తీరం దాటిన గజ తుపాన్

చెన్నై: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుపాన్ ఎట్టకేలకు తీరం దాటింది. తమిళనాడులోని నాగపట్నం-వేదారణ్యం మధ్య ఇవాళ తెల్లవారు జామున 2.30 గంటలకు తుపాను తీరం దాటినట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. తీరం దాటిన సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడంతో తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. తుపాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో దీని ప్రభావం అధికంగా ఉంది.

తుపాను తీవ్రత దృష్టిలో పెట్టుకొని గురువారమే హై అలర్ట్‌ ప్రకటించింది తమిళనాడు సర్కారు. ముందస్తు చర్యల్లో భాగంగా 80వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడలూరు, నాగపట్నం, తిరువారూర్‌, రామనాథపురం సహా ఆరు జిల్లాల్లో 331 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏడు జిల్లాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం.

తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. అనేక చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కల్గింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సైతం నిలిచిపోయాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని బీచ్‌ల వద్ద ప్రవేశాన్ని నిషేధించారు. సహాయ చర్యల కోసం నాగపట్నంలో నాలుగు, కడలూరు జిల్లాలో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించాయి. బాధితులకు ఆహారం, వస్తువులను హెలికాప్టర్ల ద్వారా అందజేస్తున్నారు. బాధితుల సహాయార్ధం హెల్ప్‌ లైన్లను ఏర్పాటుచేశారు. నాగపట్నం, తిరువూరు, తంజావూరు వెళ్లే రైళ్లను దక్షిణ రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. తుపాను సహాయచర్యల కోసం ఐసీజీ సముద్ర తీరంలో 8 నౌకలు, రెండు డార్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్ల్‌లు మోహరించింది. తూర్పు నౌకాదళం ఐఎన్‌ఎస్‌ రణ్‌దీర్‌, కంజార్‌ యుద్ధ నౌకలతో పాటు పలు హెలికాప్టర్లను సిద్ధం చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy