తూర్పుగోదావరి జిల్లాకు ధీటుగా పాలమూరు జిల్లా: కేసీఆర్

cmపాలమూరు జిల్లాను తూర్పు గోదావరి జిల్లాకు దీటుగా తయారు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం జిల్లాకు సమగ్ర జలవిధానం తీసుకొస్తున్నట్టు చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ది చేద్దామని పిలుపునిచ్చారు.

పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, వంశీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలు ప్రగతీ భవన్లో సీఎంతో భేటీ అయ్యారు. జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పాలమూరు అభివృద్దికి తీసుకుంటున్న చర్యలను నేతలకు సీఎం వివరించారు.

గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న నీటని సద్వినియోగం చేసుకునేందుకు సమగ్ర జలవిధానం అమలు చేస్తున్నామని తెలిపారు సీఎం. పాలమూరు ఎత్తిపోతలపై ఏపీ అనుమానాలను అపెక్స్ కమిటీలో నివృత్తి చేశామని చెప్పారు. ఆరునూరైనా ఎత్తిపోతలను కట్టి తీరుతామన్నారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుందని. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిల్లాకు నీరందుతుందని తెలిపారు.

ప్రాజెక్టుల రీ డిజైన్లో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని వాడుకోవాలని నిర్ణయించామన్నారు సీఎం. శ్రీశైలం పాయింట్ దగ్గర వంద టీఎంసీల లభ్యత ఉందని… ఏడాది పొడవునా ఇక్కడ నీరు అందుబాటులో ఉంటుందన్నారు. అందుకే శ్రీశైలం పాయింట్ దగ్గరే పాలమూరు ఇన్ టేక్ ప్లాన్ చేశామని వివరించారు. ఈ ఖరీఫ్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని..త్వరలోనే తుమ్మిళ్ల లిఫ్టు ఇరిగేషన్ ను చేపడతామన్నారు.

మరోవైపు గద్వాల- మాచర్ల రైల్వే లైను పనులపై నేతలు ప్రశ్నించగా… దీనిపై ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పారు సీఎం.  మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తానని చెప్పారు. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నందున… వారికోసం హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గద్వాల పీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

మహబూబ్ నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని నేతలకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారించడంలో కాంగ్రెస్ కలిసి రావాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy