తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం కసరత్తులు

parliamentరాష్ట్ర విభజనపై తుది అంకానికి కేంద్రం సిద్ధమవుతోంది. తెలంగాణ బిల్లును వచ్చే నెల 10వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టి, 15వ తేదీకల్లా ఆమోదింపజేసుకొనే ఏర్పాట్లలో ఉంది. ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. యూపీఏ -2 ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. దీంతో ఈ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. బిల్లుపై అభిప్రాయానికి అసెంబ్లీకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. తెలంగాణ పై కేంద్రమంత్రుల బృందం ఫిబ్రవరి 4న సమావేశం కానుంది. 3లోగా అసెంబ్లీ అభిప్రాయం కేంద్ర హోంశాఖకు చేరుతుంది.  4న జరిగే జీవోఎంలో అసెంబ్లీ  ప్రతిపాదించిన ప్రధాన  సవరణలను బిల్లులో చేర్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. బిల్లుపై కేంద్రం తన వైఖరిని చెబుతూ తదుపరి ప్రక్రియను చేపట్టాల్సిందిగా రాష్ట్రపతిని కోరేందుకు 6న కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. అనంతరం 10న బిల్లు పార్లమెంటు చేరే అవకాశం ఉంది. 15కల్లా  బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకుని, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టవచ్చని అధికారవర్గాలంటున్నాయి. ఒకవేళ బిల్లు ఆమోదం పొందడంలో ఆలస్యమైతే సమావేశాలను మరో నాలుగు రోజులు పొడిగించే అవకాశముందని చెబుతున్నారు. బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది.

ఇప్పటికే 9 వేల సవరణలకు ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో ప్రధానంగా పదింటిని బిల్లులో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజలు, పార్టీలు ప్రతిపాదిస్తున్నట్టుగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చడం, నదీ జలాల పంపకం,  కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీలను చేర్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ నాయకులు ప్రతిపాదిస్తున్నట్టుగా ఉమ్మడి రాజధానిపై గవర్నర్ అధికారాల్లో సవరణలు చేయవచ్చని తెలుస్తోంది. వీటిపై సమాచారం కోసం కేంద్ర హోంశాఖ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy