
మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా మంచిర్యాలలో 46మి.మీ, జనక్ పూర్ లో 43 మి.మీ, తాండూరులో 41, బెజ్జంకీలో 40మి.మీ.ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో అంగడి పర్వతాలు(60), డొంగరి రామయ్య(36) చెట్టు కింద సేద తీరుతుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నల్లకుంట చెరువు కట్ట తెగి రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జడ్చర్ల మండలం అలూరులో పిడుగుపాటుకు కృష్ణయ్య(60) అనే రైతు, బాదేపల్లిలో గోడ కూలి లక్ష్మీ(40) అనే మహిళ మృతి చెందారు. తాడూరు మండలం గన్యాకుల గ్మానికి చెందిన పద్మ(43), సత్యమ్మ(42) పిడుగుపాటుకు మృతి చెందారు.
నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. నాగర్కర్నూల్జిల్లా ఉప్పునుంతల మండలంలో మోస్తరు వర్షం కురువగా, కల్వకుర్తి మండలంలో చిరుజల్లులు పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్, ఐజలో భారీ వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సూర్యాపేట మండలం దేవరకొండలో మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా చిట్యాల, నార్కట్ పల్లి మండలాల్లో వర్షం పడింది.