తెలంగాణ మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ ఏర్పాటు

GHMC..జీహెచ్‌ఎంసీ పరిధికి వర్తింపు
..సభ్యులుగా జడ్జి, పురపాలక అధికారులు 
..భవన వివాద కేసులన్నీ ట్రిబ్యునల్‌కు బదిలీ
..ప్రతి కేసు ఆరు నెలల్లో పరిష్కారం 
..సెలవు దినాలు మినహా వారమంతా విచారణలు
..ఇష్టారాజ్యపు స్టేలకు ఇక కాలం చెల్లు
..అక్రమ కట్టడాల లెక్క తేల్చేస్తారు

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను నిరోధించడానికి కఠిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందుకోసం తెలంగాణ మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందాలంటే నగర విస్తరణ-అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా సాగాలని భావిస్తున్నారు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు. నగరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరమని గుర్తించారు కేటీఆర్. ఆయన సూచనలతో మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం జీవో విడుదల చేశారు పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్. ఒక న్యాయమూర్తి చైర్మన్‌గా ఉండే ఈ ట్రిబ్యునల్ నగరంలోని అన్ని భవన నిర్మాణ వివాదాలను విచారిస్తుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతానికి ఈ ట్రిబ్యునల్‌ని వర్తింపజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని యోచిస్తున్నారు మంత్రి.

ఇదీ ట్రిబ్యునల్ స్వరూపం..

మున్సిపల్ ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా ఒక న్యాయమూర్తిని నియమిస్తారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి, సూపరింటెండెంట్, టైమింగ్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నీ తక్షణమే ఈ ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి. ఇకపై ఈ ట్రిబ్యునలే హైదరాబాద్‌లోని అన్ని భవన నిర్మాణ వివాదాలపై నిర్దేశించిన కాలపరిమితిలో విచారణ పూర్తి చేస్తుంది. ఈ ట్రిబ్యునల్ వ్యవహార భాష ఆంగ్లంగా నిర్ణయించారు. ప్రజలు తెలుగు లేదా ఉర్దూలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు రూ.500 ఫీజును జాతీయ బ్యాంకుల్లో డీడీ తీయాల్సి ఉంటుంది. ప్రతి కేసును సుమారు ఆరు నెలల్లోపు ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఆదివారం, ఇతర సెలవు దినాలను మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులూ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పని చేస్తుంది.

ఎందుకీ ట్రిబ్యునల్?

హైదరాబాద్‌ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే అక్రమ కట్టడాల్ని కఠినంగా నిరోధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే నగర విస్తరణ అస్తవ్యస్తంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పటికే నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్, మణికొండ వంటి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అక్కడ చినుకు వర్షం పడినా అపార్టుమెంట్ల సెల్లార్లకు నీరు చేరిపోతున్నది. చుట్టూ ఓ వాహనం కూడా తిరుగడానికీ స్థలం లేనివిధంగా కట్టిన అపార్టుమెంట్లు కోకొల్లలు. అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఫైరింజన్లు ఏమీ చేయలేని పరిస్థితి. నగరంలోనూ కొందరు డెవలపర్లు.. రెండు, మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదారు అంతస్తులను నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకుంటే స్థానిక కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుని యథావిధిగా నిర్మాణాల్ని చేపడుతున్నారు. వీరికి తోడుగా టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎంతో కొంత ముట్టచెప్పి, ఆయా నిర్మాణాల్ని తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజానీకానికి అంటగడుతున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఫ్లాట్లను కట్టడం వల్ల, సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వల్ల ఇకపై ఇష్టం వచ్చినట్టు స్టేలు తెచ్చుకోవడం ఉండదు. పైగా ఆరు నెలల నిర్ణీత వ్యవధిలో కేసుల పరిష్కారం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

వెలవెలపోతున్న చట్టాలు..

వాస్తవానికి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అపార్టుమెంట్లను నియంత్రించడానికి 2008 మున్సిపల్ చట్టం 9 ప్రకారం రెండు మార్గాలున్నాయి. అక్రమ నిర్మాణాల్ని చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసి, స్థలం విలువపై 200 నుంచి 600 శాతం జరిమానాను విధించడం లేదా అట్టి నిర్మాణాల్ని పూర్తిగా కూల్చివేయడం. జీహెచ్‌ఎంసీ ఇలాంటి చర్యలు చేపడుతున్నప్పుడు కొందరు డెవలపర్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. దీనితో జీహెచ్‌ఎంసీ ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మరోవైపు నగరపరిధిలో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రత్యేకంగా మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy