దండం పెడతాం.. నోరు విప్పండయ్యా : రూ.వెయ్యి కాయిన్ వస్తుందా!

41501141534_625x300

నోట్ల రద్దు అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేత, రద్దుపై ప్రశ్నల వర్షం కురిపించిన విపక్షాలు.. గురువారం వెయ్యి రూపాయల కాయిన్ పై జరుగుతున్న ప్రచారాన్ని సభలో లేవనెత్తాయి. కొత్తగా ఈ కాయిన్స్ ను RBI విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని.. దీనిపై కేంద్రం వైఖరి ఏంటో నోరు విప్పాలని డిమాండ్ చేశారు ఎంపీలు.

కాంగ్రెస్‌  ఎంపీ గులాం నబీ ఆజాద్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వెయ్యి రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా లేదా అనే ప్రశ్నపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెయ్యి, 100 , 200 నాణాలపై వస్తున్న వార్తలను ప్రతిరోజూ చదువుతున్నామని.. ఇది నిజమా, కాదా అనేది ప్రకటించాలని పట్టుబట్టారు. వెయ్యి నాణాలను మోసుకెళ్లడానికి గోతాలు, సంచులు కొనుగోలు చేయాలో లేదో కూడా స్పష్టం చేయాలంటూ చురకలు అంటించారు. ఆర్థిక మంత్రి చెబితే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు.

డబ్బులకు సంబంధించిన ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించడం సాంప్రదాయమని గుర్తు చేశారు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్. అయితే దీనిపై డిప్యూటీ ఛైర్మన్ కురియన్  జోక్యం చేసుకుని ఇది RBI పని వివరించారు.  దీనిపై స్పందించిన అగర్వాల్‌ RBI వ్యతిరేకించిన నోట్ల రద్దుపై.. ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డీఎంకే ఎంపీ తిరుచి శివ, జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పట్టుబట్టారు. ప్రభుత్వ వివరణతో పుకార్లకు చెక్‌ పెట్టాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు  ఎంత పట్టుబట్టినప్పటికీ.. సభలోనే ఉండి అన్నీ వింటున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం నోరు విప్పలేదు. సమాధానం చెప్పలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy