తెలుగు మహాసభలు నిర్వహించేది ఈ కాలేజీ వాళ్లే…

telugu-maha-sabhaఅది ఎంతో మంది తెలుగు భాషా పండితులను తయారు చేసిన కాలేజీ. సంస్కృతాంధ్ర.. ఉభయ భాష బోధించే ఒకే ఒక్క కాలేజీగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఇక్కడ తెలుగు నేర్చుకున్నవారే నిర్వాహకులుగా, వక్తలుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్మపురి సంస్కృతాంధ్ర కాలేజీ మూతపడే స్థితికి వచ్చింది. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా సంస్కృతాంధ్ర్ర కాలేజీపై స్పెషల్ స్టోరీ.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్న శ్రీలక్ష్మినరసింహ సంస్కృతాంధ్ర కాలేజీకి  ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధర్మపురి వేద పండితులకు నిలయం అయితే సంస్కృతాంధ్ర కాలేజీ తెలుగు భాషా పండితులకు నిలయం అయింది. ఈ కాలేజీలో తెలుగు, సంసృతం నేర్చుకున్న ఎంతో మంది భాషా విశిష్టతను, గొప్పతనాన్ని చాటి చెప్పారు. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ప్రవచన పండితుడు సంగనభట్ల సంతోష్ కుమార్ తో పాటు చాలామంది వేదపండితులు, తెలుగు భాషా పండితులు ఇక్కడే చదువుకున్నారు.

సంస్కృతం, తెలుగును కాపాడాలనే ఉద్దేశంతో ధర్మపురికి చెందిన బ్రహ్మశ్రీ గండి రాజన్నశాస్త్రి 1966లో గోదావరి తీరాన ఈ కాలేజీని స్థాపించారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎయిడెడ్ కాలేజీగా పనిచేస్తుంది. ఎయిడెడ్ కాలేజీ కావడంతో లెక్టరర్లు జీతాలు తప్ప మిగతా నిర్వహణ అంతా యాజమాన్యమే చూసుకుంటుంది. రెండేళ్ల ప్రి డిగ్రీ కోర్సుతో పాటు మూడేళ్ల బీఏ లాంగ్వేజ్ కోర్సులు కాలేజీలో ఉన్నాయి. మిగతా కాలేజీల కంటే భిన్నంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదింటికి వరకు కాలేజీ నడుస్తుంది.

యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీ.. ఆర్థిక సంఘం ప్రణాళిక ప్రకారం ఏటా పత్యేక నిధులను సమకూర్చుకొని కావాల్సిన వసతులను ఏర్పాటు చేసుకుంటుంది. తెలుగును ప్రోత్సహిస్తూ తెలుగు భాషా పండితులను తయారు చేయాలనే ఉద్దేశంతో సర్కార్ ట్యూషన్ ఫీజుకు మినహాయింపు నిచ్చింది. కేవలం ఏడాదికి 350 రూపాయల చెల్లింపుతో కాలేజీలో చదువుకునే అవకాశం కల్పించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 30 ఏళ్లపాటు పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేసి కాలేజీని అభివృద్ధి చేశారు. కాలేజీలో చదువున్నవారిలో చాలా మంది మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదికలపై ఈ కాలేజీలో చదువుకున్నవారే ఎక్కువగా ప్రసంగాలు చేయనున్నారు. ఇక్కడ చదువుకున్న వారిజ రాణి, సంగనభట్ల నర్సయ్య మహాసభల నిర్వహణలో క్రియాశీలక భాగస్వామ్యులుగా పనిచేస్తుంటే మెరుగు రాంచందర్ కవి సమ్మెళనంలో పాల్గొంటున్నాడు.

ఒకప్పుడు తెలుగు పాఠాలు, పద్యాలు, శ్లోకాలతో మార్మోగిన కాలేజీలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 4 వందల మంది విద్యార్థులకుగానూ ప్రస్తుతం 130 మంది విద్యార్థులే ఉన్నారు. తెలుగు భాషపై విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం ఒక కారణమైతే తెలుగు చెప్పే లెక్లరర్లు లేకపోవడం మరో కారణం. లెక్చరర్లు లేక విద్యార్థులు పూర్తిస్థాయిలో తెలుగు భాష పాండిత్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు. తెలుగు భాషపై అభిమానం, కాలేజీలో చదువుకున్న కృతజ్ఞతతో కొంతమంది పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న ఇంకొందరు.. స్వచ్చంధంగా క్లాసులు చెబుతున్నారు.

ప్రభుత్వం కాలేజీని పట్టించుకుని కొత్త లెక్చరర్లను తీసుకోవాలంటున్నారు కాలేజీ స్టాఫ్. తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలిసేలా చేసి కాలేజీకి మరింత గుర్తింపు తీసుకురావాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.  ఎంతోమంది తెలుగుభాషా పండితులుగా తీర్చిదిద్దిన ఈ కాలేజీకి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy