తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేకం

hyderabad32009 డిసెంబర్ 9. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని మైలురాయి. నిరాశ, నిస్పృహలతో ఉన్న తెలంగాణ సమాజం సంబరాలు చేసుకునేందుకు కారణమైంది సరిగ్గా ఈరోజే. కేసీఆర్ ఆమరణ దీక్షతో.. దిగొచ్చిన కేంద్రం.. తెలంగాణ ఇస్తామంటూ డిసెంబర్ 9, 2009న ప్రకటన చేసింది. నాటి హోం మంత్రి చిదంబరంతో అర్ధరాత్రి సమయంలో డైరెక్ట్ గా ప్రకటన చేయించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చింది.

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఆనాటి హోంమంత్రి చిదరంబం చేసిన ఈ ప్రకటన.. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని దేశానికి చాటి చెప్పింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర విభజనను అడ్డుకునేందుకు ఏపీ నేతలు రాజీనామాలతో కుట్రలు చేసినా.. కమిటీల పేరుతో కేంద్రం కాలయాపన చేసినా.. ఉద్యమం ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికక్కడ రూపు మార్చుకుంటూ కేంద్రాన్ని తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా.. కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు నాటి ప్రకటనే కారణంగా నిలిచింది.

తెలంగాణపై ఏ పార్టీ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని బయట పెట్టేందుకు కూడా చిదంబరం ప్రకటన ప్రధాన కారణంగా నిలిచింది. ముందు తెలంగాణకు అంగీకారం తెలిపి.. చివరికి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ట్రై చేసిన పార్టీలు, నాయకుల కుట్రలు కూడా చిదంబరం ప్రకటన తర్వాత బయటపడ్డాయి. దీంతో.. తెలంగాణ ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు నేతల కుట్రలను ఎండగట్టింది.

2009లో తెలంగాణ ప్రకటన చేసిన కేంద్రం.. దాన్ని కార్యరూపంలో చూపించేందుకు నాలుగున్నరేళ్లు ఆగాల్సి వచ్చింది. డిసెంబర్ 9న చేసిన ప్రకటన కాంగ్రెస్ ను తెలంగాణ విషయంలో మాట తప్పకుండా ఉండేందుకు దోహదపడింది. దీంతో.. తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటం.. ప్రత్యేక రాష్ట్ర సాధన కల సాకారమవడంలో.. ఈరోజున చిదంబరం ప్రకటనే కీలక పాత్ర పోషించినట్టైంది.

తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకూ ఓ సెంటిమెంట్ గానే ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఈరోజున కేంద్రం చేసిన ప్రకటనతో మరింత బలపడింది. ఇపుడు కాకపోతే ఇంకెపుడూ కాదన్న వాదం వేళ్లూనుకుంది. అప్పటివరకూ ఏమూలనో తెలంగాణపై అనుమానాలున్న సామాన్యం జనం కూడా.. ప్రత్యేక రాష్ట్ర నినాదం అందుకున్నారు. ఓవైపు కృత్రిమ సమైక్య ఉద్యమాలు సాగినా.. అందుకు దీటుగా.. రైల్ రోకో, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటావార్పు ఒకటేమిటి.. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను.. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆలోచింపచేసేలా ఉద్యమం నడించేందుకు ఈ తెలంగాణ ప్రకటనే సాయపడింది.

అందుకే తెలంగాణ బిడ్డలంతా డిసెంబర్ 9 అనగానే.. తెలంగాణ తొలిప్రకటన అని టక్కున చెబుతారు. ఎన్నో ఆశలు , ఆశయాలు, ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణ.. ఉద్యమంలో దేశానికి ఆదర్శంగా నిలిచినట్లుగానే.. అబివృద్ధిలోనూ మరింత వేగంగా ముందుకు సాగాలని కోరకుంటోంది ప్రజానీకం.

2 Responses to తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేకం

  1. Ashok says:

    Anyway finally we got it help of all political parties in central government…

  2. Svylnrao says:

    The greatest day of Telangana which lead by KCR .

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy