తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కాయకల్ప అవార్డులు అందుకున్న రాష్ట్రానికి..శుక్రవారం (ఏప్రిల్-20) నేషనల్ లెవెల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికేట్ లు దక్కాయి. ఈ అవార్డులు తెలంగాణ వైద్యశాలలకు వరసగా లభించాయి. అదేవిధంగా స్టేట్ క్వాలిటీ టీమ్ కి కూడా అవార్డు దక్కింది. ఈ సర్టిఫికేట్లను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే చేతులు మీదుగా సంబంధిత డాక్టర్లు, సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో అందుకున్నారు. ఇప్పటికే పలు నామినేషన్లు వేసినందున ఇదే కేటగిరీలో తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ మరికొద్ది రోజుల్లో మరిన్ని అవార్డులు-సర్టిఫికేట్లు దక్కించుకోనున్నది. వరసగా అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఇదంతా సిఎం కెసిఆర్ ఇస్తున్న ప్రోత్సాహం, సిబ్బంది చేస్తున్న పని తీరు వల్లే సాధ్యమవుతున్నదన్నారు. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి.. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
రోగుల హక్కులు, పరికరాలు, మానవ వనరులు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం-భద్రత, బ్లడ్ బ్యాంకు, డైట్, లాండ్రీ వంటి ఇతర సహాయక వనరులు, రోగుల, ఉద్యోగుల సంతృప్తి, బెడ్ ఆక్యుపెన్సీ వంటి పలు రకాల ప్రమాణికాలతో కేంద్ర ప్రభుత్వం ఈ సర్టిఫికేట్లను ఇస్తున్నది. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్ఛోడ, ఇంద్రవెల్లి, భీంపూర్ ఏజెన్సీ ప్రాంత దవాఖానాలు నేషనల్ లేవెల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికేట్కి ఎంపికయ్యాయి. అలాగే, ఈ ఎంపిక చేసిన స్టేట్ క్వాలిటీ టీమ్ కి కూడా సర్టిఫికేట్ దక్కింది. ఇలా సర్టిఫికేట్లు పొందిన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలవడం విశేషం.