తెలంగాణ సాహిత్యానికి సాక్ష్యం.. సురవరం ప్రతాప రెడ్డి..!

Suravaram_Pratapa_Reddyతెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి

1921లోనే హైదరాబాద్ లో ఆంధ్రజన సంఘాన్ని స్థాపించిన సురవరం

ఇవాళ ఆయన 120 వ జయంతి

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ రాజకీయ,సాంఘీక చైతన్యానికి నిలువుటద్దం. తెలంగాణలో కవులే లేరన్న అహంకారానికి ఘనమైన సాహిత్య చరిత్రను సాక్ష్యంగా చూపిన మనిషి. తెలంగాణ కోసం ఆయన పడ్డ తపన..సాంస్కృతిక చరిత్రలో ఒక అధ్యాయంలా నిలిచింది..ఆయనే తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి.. ఆయన 120వ జయంతి ఈ రోజు. ఆత్మగౌరవం కోసం అందరికంటే ముందే నినదించిన గొంతు సురవరం ప్రతాపరెడ్డి.. జీవితకాలంలో సురవరం చేసిన నాలుగు దశాబ్దాల సాహితీ సేవ మహోన్నత శిఖరం లాంటిది. రచయిత.. పరిశోధకుడు, భాషోద్యమనాయకుడు… పాత్రికేయుడు.. గ్రంథాలయోద్యమకారుడు, సంఘ సంస్కర్తగా ప్రతాపరెడ్డి సాధించిన విజయాలు తరతరాలకు ఆదర్శం.

1896 మే 28న మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం ఇటిక్యాలపాడులో సురవరం ప్రతాపెడ్డి జన్మించారు..తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నాన్న రామకృష్ణారెడ్డి..సురవరం సంరక్షణ బాధ్యతలు చూశారు..ఏబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కాలేజీలో ఉన్నత విద్య పూర్తిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ, తిరువాన్ కూరులో బిఎల్ చదివారు. కొన్నిరోజులు ప్లీడరీ ప్రాక్టీస్ చేశారు. అయితే హైదరాబాద్ కొత్వాల్ రాజబహదూర్ వెంట్రామిరెడ్డి విజ్ఞప్తితో నగరానికి వచ్చి రెడ్డి హాస్టల్ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. దాన్నో విద్యాలయంగా మార్చారు.. వెయ్యి గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీని 11 వేల గ్రంథాలకు పెంచి విద్యార్థుల్లో భాషాభివృద్దికి కృషి చేశారు.

మద్రాస్ లో చదవుకోవడంతో ప్రతాపరెడ్డిపై జాతీయ ఉద్యమప్రభావం ఎక్కువగా ఉండేది. నిజాం పాలనలో మాతృభాష తెలుగు పతనపు అంచులకు చేరిందని సురవరం తపించేవారు. సంస్కృతి శరీరంలాంటిదయితే భాష శ్వాసలాంటిదని భావించి భాషాభిమానులతో కలిసి 1921లోనే హైదరాబాద్ లో ఆంధ్రజన సంఘాన్ని స్థాపించారు. అదే సంవత్సరం ఉచ్ఛల విషాదమనే నాటకం రాశారు. కొత్వాల్ రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి, మాడపాటి హనుమంతరావు ప్రోత్సాహంతో 1926లో గోలకొండ పత్రిక స్థాపించారు. ప్రతాపరెడ్డి సాహిత్య విశ్వరూపానికి ఈ పరిణామమే కారణమయింది..

గోలకొండ పత్రిక తో తెలుగు భాషా సాహిత్యోద్యమానికి ప్రతాపరెడ్డి మళ్లీ ప్రాణం పోశారు. ఉర్దూ అధికారిక భాషగా ఉన్న ఆకాలంలో తెలుగు చదివిన సబ్ ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు లేకపోవడంతో సంపాదకుడి నుంచి చప్రాసీ వరకు అన్ని బాధ్యతలను సురవరమే చూశారు. 1939 వరకు ఒక్కరే తొమ్మిది వందలకు పైగా చిలుక వ్యాసాలు, పద్యాలు, సంపాదకీయాలు, తమాషా ముచ్చట్లు, విమర్శలు రాశారు. భవకవి, రామమూర్తి, చిత్రగుప్త వెర్రి వెంగళప్ప లాంటి మారుపేర్లతో ఆయన రాసిన రచనలు సాహిత్యప్రియుల మనసు దోచాయి.. ఒక్క గోలకొండ పత్రికలోనే రెడ్డిగారి పదిహేనువందల రచనలు అచ్చయ్యాయి. పత్రికా కార్యాలయం సాహితీ నిలయంలా విద్వాంసులతో కళకళలాడేది. ఇంతేకాదు స్త్రీ స్వేఛ్చను సమర్థించి మహిళల అభిమానాన్ని పొందారు. గోలకొండ పత్రికతో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు. తెలంగాణ ప్రజల పట్ల నిజాం ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ సంపాదకీయాలు రాశారు. సీరియస్ అయిన నిజాం.. పత్రికపై సెన్సార్ షిప్ విధించాడు. సమాచార శాఖ అనుమతితోనే సంపాదకీయాలు ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దీంతో ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించి నిజాంను పరేషాన్ చేశారు..

తెలంగాణలో కవులే లేరన్న కోస్తాంద్ర కవి ముడంబ వెంకట రాఘవాచార్యుల వెక్కిరింత ప్రతాపరెడ్డిలో పౌరుషాన్ని రగిల్చింది. తెలంగాణ సాహిత్య మాగాణంలో విరిగబూసిన కవిత్వాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని కవులను వెతికి కవితలు రాయించారు. పూర్వ కవుల జీవిత విశేషాలను, వారి సాహిత్యాన్ని సేకరించారు. తెలంగాణలో కవులకు, సాహిత్యానికి ఢోకా లేదని నిరూపిస్తూ మూడు వందల యాభై మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934 లోనే ప్రచురించారు..ఇంతేకాదు వర్తమాన పండితుల కోసం విజ్ఞాన వర్థనీ పరిషత్తు స్థాపించారు..ఇల్లిందల సీతారామారావు,కేశవ పంతుల నరసింహ శాస్త్రీ,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, భాస్కరభట్ల కృష్ణారావు, బివి రమణరావు లాంటి ఎందరో ప్రముఖులను వెలుగులోకి తెచ్చారు.

కొత్తపుస్తకం ఏదైనా కనిపిస్తే ప్రతాపరెడ్డి వదిలేవారు కాదు..అందులోని విషయాలపై అభిప్రాయం రాసేవారు. నలుగురితో చర్చించేవారు…గ్రాంథిక, వ్యవహారిక వాదాలు విన్నారు… వీరేశలింగం కవుల చరిత్ర, చిలకమర్తి గ్రంథాలు, పద్యకావ్యాలు చదివారు. చందస్సు నేర్చుకున్నారు.. పద్యాలు రాశారు.. కథలు, నాటకాలు, విమర్శగ్రంథాలు, పరిశోధనాత్మక గ్రంథాలు, కవితలు ముద్రించారు. రంగనాథ రామాయణాన్ని గోన బుద్దారెడ్డి రాశారని నిరూపించారు. తిక్కన భారతం, దశకుమార చరిత్ర, గాధాసప్తశతి, జైన రామాయణం పై సురవరం రాసిన వ్యాసాలు పండితులను మెప్పించాయి. భక్త తుకారాం నాటకాన్ని ప్రతాపరెడ్డే ముందు రాశారు. రెడ్డిగారి రచనలు లేకుండా నాటి పత్రికలు వచ్చేవి కావు. సురవరం రాసిన నిరీక్షిణ కథానిక హిందీ,  ఉర్దూ, పార్శీ, కన్నడ, మరాఠీ భాషల్లోకి అనువాదం అయింది. ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘీక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తన రచనల్లో తెలంగాణ మాండలికాన్ని భద్రపరిచి ఎన్నో పదాలను ప్రతాపరెడ్డి కాపాడారు.

రాజకీయాలకు దూరంగా ఉండే ప్రతాపరెడ్డి సన్నిహితుల బలవంతంతో 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో వనపర్తి శాసనసభ నియోకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అగష్టు 25 1953 న సురవరం చనిపోయారు..ఆయన చేసిన సాహిత్య సేవను గౌరవిస్తూ ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఆంధ్రాకవులు, సాహిత్యకారులకు ఇచ్చిన గౌరవాన్ని సీమాంధ్ర పాలకులు కాని, మేయిన్ స్ట్రీమ్ ఆంధ్రా మీడియా కాని సురవరం ప్రతాపరెడ్డికి ఇవ్వడం లేదు.. వీరేశలింగం, శ్రీశ్రీ, జాషువాలకు జయంతి ఉత్సవాలు జరిపే ఆంధ్రా సాహిత్యకారులు…తెలంగాణ వైతాళికుడు ప్రతాపరెడ్డిని తగురీతిలో గౌరవించరు. గోలకొండ పత్రిక స్థాపన తో తెలంగాణలో సురవరం చేసిన భాషాసేవ, తెలంగాణ సాహిత్య చైతన్య దీపికగా ప్రతాపరెడ్డి రాసిన గోలకొండ కవుల సంచిక, 20 ఏళ్ల పాటు పరిశోధించి తెలుగుజాతికి అమూల్యకానుకగా ఆయనిచ్చిన ఆంద్రుల సాంఘీక రాజకీయ చరిత్ర గ్రంథం, ఆయన రాసిన రచనలతో తెలంగాణ సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్రపుటల్లో సురవరం ప్రతాపరెడ్డి పేరు నిలిచి ఉంటుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy