తెలంగాణ తొలి మాండలిక రచయిత్రి.. యశోదారెడ్డి

Pakala-Yashoda-reddyప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా.. తెలంగాణ సాహితీ దిగ్గజాలను స్మరించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అచ్చ తెలుగు రచనల్లో… తెలంగాణ మాండలికాన్ని చొప్పించిన సాహిత్య సేవకులు ఎందరో ఉన్నారు. అమ్మానాన్నలను చిన్నతనంలోనే కోల్పోయినా… కష్టపడి చదువుకుని.. కథలు, కవితలు, గ్రంథాలు రాసిన గొప్ప రచయిత్రి యశోదా రెడ్డి. తెలంగాణ మాండలిక తొలి రచయిత్రిగా పేరొందిన యశోదా రెడ్డిపై స్పెషల్ స్టోరీ.

తెలంగాణ మాండలికాన్ని రచనలోనూ అద్భుతంగా వాడొచ్చని నిరూపించిన మహిళా సాహితేవేత్త పాకాల యశోదారెడ్డి. రచనలకు మన భాష పనికిరాదన్న భావనను పటాపంచలు చేసి కొత్తతరం తెలంగాణ రచనలకు దారిచూపించారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళ. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో పుట్టిన యశోదారెడ్డి మన భాషంత తీయనైన మనిషి. 1929 ఆగస్ట్ 8న పుట్టారు. తల్లిదండ్రులు సరస్వతమ్మ, కాశిరెడ్డి. చిన్నతనంలోనే అమ్మనాన్నలను పోగొట్టుకున్న ఆమె చదువే ప్రాణంగా బతికారు. ఆడపిల్ల చదువుకు ఎదురయ్యే అన్నిరకాల ఇబ్బందులనూ ఎదుర్కొన్నా ఎక్కడా ఆగలేదు. 1955లోనే హైదరాబాద్ ఉమన్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జీవితం ప్రారంభించారు.

తెలుగుతో పాటు సంస్కృతంలోనూ యశోదా రెడ్డి పీజీ పూర్తిచేశారు. జర్మన్ భాషలో డిప్లొమా చేశారు. హిందీ, ఉర్దూ, కన్నడం భాషలు కూడా తెలుసు. హరివంశం అనే అంశం మీద పరిశోధనకు 1969లో ఆమె డాక్టరేట్ అందుకున్నారు. 12వ ఏట నుండే రచనలు చేయడం మొదలుపెట్టిన ఆమె వందకు పైగా కథలు రాశారు. వాటిలో 63 మాత్రమే పుస్తకాలుగా వచ్చాయి. ఇంకా పారిజాతాపహరణ పర్యాలోచనం, ఆంధ్ర సాహిత్య వికాసం, నేమాని భైరవకవి, ఉత్తర హరివంశం, భారతంలో స్త్రీ, అమరజీవులు, నారదీయం, చిరుగజ్జెలు, ద్విపద, ప్రబంధ వాజ్ఞ్మయము, రచ్చబండ, నాగి లాంటి 30 గ్రంథాలు రాశారు. అచ్చ తెలంగాణ యాసలో రాసిన మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల లాంటివి మన భాష సొగసును, సౌందర్యాన్ని, సాంస్కృతి, జీవన విధానాల్ని అద్భుతంగా కళ్లకు కడతాయి.

యశోదారెడ్డి నవల, కథ, కవిత, వ్యాసం లాంటి అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. సాహిత్య పరిశోధన వ్యాసాలు రాయడంలో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె రాసిన వందలాది వ్యాసాలు మూసీ, పరిశోధన, ఆంధ్రప్రదేశ్, జాగృతి, ప్రజాతంత్ర, భారతి, నా తెలంగాణ పత్రికల్లో వచ్చాయి. వీటితో పాటు ఆకాశవాణిలో రెండువందలకు పైగా ప్రసంగాలు ప్రసారమయ్యాయి. వీటిలో మాండలికంలో రాసిన కథలు, హాస్యరచనలు, పండగలు-పబ్బాలు, ఎచ్చమ్మ కథలు, మహాలక్ష్మి ముచ్చట్లు లాంటివి జెర ఇనుకోవే తల్లీ అనే పేరుతో ప్రసారమయ్యాయి.

1949-50ల్లోనే దక్కన్ రేడియోలో మాండలికంలో మొదటిసారిగా కథలు, సంభాషణలు, పిల్లల నాటికలను యశోదారెడ్డి ప్రారంభించారు. బెజవాడ గోపాలరెడ్డి, తిరుమల రామచంద్ర ప్రోత్సాహంతో ఆమె తెలంగాణ నుడికారంతో రాయడం మొదలుపెట్టారు. అలా మాండలికంలో రచనలకు ఆద్యురాలిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు.

యశోదారెడ్డి తెలంగాణ వాడుకలో చేసే ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. అమ్మాయిలు చదువుకోవడమే కష్టమైన రోజుల్లో లెక్చరర్ అయ్యి అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్న ఆమెను ప్రముఖ చిత్రకారుడు పి.టి.రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్తతో పాటు చిత్రకళా ప్రదర్శనలకు అనేక దేశాల్లో పర్యటించిన ఆమె ఆ అనుభవాలతో భారతీయ చిత్రకథ అనే గ్రంథం రాశారు.

కాలంతో పాటు భాష ప్రాచీన రూపాలు కనుమరుగు కావద్దన్న ఆలోచనతో మాండలిక పదాలు, జాతీయాలు, పదబంధాలను, పరిణామక్రమంలో మాండలిక పదాల ఉచ్చారణలో వస్తున్న మార్పులను యశోదారెడ్డి రికార్డు చేశారు. అనేక భాషా సాహిత్య సంఘాలకు సభ్యురాలిగా సేవలందించారు. 1990 నుండి 1993 వరకు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు.

భాషకు, సాహిత్యానికి చేసిన సేవలకు ఆమె రాష్ట్ర సాహిత్య అకాడమి పురస్కారంతో పాటు ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 33 సంవత్సరాల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ప్రొఫెసర్ గా పనిచేశారు. సాహితీవేత్తగా, విమర్శకురాలిగా ఆమెది ప్రత్యేకమైన శైలి. సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. యశోదారెడ్డి 2007 అక్టోబర్ 7న కన్నుమూశారు. తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ఆమె పేరుతో యశోదారెడ్డి స్మారక పురస్కారాలు ఇస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy