తెలుగుజాతి ఆత్మఘోష

Lagadapati Rajagopalఆత్మగౌరవం గురించి చెప్పుకునే రోజులు పోయాయి. మనం మాట్లాడుకోవడానికి ఆత్మహత్యలు, ఆత్మఘోషలే మిగిలాయి. పార్లమెంట్ చరిత్రలో టెర్రరిస్టులు దాడిచేసిన సంఘటన తర్వాత అంతకంటే అవమానకరంగా చెప్పుకోవడానికి సీమాంధ్ర ఎంపీలు మరో సంఘటనను సృష్టించారు. సమైక్యవాదానికి మారుపేరుగా చెప్పుకునే ఎంపీ లగడపాటి ఆ వాదానికే కాదు ఏకంగా తెలుగుజాతి గౌరవానికే సభలో తలకొరివి పెట్టేశారు. అత్యున్నత చట్టసభగా, రాజ్యాంగం నిర్మించిన పవిత్రదేవాలయంగా భావించే పార్లమెంటులోనే టియర్ గ్యాస్ ప్రయోగంతో ప్రజాస్వామ్యాన్ని కన్నీళ్లు పెట్టించారు.

ఇలాంటి వికృతమైన చేష్టలతో లగడపాటి ఏం సాధించారు? తెలుగుజాతి ప్రతిష్ఠను నిలబెట్టారా? సమైక్యరాష్ట్రాన్ని కాపాడారా? కనీసం సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడుకున్నారా? నిజానికి ఇవేం సాధించకపోగా తెలుగువాళ్ల రాష్ట్రం ఒకటిగా ఎప్పుడూ కలిసి ఉండలేని పరిస్థితిని తేవడంలో మాత్రం కచ్చితంగా లగడపాటిది సక్సెస్సే. తెలుగు వాళ్లంతా ఒక్కటే అనే స్వచ్ఛమైన భావనకు తలకొరివి పెట్టి, సొంత వ్యాపార ప్రయోజనాలకు సమైక్యవాదం ముసుగేసిన లగడపాటి లాంటి నేతలు తెలుగు ప్రజల మధ్య అగాథం పెంచడానికే ప్రయత్నించారుగానీ ఏనాడూ కలిపి ఉంచేలా అడుగులు వేయలేదు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణలో ఉద్యమం జరుగుతుంటే దాన్ని సరిచేసే ప్రయత్నం లేకపోగా, అసలేం జరగలేదని వాదించడంతోనే టైంపాస్ చేశారు.

చివరికి విభజన ఖరారైనా తర్వాతైనా హుందాగా ప్రవర్తించారా అంటే అదీ లేదు. సీమాంధ్ర కోసం ఏం కావాలో స్పష్టమైన ప్రతిపాదనలు చేసిన పాపాన పోలేదు. చిరంజీవి, కావూరి లాంటి వాళ్లు హైదరాబాద్ ను యూటీ చేయాలన్న డిమాండ్ తప్ప మరేం లేనట్టు ప్రవర్తించారు. కొత్త రాజధానికి ఏం కావాలి? వెనుకబడిన ప్రాంతాలకు ఏం చేయాలి? విద్య, వైద్య సదుపాయాల్లో జరుగుతుందని చెబుతున్న నష్టానికి పరిష్కారం ఏంటి? ఇలాంటి డిమాండ్ల కోసం సీమాంధ్ర ఎంపీలు అడిగిన సందర్భం లేదు. హైదరాబాద్ యూటీ, మిగులు జలాల ప్రాజెక్టులకు నికర జలాలు, రాయల తెలంగాణ లాంటి అర్థంలేని ప్రతిపాదనలనే తలకెత్తుకొని తిరిగారు. భద్రాచలం మొత్తాన్నీ సీమాంధ్రలో కలిపేయాలంటూ అర్థంలేని వాదాలు చేశారు.

చివరికి తెలంగాణ బిల్లు ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా అందులో సీమాంధ్రకు ప్రయోజనం కలిగించే సవరణలు ప్రతిపాదించారా? అంటే అదీ లేదు. ప్రతిసారీ బిల్లును వ్యతిరేకించడం, అసలు ముందుకు పోనివ్వం, సభే జరగనివ్వం అంటూ వాదిస్తూ వచ్చారు సీమాంధ్ర ఎంపీలు. రేపేం జరుగుతుందో చూడండి అంటూ ముందురోజే కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వార్నింగ్ ఇవ్వడాన్ని బట్టి ముందస్తు ప్లాన్ ప్రకారమే లగడపాటి దాడిచేసినట్టు కనిపిస్తోంది.

చివరికి లగడపాటి సాధించింది… విభజన తర్వాత తాను కోరుకున్న రాజకీయ సన్యాసమే. పార్లమెంట్ లో టెర్రరిస్ట్ దాడి తరహాలో ప్రవర్తించిన తీరుకు శాశ్వతంగా అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంపై టియర్ గ్యాస్ ప్రయోగంతో లగడపాటి తెలుగుజాతికి కన్నీళ్లు పెట్టించారు. సీమాంధ్ర ప్రయోజనాలు పట్టించుకోని నిర్వాకంతో తెలుగుజాతికి శాశ్వతంగా ఆత్మఘోష మిగిల్చారు. తెలుగుజాతి చరిత్రలో చించి పారేయాల్సిన పేజీలో తన పేరు రాసుకున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy