దసరా అంటే మైసూరే.. ఎందుకంత స్పెషల్.?

mysore-dasaraమైసూరులో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రాజభవనంలోని ఏనుగుల ప్రదర్శన నిర్వహించారు. మైసూరు వీధులు మొత్తంగా సందడిగా మారిపోయాయి. కళకారుల ప్రదర్శనలు, డాన్సులు చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

మైసూరు దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా జరుపుకుంటారు. మైసూరు దసరా ఉత్సవాలకు సుదీర్ఘ చరిత్రే వుంది. మైసూరు దసరా వేడుకలు 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్యం పతనమైపోయిన తరువాత మైసూరుకు చెందిన వడయార్  రాజవంశస్తులు దసరా వేడుకలను కొనసాగించారు. రాజా వడయార్  1610వ సంవత్సరంలో శ్రీరంగపట్నంలో దసరా వేడుకలు నిర్వహించారు.

మైసూరు లోని చాముండి కొండపై చాముండి ఆలయంలో రాజదంపతులు తల్లి చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చేయడంతో దసరా వేడుకలు మొదలవుతాయి.  ఆ తరువాత మైసూరు ప్యాలెస్ లో ఒక ప్రత్యేక దర్బార్  జరుగుతుంది. 1805లో క్రిష్ణరాజ వడయార్  హయాంలో దసరా సంబరాల్లో ప్రత్యేక దర్బార్  నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ దర్బారుకు రాజకుటుంబం, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు, సామాన్యప్రజానీకం హాజరవుతారు. వడయార్  వంశీకుడు, నేటి యువరాజు యదువీర కృష్ణ దత్త ఒడయార్ ..ఈ సంవత్సరం దర్బారు నిర్వహించారు.

దసరాల్లో తొమ్మిదవ రోజైన మహానవమి కూడా ఎంతో మంగళప్రదమైంది. ఈ రోజున రాజఖడ్గాన్ని పూజించి ఏనుగులపైన, ఒంటెలపైన, గుర్రాలపైన ఊరేగింపులో ప్రదర్శిస్తారు. ఈ ఊరేగింపు విజయదశమినాడు మైసూరు నగర వీధుల్లో జరిగే దసరా ఊరేగింపు వేడుకల్లో ప్రధాన ఘట్టం. మైసూరు రాజమందిరం వైభవం శోభ అంతా మన కళ్ల ముందు కనిపిస్తుంది. అలంకరించిన ఏనుగుపై 750 కేజీల బరువు ఉన్న బంగారు అంబారిని ఉంచి ఆందులో చాముండేశ్వరీ అమ్మవారిని ఊరేగింపు చెయ్యడం ప్రధానమైన అంశం.

ఊరేగింపులో తీసుకుపోయే ముందు అమ్మవారి విగ్రహాన్ని రాజదంపతులు ఇతర ఆహ్వానితులు పూజిస్తారు. రంగురంగుల బొమ్మలు, డాన్సు గ్రూపులు, బ్యాండ్  మేళాలు, అలంకరించిన ఏనుగులు, గుర్రాలు ఒంటెలు నడుమ మైసూరు రాజమందిరం దగ్గర మొదలై ఊరేగింపు జమ్మి మంటపం వద్ద ముగుస్తుంది. ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జమ్మి మంటపం వద్ద ఆరుబయట జరిగే కాగడాల కవాతుతో ఉత్సవాలు ముగుస్తాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy