తెలుగోళ్ళ మూడ్ ను చెప్పేసే మున్సిపల్ ఎలక్షన్లు

ఈ నెల 30న జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు కేవలం మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కొత్త గవర్నింగ్ బాడీలను నిర్ణయించడమే కాదు. తెలుగు ప్రజల మూడ్ ఎలా ఉందో తేల్చి చెప్పేస్తాయి. రాజకీయ పార్టీల జాతకం తేల్చేస్తాయి. ఏప్రిల్ నెలలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్లకు ఇవి రిహార్సల్ లాంటివి.  ఇటు తెలంగాణ, అటు రాయలసీమ, ఆవైపు ఆంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి జరుగుతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లు జనం నాడిని పట్టిస్తాయి.  అదీగాక, రెండు నెలల తరువాత పరిస్థితులు ఊహించలేం. ఇప్పుడైతే, విభజన వేడి రెండుచోట్లా ఉంది. జనం కరెక్టు ఒపీనియన్ తెలిసేది ఇప్పుడే.

రాష్ట్ర విభజన తరువాత జరగబోతున్న తొలి ఎన్నికలు ఇవి. పేరుకి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఎన్నికలు జరుగుతున్నా అఫీషియల్ గా రాష్ట్రం విడిపోవడంతో వేరు వేరుగా జరుగుతున్న ఎన్నికలుగానే చూడాలి. విభజన విషయంలో జనం ఏమనుకుంటున్నారో ఈ ఎన్నికలు సూటిగా చెప్తాయి. సీమాంధ్ర ప్రాంతంలో జనం ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఆ ఆగ్రహం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మీద చూపిస్తారో చూడాలి. అలాగే, తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆనందోత్సాహాలు ఎవరికి మేలు చేస్తాయో చూడాల్సిందే.

తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని లెటర్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీమీద సీమాంధ్ర ప్రజలు వేటు వేస్తారో, ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని విడగొట్టొచ్చని ఐడియా ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ మీద కోపం చూసిస్తారో ఈ ఎలక్షన్లు ఖచ్చితంగా చెప్తాయి. అలాగే, ఈ రెండు పార్టీలను కాకుండా , ఆగమేఘాలమీద తెలంగాణ రాష్ట్రం కోసం పరుగులు పెట్టిన కాంగ్రెస్ మీద కసి చూపిస్తారా, లేదా? అనేది తేల్చేది కూడా ఈ ఎలక్షన్లే. టీ బిల్లుకు సపోర్ట్ ఇచ్చిన బీజేపీని ఓటర్లు ఛీ కొడతారో….లేకపోతే ప్యాకేజీలు అవీ తెచ్చినందుకు జై కొడతారో కూడా ఇప్పుడే తెలిసిపోతుంది.

తెలంగాణ తెచ్చిన క్రెడిట్ ఏ పార్టీకి ఇస్తారో కూడా మున్సిపల్ ఎన్నికలు తేల్చేస్తాయి. 13 ఏళ్ళ పాటు తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ ఎస్ కు ఈ విజయ ఫలితాన్ని కట్టబెడతారో, లేకపోతే తెలంగాణ కోసం అన్నింటికీ సిద్దపడిన కాంగ్రెస్ కు సై అంటారో కూడా మున్సిపల్ ఎన్నికలు తేలుస్తాయి. రెండు కళ్ళ సిద్ధాంతంతో ఎటూ మొగ్గకుండా ఉన్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎంత సత్తా ఉందో కూడా తెలియడానికి ఈ ఎలక్షన్లు శాంపిల్ గా ఉపయోగపడతాయి. టీ బిల్లు విషయంలో రెండురకాలుగా వ్యవహరించిన బీజేపీకి కూడా ఈ ఎన్నికలు పరీక్షే. చివర్లో టెన్షన్ పెంచిన బీజేపీకి శిక్ష వేస్తారో, ఆదరిస్తారో కూడా ఈ నెలాఖర్లో తెలిసిపోతుంది.

కేవలం పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలని వీటిని తేలిగ్గా కొట్టి పారేయలేం. దాదాపు కోటిమంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓట్లేయాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5 కోట్ల 60 లక్షలవరకు ఉంది. ఇందులో కోటిమంది ఈ ఎన్నికల్లో ఓట్లేస్తారంటే మాటలు కాదుకదా. ఏ ఎన్నికల సర్వే అయినా సరే, ఐదారువేలమంది ఓటర్ల అభిప్రాయాల్నే సేకరిస్తారు. అంటే ఐదారువేల శాంపిల్స్ తో తేల్చే సర్వేలకంటే దాదాపు కోటిమంది ఇచ్చే తీర్పే కీలకం కదా!

పార్టీల ప్రాతిపదికపై జరగబోతున్న ఎన్నికలు కనుక ఓటర్ల నాడి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఏ జిల్లాలో ఎలాంటి మూడ్ ఉందో క్లియర్ గా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల రిజల్స్ బట్టే పార్టీల టిక్కెట్లకు డిమాండ్ ఉంటుంది. కొన్ని పార్టీలకు ఈ ఎలక్షన్లు మేలు చేయడం ఎంత ఖాయమో…. కొన్ని పార్టీలను దెబ్బతీయడమూ అంతే గ్యారంటీ.

లోకల్ ఇష్యూలే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ప్రభావం చేస్తాయన్నది నిజమే కానీ, ప్రస్తుతం స్టేట్ లో పరిస్థితులు చూస్తుంటే వాటికన్నా రాజకీయ ప్రభావమే ఎక్కువుంటుందన్నది గ్యారంటీ.

అందరికన్నా మాజీ  సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇదో గోల్డెన్ ఆపర్చూనిటీ. కొత్త పార్టీ పెడితే, జనం రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోడానికి కిరణ్ కుమార్ రెడ్డికి ఇదో అవకాశం. బహుశా ఆయన డైలమాను మున్సిపల్ ఎలక్షన్లు క్లియర్ చేయొచ్చునేమో! అయితే, కొత్త పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కామన్ సింబల్ ఇవ్వరు. ఆ పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లగానే పోటీ చేయాల్సి ఉంటుంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy