
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వేగం పెంచింది. పార్లమెంట్ లో త్వరగా బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించాలని ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలను ప్రధాని విందుకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వెనక్కి వెళ్ళేది లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్.
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేయించడమే మా ముందున్న లక్ష్యమన్నారు అజయ్ మాకెన్. పార్లమెంట్ లో ఆరు అవినీతి నిరోధక బిల్లులతో పాటు తెలంగాణ బిల్లు పాస్ చేయించేందుకే ప్రధాని ప్రతిపక్ష నేతలతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై వేటు వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఎన్ని బిల్లులు ఉన్నా తెలంగాణ బిల్లుకే మొదటి ప్రధాన్యతనిస్తామన్నారు అజయ్ మాకెన్. తెలంగాణ బిల్లుపై కాసేపట్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది.