తొలి తరం సాహితీ వేత్త దాశరథి ఇక లేరు..!!

2004112103060501వేదాలను తెలుగులోకి అనువదించిన వ్యక్తిగా సాహితీ ప్రపంచంలో స్థానం

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన మహాకవి దాశరథి రంగాచార్య

తొలితరం తెలంగాణ సాహితీవేత్త దాశరథి రంగాచార్యులు చనిపోయారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు. ఖమ్మం జిల్లా చినగూడూరులో జన్మించిన రంగాచార్యులు సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ తొలితరం సాహితీవేత్త, సాయుధ పోరాట యోధుడు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడిగా ఎంతో ప్రాముఖ్యత పొందారు రంగాచార్యులు. ఉపాధ్యాయుడిగా, లైబ్రేరియన్ గా పనిచేసిన రంగాచార్యులు అన్న ప్రముఖ కవి, సాయుధ పోరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. సాయుధపోరాటం ముగిసిన తర్వాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు దాశరధి.

దాశరథి రంగాచార్యులు తండ్రి సనాతనవాది. అన్న ప్రముఖకవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల నీడలో.. అభ్యుదయ భావాలు, విప్లవ భావాలను వంటపట్టించుకున్నారు. 1945లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో చిన్నవయసులోనే రంగాచార్యులు కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. ఓవైపు ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే సమాజంలో అసమానతలపై ప్రజలను చైతన్యపరిచారు. రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనకడుగు వేయలేదు. తెలంగాణా సాయుధ పోరాటం నాటి పరిస్థితులను దాశరథి రంగాచార్యులు ‘చిల్లర దేవుళ్ళు‘, ‘మోదుగుపూలు‘, ‘జనపదం‘ నవలల్లో అక్షరరూపం ఇచ్చారు. ‘చిల్లర దేవుళ్లు‘ నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, ‘మోదుగుపూలు‘ నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, ఆతర్వాత పరిస్థితులు జనపదంలో రాశారు. తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తర్వాత ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.

తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి రచించిన ఘనాపాటి రంగాచార్యులు. తెలుగు భాషలో విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ ప్రాంత చారిత్రక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ “జీవనయానం” సాహిత్యంపై చెరగని ముద్ర వేసింది. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనల్ని పక్కన పెట్టి ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దాశరథి రంగాచార్యుల “చిల్లర దేవుళ్లు” నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందుకు గానూ రంగాచార్యులకు  అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు.ఇక సొంత జిల్లా ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటంతో రంగాచార్యులకు సత్కారం లభించింది. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో విశేషమైన సత్కారాలు, సన్మానాలు ఎన్నో ఆయనకు లభించాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy