తెలంగాణ మార్గదర్శి

11223528_1626488474293279_8969689501982795036_n3 తరాల ఉద్యమ వారధి.. 10 జిల్లాల పోరాటాన్ని ప్రపంచ స్థాయిలో వినిపించిన శక్తి.. 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి కారణమైన వ్యక్తి… ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా.. రాష్ట్ర సాధన గురించి చెప్పుకున్నా… ఆయన ప్రస్తావన లేకుండా ఉండదు. మలిదశ ఉద్యమం నాటి నుంచి.. 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే వరకూ తెలంగాణ ఉద్యమ ప్రతి అడుగులో సార్ ముద్ర కనిపిస్తుంది. అంతటి మహనీయుడు పుట్టి.. ఇవాల్టికి 82 ఏళ్లవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా… వీసిక్స్ స్పెషల్

ఉద్యమాల ఉపాధ్యాయుడు.. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు… 3 తరాల పోరాటానికి వారధి… ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. పుట్టుక ఆయనదే.. చావు ఆయనదే. కానీ… జయశంకర్ సార్ బతుకంతా తెలంగాణది. 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు జయశంకర్. చిన్నప్పటి నుంచే అన్యాయంపై గొంతెత్తిన ఆయన.. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకున్నారు.

వివక్షను ప్రశ్నించారు.. దోపిడీపై కలం సంధించారు. తెలంగాణకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అలీగఢ్, బనారస్ యూనివర్సిటీల్లో చదువుకున్న జయశంకర్.. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు.. ఎట్లా అవసరమో చెప్పిన వారిలో జయశంకర్ మొదటి స్థానంలో ఉంటారు. 1950 ల్లో విద్యార్థి సంఘ నాయకుడిగా నాటి ఫజల్ అలీ కమిషన్ ముందు ప్రత్యేక రాష్ర్ట అవసరాన్ని చాటి చెప్పారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలో ముందున్నారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకంగా అడుగులు వేశారు. మొదటి ఎస్సార్సీ కమిషన్ ఎదుట హాజరై.. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను బలంగా వినిపించారు.

1960లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టారు…. జయశంకర్ సార్. సీకేఎం కాలేజీకి ప్రిన్సిపల్ గా పనిచేశారు. తర్వాత.. 1979 నుంచి 1981 వరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా… 1991 నుంచి 1994 వరకు వైస్ చాన్స్ లర్ గా సేవలందించారు. విద్యావేత్తగా వందలాది విద్యార్థుల అభివృద్ధికి పాటుపడ్డారు. అక్కడితో ఆగకుండా… తెలంగాణ ప్రజలకు ఉద్యమ పాఠాలు చెప్పి మాస్టారయ్యారు. ఉద్యమం ఉధృతంగా సాగేందుకు.. పేరు పేరునా తెలంగాణ ఆవశ్యకత తెలియజెప్పారు. 1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ ముందు నిలిచారు. ప్రాంతీయ అసమానతలపై అధ్యయనం చేసిన ఆయన… ఉద్యమంలో తన గొంతుకను బలంగా వినిపించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు.

తొలి, మలి విడత ఉద్యమాలకు వారధిగా ఉన్నది జయశంకర్ సారే. రాష్ట్ర సాధనే లక్ష్యంగా… మొదటి నుంచి చివరి వరకు స్థిరంగా నిలబడిన ఒకే ఒక్క వ్యక్తి, నాయకుడు, మేధావి, ఉద్యమకారుడు కూడా ఆయనే. ప్రత్యేక రాష్ర్టం కోసం అరవయ్యేళ్లుగా వేర్వేరు దశల్లో సాగిన సుదీర్ఘ ఉద్యమానికి భావజాలాన్ని సిద్ధం చేశారు జయశంకర్. తెలంగాణ నినాదం వినిపించిన ప్రతి నాయకుడికీ అండగా నిలిచి… ఉద్యమ భావజాలాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమాల నుంచి మలి దశ ఉద్యమం వరకు ప్రత్యక్షంగా పాల్గొన్నారు జయశంకర్. అందుకే తెలంగాణ మొత్తానికి ఆయన సార్ అయ్యారు.

ఎలాంటి పరిస్థితుల్లో కూడా జయశంకర్ సార్ తాను అనుకున్న లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఉద్యమానికి తాను సిద్ధాంతకర్తను కాను, స్వచ్ఛంద కార్యకర్తను మాత్రమే అని చెప్పిన జయశంకర్ సార్.. తన బలం, బలహీనత రెండూ తెలంగాణే అంటుండేవారు. అందుకు… నాటి చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకూ.. ఇప్పటి కేసీఆర్, కోదండరాం వరకూ.. తెలంగాణ కోసం పోరాటాలు చేసిన నాయకులందరితో కలిసి పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ గురువుగా…. తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్తగా…. ఉద్యమంలో మార్గదర్శిగా నిలిచారు. నరనరాన తెలంగాణ ఉద్యమాన్ని నింపుకొని…. ఇంటికి పెద్దన్నలా చేయి చేయి కలిపి తెలంగాణ ఉద్యమ వంతెనను నిర్మించారు. వందల ప్రశ్నలకు తానొక్కడినే సమాధానం అంటూ దేనికైనా ముందు వరుసలో నిలబడ్డారు.

యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక… రాష్ట్రంలో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ సబ్బండ వర్ణాలు ఏకమై…. రోడ్డెక్కాయి. నిరసనలు, ధర్నాలతో ఢిల్లీని కదిలించాయి. టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగడంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆ సమయంలో.. అప్పటి కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమ నాయకత్వ ప్రతినిధిగా… జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు. చర్చలు, సంప్రదింపుల్లో కేసీఆర్ తరఫున ఆయనే పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమంటూ… 2009 డిసెంబర్ 9 న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను కారణమయ్యారు.

నాటి కేంద్రం ప్రకటనతో.. అంతా సంబురాలు చేసుకున్నారు. విద్యార్థుల్లో ఆనందం చూసి జయశంకర్ సార్ ఎంతో సంతోషించారు. అడుగుదూరంలో లక్ష్యం ఉందని ఆయన కూడా సంబురాల్లో భాగమయ్యారు. తెలంగాణ సాధించాకే కన్నుమూస్తానని చెప్పిన సార్… ఆ కల నెరవేరబోతోందని కూడా అనుకున్నారు. కానీ… తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాష్ట్ర సాధనకు బ్రేక్ పడింది. కానీ… అప్పుడు కూడా సార్ వెనక్కు తగ్గలేదు. రాష్ట్ర సాధనకు అవసరమైన ఊపిరిని… వీలైనంతగా అందించారు. ఆ తర్వాత.. కొన్నాళ్లకు అనారోగ్యం జయశంకర్ సార్ ను బాధించింది. ఉద్యమం కీలకదశకు చేరిన సమయంలో 2011 జూన్ 21న కన్నుమూశారు.

చివరి శ్వాస వరకూ.. తెలంగాణ ఉద్యమమే ఆశగా, శ్వాసగా బతికారు. తెలంగాణ ప్రజలకు ఎదురైన ప్రతి పరాభవానికీ ఆయన కలత చెందుతూ వచ్చారు. అడుగడుగునా తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న అవమానాలను తన అవమానాలుగా భరించారు. జాతి బాధను తన బాధగా.. జాతి అభివృద్దిలోనే తన మనుగడ ఉందని తలిచారు.అదే జయశంకర్ ఉద్యమానికి ఓ ఉద్యోగస్తుడిలా మారి పనిచేసేలా చేసింది. ప్రత్యేక తెలంగాణ వాదం కేవలం ఒక రాజకీయ నినాదం కాదని…. దానికి బలమైన ఆర్ధిక కారణాలున్నాయనీ… విశిష్టమైన సాంస్కృతిక కోణంతో పాటు… సుదీర్ఘమైన చారిత్రక నేపధ్యం ఉందని చెప్పేవారు… జయశంకర్ సార్. వీటన్నిటితో ఊపిరి పోసుకున్నది కనుకనే.. తెలంగాణ ఉద్యమం ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తొణకదని ఆయన చెప్పేవారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకున్నా… సార్ కలగన్న తెలంగాణ సాకారమై… ఆయన చూపిన బాటలోనే అడుగు ముందుకు వేస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy