తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు 67 ఏళ్లు

hqdefault (1)అది మట్టి మనుషుల పోరాటం. నిజాం రాజ్యాన్ని నేలమట్టం చేసిన చరిత్ర. భూమి కోసం, భుక్తి కోసం, దాస్య శృంఖలాల విముక్తి కోసం సాగిన మహాయుద్ధం. బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవుల తిరుగుబాటు. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి… జనం నడిపిన విప్లవం. బాంచన్ దొర.. కాల్మొక్త అన్న గొంతుకలే, గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులను పెకిలించిన పోరాటానికిపుడు 67 ఏళ్లు. సెప్టెంబర్ 17 చరిత్రపై V6 స్పెషల్ స్టోరీ.

ప్రపంచ చరిత్రలో చెరగని అధ్యాయం…. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. వీర తెలంగాణ విప్లవ పోరాటం. సెప్టెంబర్ 17 ను గుర్తుచేసుకుంటే ఎన్నో పోరాటాలు కళ్లముందు కదులుతాయి. మరెన్నో దారుణాలు గుర్తుకొస్తాయి. దశాబ్దాలుగా స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమాల తెలంగాణ గడ్డ గుర్తుకొస్తుంది. ఆ మరువని చారిత్రక పోరాటానికి 67 ఏళ్లు.

page 8 top phహైదరాబాద్ సంస్థానం. 1948 ముందు వరకూ ఈ సంస్ధానాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించేవారు. దీన్నే తెలంగాణ, హైదారాబాద్ రాష్ట్రం అని కూడా పిలిచేవాళ్ళు. హైదరాబాద్ సంస్థానం పరిధిలో 16 పరగణాలుండేవి. భాషా ప్రాతిపదికన ఈ పదహారు జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజించి పాలించేది నైజాం సర్కార్. తెలుగు వాళ్లకు 8 జిల్లాలు… మరాఠీలకు 5 జిల్లాలు… కన్నడిగులకు 3 జిల్లాలుండేవి.

తన పాలన కొనసాగిస్తూనే నిజాం ప్రభువు బ్రిటీష్ వారికి సామంతుడిగా వ్యవహరించేవాడు. నిజాం పాలనలో గ్రామాలన్నీ భూస్వాములు, పెత్తందార్లు, పటేల్ లు, పట్వారీల ప్రాబల్యంలో ఉండేవి. తెలంగాణలోని 10 వేల గ్రామాల్లో సుమారు 3 వేల గ్రామాలు నిజాం జాగీరు గ్రామాలే. జాగిరంటే సొంత ఆస్థి అని. మిగతావి జమీన్ దార్, పటేల్, పట్వారీల ఆధీనంలో ఉండేవి. వీళ్లంతా నిజాం ప్రభువుకు గ్రామాల్లో తొత్తులుగా వ్యవహరించే వాళ్లు. ప్రజలు నిజాం కన్నా ఈ దొరల మీదనే వ్యతిరేకతను పెంచుకున్నారు.

large-Female-Telangana-Movement-fighters-in-an-undated-picture-from-the-1960sపుట్టుకకు పన్ను, చావుకు పన్ను. వేడుకైనా… వేదనకైనా…. పన్ను కట్టాల్సిందే. మనుషులన్న ఒక్క గుర్తింపు తప్ప… బతుకు దుర్భరంగా సాగే రోజులవి. శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, వెట్టి చాకిరీ. అలాంటి పరిస్థితుల్లో… ఆలోచనలే ఆయుధాలయ్యాయి. పోతే ప్రాణాలు…. వస్తే స్వాతంత్ర్యం అన్న ఒకే ఒక్క నినాదంతో రజాకార్లకు, జమీందార్లకు, పట్వారీలకు ఎదురు తిరిగాయి తెలంగాణ గ్రామాలు.  నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం సామన్య జనం తిరగబడి…. మహిళలు సైతం బంధూకులు పట్టి పోరాడిన మహాత్తర ఘట్టం అది. ఈ పోరాటంలో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిది.  1946 నుంచి 1951 వరకు మహోద్యమంగా జరిగిన ఈ పోరాటంలో 4 వేల మందికి పైగా అమరులయ్యారు. నిజానికి 1947 ఆగస్టు 15న దేశానికి విముక్తి లభించింది. కాని నిజాం పాలనలోని తెలంగాణకు మాత్రం బానిసత్వం పోలేదు. నాటి ఉపప్రధాని, కేంద్ర హోం మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతో 13నెలల రెండు రోజులకు 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తిపొందింది హైదరాబాద్ స్టేట్. దేశ చరిత్రలో సెప్టెంబర్ 17 కు పెద్దగా ప్రాముఖ్యత లేదు. కానీ హైదరాబాద్ రాష్ట్రానికీ, తెలంగాణ చరిత్రకు ఈ రోజు ఓ ప్రత్యేక పేజీ. కొందరు దీన్ని విలీనమంటున్నారు. మరికొందరు విముక్తి అంటున్నారు. ఇంకొందరు విద్రోహమంటున్నారు. ఎవరి వాదన ఏదైనా… ఈ రోజుకున్న ప్రత్యేకతను ఎవరూ కాదన లేనిది. ఎందరెందరో త్యాగధనుల ఈ పురిటిగడ్డకు వీసిక్స్ చెబుతోంది మా తుజే సలామ్…

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy