
వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించారు. సుఖదు:ఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నారు వాణిశ్రీ. ఈ సినిమాలో ఇది మల్లెల వేలయని ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తర్వాత హీరోయిన్ గా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు ఇండస్ట్రీలో అగ్రతారగా నిలచారు.
వాణిశ్రీ సినీ ప్రస్థానం చిన్న వేషాలతోనే ప్రారంభమయ్యింది. చిన్న చెలికత్తె వేషం వేసినా ఆమె మంచి నటనను ప్రదర్శించి ఆకట్టుకునే వారు. సావిత్రి, అంజలి, జమున ఒక తరం వారు. ఆ తర్వాత ఎవరు వస్తారు? ఆ ఖాళీలను ఎవరు పూరిస్తారు? అని చాలా మంది అనుకుంటూ ఉండేవారు. ఈ ఖాళీని వాణిశ్రీ పూరించారు. ఆ తర్వాత అగ్ర కథానాయకిగా వెలిగింది. ఆమె హీరోయిన్ గా ఉంటే చాలు సినిమా హిట్ అని నిర్మాతలు అనుకునే స్థాయికి చేరారు.
అప్పటి స్టార్ హీరోలు కూడా వాణిశ్రీతో నటించాలనుకునేవారు. ఆమెను హీరోయిన్ గా తీసుకోమని రెకమెండ్ చేసేవారు. అప్పట్లో ద్విపాత్రాభినయం చేసిన మొదటి హీరోయిన్ ఆమె. ప్రేమ్ నగర్, దసరాబుల్లోడు, జీవనజ్యోతి, కృష్ణవేణి సినిమాలు వాణిశ్రీకి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. సినిమాల్లోకి రావడానికి వాణిశ్రీ వెనక గాడ్ ఫాదర్లు ఎవరూ లేరు. తన స్వయం ప్రతిభతో సినిమాల్లో రాణించారు.
టాలీవుడ్ సహజనటుల్లో వాణిశ్రీ ఒకరు. పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి పాత్ర నుంచి పౌరుషమున్న మధ్యతరగతి యువతి దాకా నటించిన అనేక పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.