నవ తెలంగాణ పై సీఎం కేసీఆర్ విజన్..!

KCR3తెలంగాణ విజన్ పై సీఎం కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. నవతెలంగాణ సమాలోచన పేరిట జరిపిన సమీక్షలో అధికారులకు అన్ని రంగాలపై సూచనలు చేశారు. తెలంగాణకు వనరులు, వాస్తవాలును దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలంటే అవినీతిని గ్రామ స్థాయి నుంచే అంతం చేయాల్సి ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ముందు ఎన్నో సవాళ్లున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెచ్చిన చట్టాలు తెలంగాణ లో పనికిరావన్నారు.

గ్రామ స్థాయి నుంచే పాలసీలు :

పాలసీ కింది నుంచి పై స్థాయికి జరగాలన్నారు సీఎం. హైదరాబాద్ నుంచి పాలసీ నిర్మించుకోవడం కాదని, గ్రామ స్థాయి నుంచే పాలసీలు జరగాలన్నారు. తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తో పాటు స్థానిక పాలకులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  8500 సర్పంచులు, 6473 ఎంపీటీసీలు, నగర, మున్సిపల్, కార్పోరేషన్ … ఎంపీపీ, జడ్పీ సభ్యులు 441, మున్సిపాలిటీలు 62.. కార్పోరేషన్లు 6, మున్సిపాల్ వార్డులు 1388 ఉన్నాయన్నారు. వీళ్లే కాకుండా వార్డు మెంబర్లు ఉంటారన్నారు. వీరందరి సహకారంతో పాలసీలు జరగాల్సి ఉందన్నారు. మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ సంస్థ, ఎన్ఐఆర్ డీ, అపార్ట్ , బ్రహ్మకుమారీస్  .. సంస్థల ద్వారా రాబోయే 20 రోజుల్లో శిక్షణా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సర్పంచులకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల అధ్యక్షులకు, జిల్లా చైర్మన్ లకు, మున్సిపల్ ఛైర్మన్ లకు అందరికీ.. మూడు రోజుల శిక్షణా ఇవ్వాల్సి ఉంటుంది.  తొలుత పంచాయతీ రాజ్ పేరు కమ్యూనిటీ డెవలప్ మెంట్.. దీన్ని స్థాపించింది ఎస్.కె.డే.. ఎంతో ఆదర్శంగా ప్రారంభించిన తర్వాత పొలిటికలైజ్ అయ్యిందన్నారు. గ్రామ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలని, ప్లాన్ యువర్ విలేజ్.. ప్లాన్ యువర్ టౌన్ అన్నట్లుగా ముందుకెళ్లాలని అన్నారు.

అక్రమార్కులు నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు :

తెలంగాణ లో కుటుంబాల సంఖ్య దాదాపు 84 లక్షలు ఉన్నాయని,  కానీ వైట్ రేషన్ కార్డులు 91 లక్షలు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా అంత్యోదయ కార్డులు, 15 లక్షల గులాబీ రంగు కార్డులు ఇష్యూ చేయబడ్డాయన్నారు.  అంటే దాదాపు 22 లక్షల కార్డులు అదనంగా ఇష్యూ అయ్యాయయని, ఈ కార్డులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. పేదలకోసం వెచ్చించే నిత్యావసర సరుకులు ఎక్కడికెళ్తున్నాయని అన్నారు. దీని వల్ల ఎంతో ప్రభుత్వ వ్యయం వృధా అవుతుందన్నారు. గృహ నిర్మాణం లో 84 లక్షల కుటుంబాలకు 54 లక్షల  ఇళ్లు పూర్తయ్యాయని అని అన్నారు. కానీ అక్కడ ఇళ్లు లేవన్నారు. 593 గ్రామాల్లో సర్వే చేస్తే.. అక్కడ 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నారు. ఇండ్లు నిర్మించినట్లు రికార్డులున్నాయి.. కానీ అక్కడ ఇండ్లు లేవన్నారు. దీనిపై టోటల్ రివ్యూ చేస్తే చాలా దారుణాలు బయటపడతాయని, అక్రమార్కులను జైలుకు పంపుతామన్నారు.

రైతురుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, వచ్చే కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బలహీన ప్రజలు గౌరవం తో బతకాలని డబల్ బెడ్ రూం ప్లాట్లు నర్మించాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది.. కానీ ఇదే తీరుగా అక్రమాలు జరిగితే వేల కోట్లు నిధులు దుర్వినియోయగం జరుగుతుందన్నారు. వికలాంగులకు 1500, వృద్ధులకు 1000 పిన్షన్లు… ఇందులో అక్రమాలు జరిగే పరిస్థితే లేదన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డవారు మళ్లీ నోర్లు తెరుచుకొని చూస్తున్నారని, కానీ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి ఆస్కారం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని గతంలో అక్రమాలు జరిగినవన్నీ వెలికి తీయాలని ఆదేశించారు. అక్రమార్కులను అరెస్టు చేసి జైళ్లకు పంపాల్సిందేనన్నారు..

మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కీలకం :

తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కీలకమని సీఎం అన్నారు. చెరువులు, కుంటలకు అత్యధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ కు పూర్తి స్థాయిలో నీరందించొచ్చని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోక పోవడం వల్ల చెరువులు, కుంటలు మాయమయ్యాయని తెలిపారు. ఇక ఉమ్మడి ప్రభుత్వంలో కృష్ణా, గోదావరి నుంచి

తెలంగాణకు 12 వందల టీఎంసీలు కేటాయించారని అన్నారు. 200 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్కు కేటాయించారని అధికారులకు తెలిపారు. వీటిని చెరువులు, కుంటలకు మళ్లించి అక్కణ్నుంచి రైతులకు నీరందిచొచ్చునన్నారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల ద్వారా మంచి సాగునీరు అందివ్వొచ్చన్నారు.  ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు గోదావరి బేసిన్లో ఉన్నాయని.., అదే విధంగా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నాయని తెలిపారు. అలాగే ఖమ్మం, వరంగల్ జిల్లాలు కృష్ణా, గోదావరి బేసిన్ రెండింటిలో కలుస్తాయని అన్నారు. వీటి ద్వారా తెలంగాణకు పూర్తి స్థాయిలో నీరందొచ్చన్నారు.

తెలంగాణలో పవర్ ప్లానింగ్ జరగాలి:

తెలంగాణకు విద్యుత్ అందించడం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు సీఎం. 600 మెగావాట్ల విద్యుత్ ను జెన్ కో రంగంలో ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇక రాష్ట్రంలో ఫారెస్ట్ అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 25.1శాతం అటవీ ప్రాంతం ఉందని, దాన్ని 33 శాతం గా మార్చేందుకు ప్రణాళిక రచించాలని ఆదేశించారు. త్వరలో 230 కోట్ల మొక్కలు పెంచాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ప్రతి ఏడాది గ్రామంలో 33వేల మొక్కలు నాటాలని, దీనికి అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు.

గ్రామానికి డంప్ యార్డు, వైకుంఠ ధామం :

ఇక గ్రామాల్లోని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు కేసీఆర్. ప్రతి గ్రామానికి డంప్ యార్డు ఉండాలన్నారు.  గ్రామంలో ఉన్న చెత్తను వేసేందుకు ఒక డంప్ యార్డు ఉండాలని, దాన్ని గ్రామస్తులే నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడంపై ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఉండాలన్నారు. కలిసున్నపుడు కుల మతాలతో విడిపోయినా.. కనీసం చనిపోయాకనైనా మత సామరస్యం కనిపించేలా ఒకే స్మశాన వాటిక ఉండాలన్నారు. దీనిపై వివిధ దేశాల్లో ఉన్న సిస్టమ్ ను స్టడీ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతీ గ్రామానికి వెళ్లి కలెక్టర్లు అన్ని సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. జనానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలని, అప్పుడే వారి అభిప్రాయాలు చెప్పగల్గుతారని సూచించారు.

హైదరాబాద్ లో 58 వేల అక్రమ బిల్డింగులు :

తెలంగాణకు గుండె కాయ హైదరాబాదేనన్నారు సీఎం కేసీఆర్. ఐటీఐఆర్ ప్రాజెక్టు అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. అందుకోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్కు మరో రెండు ఎయిర్ పోర్టులు రావాల్సి ఉందన్నారు. మెట్రో సిస్టం డెవలప్ కావాల్సి ఉందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. భూ అక్రమణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఎన్నో భూములు అక్రమంగా కబ్జాలకు గురయ్యాయని, గత ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు భూములను కట్టబెట్టాయని అన్నారు. 58వేల అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ లో ఉన్నాయంటే ఎంతటి విధ్వంస జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో అక్రమాలకు తావులేదని, అవినీతికి పాల్పడితే జైలుకు పంపుతామన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీలేదన్నారు. ఏపీ ప్రభుత్వంతో తెలంగాణకు పోటీ లేదన్నారు. గుజరాత్, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో తాము పోటీలో ఉన్నామని తెలిపారు.  హైదరాబాద్లో 15-20 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ లో ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలన్నారు. విజన్ తెలంగాణ లో భాగంగా అధికారులకు ఎన్నో సూచనలతో పాటు, ప్రభుత్వ విధానాలనకు కూడా తెలియజేశారు సీఎం.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy