషయం,  వీటి విలువ రోజు రోజూ మారిపోతుంటుంది. ఈ విషయాన్ని లెక్కలోకి తీసుకుని ఫైనాన్స్ సంస్థలు లోన్ ఇస్తాయి. ఇలా తీసుకునే లోన్లు మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ మొత్తంగా చేతికి అందుతుంది.

స్థిరాస్తిపై కూడా లోన్ తీసుకోవచ్చు. ఇల్లు, ప్లాటు, కమర్షియల్ స్పేస్ వంటి స్థిరాస్తులపైనా  లోన్  తీసుకోవచ్చు. బ్యాంకులు తనాఖా పెట్టే ప్రాపర్టీ మార్కెట్ విలువలో 50 శాతం నుంచి 60 శాతం మేర రుణంగా ఇస్తాయి. సాధారణంగా రుణాలిచ్చే సంస్థలు ప్రాపర్టీ విలువను చాలా తక్కువగా లెక్కగట్టే అవకాశం ఉంది కాబట్టి.. మరింత అధిక రుణం పొందాలంటే.. థర్డ్ పార్టీతో వేల్యుయేషన్ చేయించుకుంటే మంచిది. వీటిపై వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలా తీసుకునే లోన్ల ప్రాసెసింగ్‌కి వారం నుంచి  పదిరోజులు సమయం పడుతుంది.

మీరు ఉద్యోగులైతే ..అత్యవసర ఆర్థిక అవసరాల కోసం మీరు పనిచేసే కంపెనీలో శాలరీ అడ్వాన్స్ ను తీసుకునే వీలుంటుంది. ఇది మంచి ఆప్షను. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇలా లోన్‌లు ఇస్తుంటాయి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని నెలకి ఇంత చొప్పున జీతంలో నుంచి మినహాయించుకుంటాయి. చాలా కంపెనీలు ఇలా తీసుకునే మొత్తాలపై వడ్డీని వసూలు చేయవు. ఒక వేల తీసుకున్నా  చాలా తక్కువగా ఉంటుంది. మిగతా అప్పుల్లాగా కాకుండా యాజమాన్యం ఒప్పించగలిగితే ఎలాంటి షరతులు లేకుండా అడ్వాన్స్ గా డబ్బును తీసుకోవచ్చు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy