తాగునీటి హక్కు కల్పన దిశగా తొలి అడుగు

water-is-the-focal-point-around-which-the-telangana-governments-main-projects-revolveమిషన్ భగీరథ… సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు. ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కాబోతోంది. మెదక్ జిల్లా కోమటిబండలో పైలాన్ ఆవిష్కరణతో మిషన్ భగీరథకు తొలి అడుగుపడబోతోంది. మిషన్ భగీరథ తొలిదశలో భాగంగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని 243 గ్రామాల్లోని 66,000 ఇళ్లకు పైప్ లైన్ల ద్వారా సురక్షిత మంచినీటిని ఇవ్వనున్నారు. 2014 ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేసినా.. ఆయన నోటినుంచి వచ్చిన వాగ్దానాల్లో ఇదొకటి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా మంచి నీళ్లు అందించని పక్షంలో మరోసారి ఓట్లడగనని.. ప్రతిజ్ఞ చేసి మరీ గెలిచారు. ఆ వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో మొదటి అడుగు సొంత జిల్లా మెదక్ లోనే వేస్తున్నారు సీఎం.

సురక్షిత మంచినీరు ఇప్పుడు ఇవ్వడమేంటి… ఎప్పటి నుంచో  ఉంది కదా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అయితే  సీఎం చేస్తున్న పని దానికి కాస్త డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు రాష్ట్రంలో చాలా గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించాయి. అయితే ఎండాకాలంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి. మళ్లీ చాలా మంది బోరు నీళ్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. అలా రక్షిత మంచినీరు విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందేవి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. 1996 – 97 ప్రాంతంలో తను ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మంచినీటిని అందించారు. దాన్నే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. నిరంతరం రక్షిత మంచినీరు అందించేందుకు 43వేల కోట్ల రూపాయలతో భారీ ప్రణాళిక రచించారు. మొదట 35 వేల కోట్లు అనుకున్నా.. తర్వాత అంచనాలు పెరిగాయి. 25 వేల గ్రామాలు, 67 పట్టణ ప్రాంతాలు ఈ మిషన్ భగీరథ ద్వారా లబ్దిపొందనున్నాయి. శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, కొమురం భీం ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు, జూరాల, నిజాం సాగర్ ప్రాజెక్టులతో నీటిని అందించేందుకు ప్రణాళికలు రచించారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్ మెంట్ లు ప్రాజెక్టులకు రూపకల్పన చేశాయి. ఈ పథకంలో అందరికంటే ముందుగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy